Congress Changed Twitter Profile And Puts A Picture Of Nehru With National Flag - Sakshi
Sakshi News home page

ప్రొఫైల్‌ పిక్చర్లు మార్చుకోవాలంటూ మోదీ పిలుపు.. త్రివర్ణ పతాకంతో నెహ్రూ ఫొటో!

Published Thu, Aug 4 2022 6:03 AM

Congress changes Twitter profile photo, puts a picture of Nehru with Tricolour - Sakshi

న్యూఢిల్లీ: జాతీయజెండాను సోషల్‌ మీడియా ప్రొఫైల్‌ పిక్చర్లుగా మార్చుకోవాలంటూ ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపుపై కాంగ్రెస్‌ పార్టీ నేతలు తమదైన శైలిలో స్పందించారు. పార్టీ అధికార వెబ్‌సైట్‌తోపాటు అగ్ర నేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంకాగాంధీ వాద్రా సహా పలువురు తమ ట్విట్టర్‌ ఇతర సామాజిక మాధ్యమాల ఖాతాల్లో దేశ ప్రథమ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ జాతీయ జెండాను చేతబూనిన ఫొటోను బుధవారం తమ ప్రొఫైల్‌ పిక్చర్లుగా పెట్టుకున్నారు.

నెహ్రూ జాతీయ జెండా వైపు చూస్తున్నట్లుగా ఉన్న బ్లాక్‌ అండ్‌ వైట్‌ చిత్రాన్ని ఫొటోషాప్‌ సాంకేతికతతో కలర్‌లోకి మార్చారు. ‘తిరంగా దేశానికి గర్వకారణం. తిరంగా ప్రతి భారతీయుడి గుండెలోనూ ఉంటుంది’అంటూ రాహుల్‌ గాంధీ ట్వీట్‌ చేశారు. ‘52 ఏళ్ల క్రితం ఆర్‌ఎస్‌ఎస్‌ పుణెలోని తన ప్రధాన కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేయలేదు. ప్రధాని పిలుపుతోనైనా తిరంగా ఆ సంస్థ ప్రొఫైల్‌ పిక్చర్‌ మారుతుందా?’అని జైరాం రమేశ్‌ వ్యాఖ్యానించారు.

కాంగ్రెస్‌ నేతలకు ఆ అవకాశం ఇవ్వండి: రాహుల్‌పై బీజేపీ వ్యంగ్యాస్త్రాలు
కాంగ్రెస్‌ పార్టీ నేతలు సోషల్‌ మీడియా ప్రొఫైల్‌లలో త్రివర్ణ పతాకంతో ఉన్న తమ ఫొటోలు పెట్టుకునే అవకాశం నేతలకు ఇవ్వాలని రాహుల్‌ గాంధీని బీజేపీ ఎద్దేవా చేసింది. తిరంగా విషయంలోనైనా తమ కుటుంబం పరిధి దాటి ఆయన ఆలోచించాలని హితవు పలికింది.

Advertisement
Advertisement