ఆగని కొత్త కేసులు

COVID-19: 63490 fresh cases reported in India in 24 hours - Sakshi

తగ్గుతున్న మరణాల రేటు

24 గంటల్లో 944 మరణాలు

న్యూఢిల్లీ: భారత్‌లో శనివారం కొత్తగా 63,490 కేసులు బయట పడటంతో మొత్తం కేసుల సంఖ్య 25,89,682కు చేరుకుంది. గత 24 గంటల్లో 53,322 మంది కోలుకోగా, 944 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 49,980కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 18,62,258 కాగా, యాక్టివ్‌ కేసుల సంఖ్య 6,77,444గా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్‌ కేసుల సంఖ్య 26.16 శాతంగా ఉంది.

దేశంలో కరోనా రికవరీ రేటు 71.91 శాతానికి పెరిగినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మరణాల రేటు 1.93 శాతానికి పడిపోయిందని తెలిపింది. తాజా 944 మరణాల్లో అత్యధికంగా మహారాష్ట్ర నుంచి 364 మంది మరణించారు. మొత్తం మరణాల్లో కూడా మహారాష్ట్ర అగ్రస్థానంలో కొనసాగుతోంది. తర్వాతి స్థానాల్లో తమిళనాడు, ఢిల్లీలు ఉన్నాయి. ఆగస్టు 15 వరకు 2,93,09,703 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్‌ తెలిపింది. శనివారం 7,46,608 శాంపిళ్లను పరీక్షించినట్లు తెలిపింది.

భారీ స్థాయిలో టెస్టులు..
ఆగస్టు 7 నుంచి ఒక్క 11వ తేదీన తప్ప ప్రతి రోజూ 60 వేలకు పైగా కేసులు నమోదవు తున్నాయి. కేంద్ర రాష్ట్రాలు సమన్వయంతో పనిచేస్తుండటంతో కరోనాను కట్టడి చేయగలుగు తున్నామని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. మొత్తం 1,469 ల్యాబ్‌లలో కరోనా పరీక్షలు జరుపుతున్నట్లు తెలిపింది. అమెరికాలో 50 వేల మరణాలకు 23 రోజులు పట్టగా, బ్రెజిల్‌ లో 95 రోజులు పట్టిందని, భారత్‌లో అది 156 రోజులు పట్టిందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. కరోనా కాలంలో వైద్య రంగ మౌలిక వసతులను భారత్‌ భారీగా పెంచుకుందని చెప్పింది. కరోనాను ఎదిరించడంలో ఆశ కార్యకర్తల పాత్ర ఎంతగానో ఉందని కొనియాడారు.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top