‘ఆంత్రోపిక్‌’ నుంచి మరో దిమ్మతిరిగే షాక్‌! | Claude can now control computer like a human | Sakshi
Sakshi News home page

‘ఆంత్రోపిక్‌’ నుంచి మరో దిమ్మతిరిగే షాక్‌!

Mar 24 2026 10:28 AM | Updated on Mar 24 2026 10:41 AM

Claude can now control computer like a human

ల్యాప్‌టాప్ అవసరం లేకుండానే ఆఫీస్ పనులన్నీ వాటంతట అవే చకచకా పూర్తయిపోతే ఎలా ఉంటుంది? వినడానికి ఇది సైన్స్ ఫిక్షన్ సినిమాలా అనిపించినా, ప్రముఖ ఏఐ సంస్థ ఆంత్రోపిక్ (Anthropic) ఇప్పుడు దీన్ని సాకారం చేసింది. తన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అసిస్టెంట్ ‘క్లాడ్’ (Claude)కు సంబంధించి ఒక విప్లవాత్మకమైన ఫీచర్‌ను  ‘ఆంత్రోపిక్‌’ తాజాగా పరిచయం చేసింది.

మనిషిలాగే కంప్యూటర్ వాడకం
ఇప్పటివరకు మనం ఏఐ సాయంతో ప్రశ్నలు అడగడమో లేదా సమాచారం సేకరించడమో చేసేవాళ్లం. కానీ ఇకపై ‘క్లాడ్’.. మీ కంప్యూటర్‌ను ఒక మనిషి మాదిరిగా ఆపరేట్ చేయగలదు. మౌస్ కదపడం, కీబోర్డ్ ద్వారా టైప్ చేయడం, స్క్రీన్‌ను రీడ్ చేయడం లాంటి పనులను ఇది సునాయాసంగా చేస్తుంది. ఫలితంగా మీరు కంప్యూటర్ ముందు లేకపోయినా, మీరు ఇచ్చిన టాస్క్‌లను ‘క్లాడ్’ పూర్తి చేస్తుంది. అంటే మీ పనులను చక్కబెట్టే ఒక నమ్మకమైన ‘రిమోట్ ఉద్యోగి’ మీతో పాటు ఉన్నట్టేనని ‘ఆంత్రోపిక్‌’ పేర్కొంది.

ల్యాప్‌టాప్ అవసరం లేని భవిష్యత్తు
ఈ కొత్త ఫీచర్ గురించి ఆంత్రోపిక్ పరిశోధకుడు అలెక్స్ ఆల్బర్ట్ మాట్లాడుతూ ‘పని కోసం ల్యాప్‌టాప్ తెరవాల్సిన అవసరం లేని భవిష్యత్తు అత్యంత వేగంగా మనకు చేరువవుతోంది’ అని ‘ఎక్స్‌’లో  పేర్కొన్నారు. ఆఫీస్ పనుల కోసం ఇకపై డెస్క్ దగ్గర కూర్చోవాల్సిన అవసరం లేకుండా, ఫోన్ నుంచే క్లాడ్ ద్వారా అన్నింటినీ చక్కబెట్టవచ్చని ఆయన వెల్లడించారు.

ఇది ఎలా పనిచేస్తుంది?
క్లాడ్ మీ కంప్యూటర్‌లోని స్లాక్ (Slack) లేదా క్యాలెండర్ లాంటి అప్లికేషన్‌లకు కనెక్ట్ అవుతుంది. అవసరమైతే ఇతర యాప్స్ యాక్సెస్ చేయడానికి మీ అనుమతి అడుగుతుంది. ఇటీవలే విడుదలైన 'డిస్పాచ్' (Dispatch) ఫీచర్ ద్వారా మీ ఫోన్ నుంచే కంప్యూటర్‌లో ఉన్న క్లాడ్‌కు ఆదేశాలు ఇవ్వవచ్చు. మీరు బయట తిరుగుతున్నా, ‘క్లాడ్’ మీ బ్రౌజర్‌లో సమాచారం వెదకడం, స్ప్రెడ్‌షీట్‌లను నింపడం లాంటి పనులను చిటికెలో పూర్తి చేసి పెడుతుంది.

ఎవరికి అందుబాటులో ఉంటుంది?
ప్రస్తుతానికి ఈ ఫీచర్ కేవలం రీసెర్చ్ ప్రివ్యూ దశలో మాత్రమే ఉంది. పెయిడ్ వెర్షన్ వాడుతున్న ‘క్లాడ్ కోవర్క్’ (Claude Cowork)‘క్లాడ్ కోడ్’ (Claude Code) యూజర్లు మాత్రమే దీనిని వినియోగించగలరు. ముఖ్యంగా ప్రస్తుతం ఇది కేవలం మ్యాక్ ఓఎస్ (macOS) యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. దీని కోసం క్లాడ్ డెస్క్‌టాప్, మొబైల్ యాప్స్ రెండింటినీ అప్‌డేట్ చేసి అనుసంధానించాల్సి ఉంటుంది.

పెరుగుతున్న ఏఐ పోటీ
ఆటోమేషన్ రంగంలో వస్తున్న ఈ మార్పులు టెక్ ప్రపంచంలో కొత్త యుద్ధానికి తెరలేపుతున్నాయి. ఇప్పటికే ఎన్విడియా ‘నెమోక్లా’ (NemoClaw)ను అందుబాటులోకి తీసుకురాగా, మెటా,  ఓపెన్ ఏఐ సంస్థలు కూడా తమ సొంత ఏఐ ఏజెంట్లను తయారు చేసే పనిలో ఉన్నాయి. ఈ రేసులో ఆంత్రోపిక్ ఒక అడుగు ముందే ఉన్నదని నిపుణులు అంటున్నారు.

ఇది కూడా చదవండి: ‘ఏఐ’లో చైనా ఫస్ట్‌.. ‍ప్రమాదంలో భావి భారతం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement