తిరువనంతపురం: మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ల మధ్య సాగిన ఒక ప్రత్యేక ఇంటర్వ్యూ కేరళ రాజకీయాల్లో రచ్చ చేస్తోంది. ‘కందుం మిండియుం ఇరువర్’ పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమం కోసం ఏకంగా రూ. 11.21 లక్షల ప్రజాధనాన్ని వెచ్చించడం తీవ్ర చర్చకు దారితీసింది. అసెంబ్లీ ఎన్నికల వేళ ఈ చర్చ అధికార పక్షాన్ని ఇరకాటంలోకి నెట్టింది.
ఆర్‌టీఐ ద్వారా వెలుగులోకి..
తిరువల్లకు చెందిన రిజో వల్లంకుళం అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ) కింద వేసిన దరఖాస్తుతో ఈ ఖర్చుల వివరాలు బయటపడ్డాయి. ఈ ఇంటర్వ్యూ కోసం ప్రభుత్వ ఖజానా నుంచి రూ. 11,21,000 ఖర్చు చేసినట్లు సమాచార, పౌరసంబంధాల శాఖ వెల్లడించింది.
రెండు రోజుల షూటింగ్
ముఖ్యమంత్రి అధికారిక నివాసమైన ‘క్లిఫ్ హౌస్’లో రెండు రోజుల పాటు ఈ ఇంటర్వ్యూ చిత్రీకరణ జరిగింది. ప్రముఖ సినీ దర్శకుడు టీకే రాజీవ్ కుమార్ నేతృత్వంలోని బృందం దీనిని తెరకెక్కించింది. పినరయి విజయన్ రాజకీయ ప్రస్థానం, ఆయన వ్యక్తిగత జీవిత విశేషాలతో రూపొందిన ఈ ఇంటర్వ్యూ టీజర్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. గతంలో తిరువనంతపురంలో జరిగిన ఒక భేటీలో ముఖ్యమంత్రి స్వయంగా ఈ ప్రతిపాదన చేయగా, మోహన్‌లాల్ వెంటనే అంగీకరించినట్లు సమాచారం.
విపక్షాల ధ్వజం
ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ పినరయి విజయన్ తన వ్యక్తిగత ఇమేజ్ పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని విపక్షాలు మండిపడుతున్నాయి. కాగా మోహన్‌లాల్ 2011 ఎన్నికల సమయంలోనూ అప్పటి ముఖ్యమంత్రి ఊమెన్ చాందీని కూడా ఇలాగే ఇంటర్వ్యూ చేశారు. అయితే
ఎన్నికలు సమీపిస్తున్న ప్రస్తుత తరుణంలో ఈ వివాదాస్పద ఇంటర్వ్యూ కేరళ రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాలి.
ఇది కూడా చదవండి: ‘గ్రేట్ ఎస్కేప్’: ఏడు శునకాల వింత కథ.. నెట్టింట వైరల్!


