‘గ్రేట్ ఎస్కేప్’: ఏడు శునకాల వింత కథ.. నెట్టింట వైరల్‌! | Dogs stolen from their Owners Transport truck and making their way home | Sakshi
Sakshi News home page

‘గ్రేట్ ఎస్కేప్’: ఏడు శునకాల వింత కథ.. నెట్టింట వైరల్‌!

Mar 24 2026 11:24 AM | Updated on Mar 24 2026 11:35 AM

Dogs stolen from their Owners Transport truck and making their way home

చాంగ్‌చున్: చైనాలోని జిలిన్ ప్రావిన్స్‌లో కిడ్నాపర్లు ఒక ట్రక్కులో బంధించి తీసుకెళ్తున్న ఏడు పెంపుడు శునకాలు అత్యంత చాకచక్యంగా తప్పించుకోవడమే కాకుండా.. ఏకంగా 17 కిలోమీటర్ల దూరం వరకూ కలిసి ప్రయాణించి, ఎట్టకేలకు తమ యజమానుల చెంతకు చేరాయి. ఈ ‘గ్రేట్ ఎస్కేప్’ కథ  నెటిజన్ల కళ్లు చెమర్చేలా చేస్తోంది.

ఈ కథలోకి వెళితే ఈ ఏడు కుక్కలు వేర్వేరు జాతులకు చెందినవి. కానీ ఇవన్నీ ఒకే గ్రామంలో కలిసి ఆడుకుంటూ స్నేహంగా మెలుగుతుంటాయి. అయితే కొందరు దొంగలు వీటిని వేర్వేరు ఇళ్ల నుంచి అపహరించి, కుక్క మాంసం విక్రయించే ముఠాకు అమ్మేందుకు ఒక ట్రక్కులోనికి ఎక్కించారు. అయితే ఆ ట్రక్కు నుంచి అవి ఎలాగోలా బయటపడ్డాయి. సాధారణంగా ఇలాంటి స్థితిలో కుక్కలు భయంతో ఎటుపడితే అటు పరుగులు తీస్తాయి. కానీ, ఇవి మాత్రం కలిసిగట్టుగా ప్రయాణం సాగించాయి.
 

చాంగ్‌చువాంగ్ ఎక్స్‌ప్రెస్‌వే హైవేపై వాహనాలు వేగంగా  దూసుకెళ్తున్నా, ఈ ఏడు కుక్కలు ఒక సైనిక దళం మాదిరిగా క్రమశిక్షణతో నడుస్తూ వెళ్తున్న దృశ్యాలు వాహనదారులను ఆశ్చర్యపరిచాయి.  ఇక్కడ ఒక హృదయ విదారక విషయం ఏమిటంటే.. గాయపడి నడవలేకపోతున్న ఒక జర్మన్ షెపర్డ్ కుక్కను మిగిలినవి వదిలివేయలేదు. ఆ గాయపడిన ‘మిత్రుడి’ చుట్టూ రక్షణ కవచంలా ఏర్పడగా, చిన్నదైన కోర్గి కుక్క మధ్యలో నడుస్తూ ముందుకు సాగింది. ఒకటి నెమ్మదిస్తే మిగిలినవన్నీ ఆగి, వాటికి ధైర్యం చెబుతూ, ముందుకు సాగాయి.

రెండు రోజుల పాటు తిండి, నీరు లేకపోయినా పొలాలు, రోడ్లు దాటుకుంటూ దాదాపు 17 కిలోమీటర్ల దూరం ప్రయాణించాయి. సోషల్ మీడియాలో ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో స్థానిక వాలంటీర్లు డ్రోన్ల సాయంతో వీటిని గమనిస్తూ వచ్చారు. చివరికి అవి తమ సొంత గ్రామానికి చేరుకోగానే, వాటి యజమానుల ఆనందానికి అవధులు లేవు. మృత్యువు ముఖం వరకు వెళ్లి, తిరిగి ప్రాణాలతో వచ్చిన తమ పెంపుడు జంతువులను చూసి గ్రామస్తులు ఆశ్చర్యపోయారు.

ఇది కూడా చదవండి: ‘ఆంత్రోపిక్‌’ నుంచి మరో దిమ్మతిరిగే షాక్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement