దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్ డ్రైరన్ ప్రారంభం

Corona Vaccine Dry Run Programme Started All Over The India - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : దేశవ్యాప్తంగా  259 ప్రాంతాల్లో కరోనా వ్యాక్సిన్ డ్రైరన్ ప్రక్రియ ప్రారంభమైంది. శనివారం తొలి దశలో భాగంగా డాక్టర్లు, నర్సులు, వైద్య, ఆరోగ్యశాఖ సిబ్బంది.. పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులకు, 50 ఏళ్లు పైబడినవారికి, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి వ్యాక్సిన్‌ వేయనున్నారు. రెండో దశలో కోవిడ్ యాప్ ద్వారా సాధారణ ప్రజలకు వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తేనున్నారు. ఢిల్లీలోని జీటీబీ ఆస్పత్రిలో జరుగుతున్న డ్రైరన్‌ను కేంద్రమంత్రి హర్షవర్ధన్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ కరోనా వ్యాక్సిన్ వేసుకోవాలని కోరారు. వ్యాక్సిన్‌పై ఎలాంటి అపోహలు వద్దని అన్నారు. కరోనా వ్యాక్సిన్‌ పంపిణీ ఏర్పాట్లపై నిపుణుల బృందం పర్యవేక్షిస్తుందని, కరోనా వ్యాక్సిన్‌ త్వరలో అందరికీ అందుబాటులోకి వస్తుందని తెలిపారు.


ఏపీలో ప్రారంభమైన కరోనా వ్యాక్సిన్ డ్రైరన్‌
అమరావతి : ఆంధ్రప్రదేశ్‌ వ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్‌ డ్రైరన్‌ ప్రారంభమైంది. శనివారం 13 జిల్లాల్లో 39 కేంద్రాల్లో డ్రైరన్‌ ప్రక్రియ మొదలైంది. ప్రతి జిల్లాలోని మూడు ఆస్పత్రుల్లో వ్యాక్సిన్ డ్రైరన్‌ నిర్వహించనున్నారు. ప్రతి జిల్లాలోని మూడు ఆస్పత్రుల్లో.. ఒక్కో సెంటర్‌లో 25 మంది హెల్త్‌ వర్కర్లకు డమ్మీ వ్యాక్సినేషన్ ఇవ్వనున్నారు. వ్యాక్సినేషన్ ప్రక్రియను రాష్ట్ర, జిల్లా టాస్క్‌ఫోర్స్‌ పర్యవేక్షిస్తోంది. ఇప్పటికే కృష్ణా జిల్లాలోని ఐదు ఆస్పత్రుల్లో డ్రైరన్‌ విజయవంతమైంది. ( డ్రైరన్, వాక్సినేషన్‌కు తేడా ఏమిటి..? )

హైదరాబాద్‌, మహబూబ్‌నగర్‌లో కరోనా డ్రైరన్‌

హైదరాబాద్‌ : తెలంగాణలో కరోనా వ్యాక్సిన్ డ్రైరన్‌ ప్రారంభమైంది. శనివారం హైదరాబాద్‌, మహబూబ్‌నగర్ జిల్లాల్లో డ్రైరన్ ప్రక్రియ మొదలైంది. హైదరాబాద్‌లోని‌ తిలక్‌నగర్‌ పీహెచ్‌సీ, నాంపల్లి ఏరియా ఆస్పత్రి, గాంధీ ఆస్పత్రి, సోమాజిగూడ యశోద ఆస్పత్రిలో.. మహబూబ్‌నగర్‌ జిల్లాలో జానంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మహబూబ్‌నగర్‌ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి, నేహా షైన్‌ ప్రైవేట్‌ ఆసుపత్రిలో డ్రైరన్‌ నిర్వహిస్తున్నారు. ఒక్కో సెంటర్‌లో 25 మంది హెల్త్‌ వర్కర్లకు డమ్మీ వ్యాక్సినేషన్ ఇవ్వనున్నారు. రెండు గంటల్లో ఈ డ్రైరన్ ప్రక్రియ పూర్తికానుంది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top