ప్రపంచమంతా ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) మంత్రం జపిస్తోంది. రేపటి ఉద్యోగాలన్నీ ఏఐ నైపుణ్యం మీదనే ఆధారపడి ఉండబోతున్నాయి. సరిగ్గా ఇదే విషయాన్ని గుర్తించిన చైనా, దేశంలోని క్లాస్‌రూమ్‌ల రూపురేఖలను మార్చేస్తోంది. కానీ భారత్ మాత్రం ఇంకా మార్కులు, ర్యాంకులు, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అనే పాత చింతకాయ పచ్చడి నుండి బయటపడలేకపోతోంది. ఏఐ వినియోగంలో ఈ రెండు దేశాల మధ్య నున్న అంతరం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.
చైనా: ‘డబుల్ రిడక్షన్’ విప్లవం
2021లో చైనా 'డబుల్ రిడక్షన్' అనే కీలక విధానాన్ని తీసుకొచ్చింది. పైకి ఇది కేవలం ప్రైవేట్ ట్యూషన్లపై ఆంక్షలు అనిపించినా, దీని వెనుక ఒక వ్యూహం ఉంది. విద్యార్థులపై హోంవర్క్ ఒత్తిడిని తగ్గించి, బట్టీ పట్టే విధానానికి స్వస్తి పలికారు. కేవలం టాపర్లను వెతకడం కంటే, ప్రతి విద్యార్థిలో నైపుణ్యాన్ని (Capabilities) పెంచడమే లక్ష్యంగా చైనా స్కూళ్లు ముందడుగు వేస్తున్నాయి. టెక్నాలజీని కేవలం ఒక సబ్జెక్టుగా కాకుండా, సమస్యలను పరిష్కరించే ఒక సాధనంగా చైనాలో విద్యార్థులకు నేర్పిస్తున్నారు.
భారత్: డిగ్రీలు సరే.. ఉద్యోగాలేవి?
భారత్ పరిస్థితి దీనికి పూర్తి భిన్నంగా ఉంది. ఏటా మన దేశంలో దాదాపు 9 లక్షల మంది ఇంజనీర్లు డిగ్రీ పట్టాలతో బయటకు వస్తున్నారు. కానీ, వారిలో ఎంతమంది ఉద్యోగాలకు సిద్ధంగా ఉన్నారనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది. ‘స్టేట్ ఆఫ్ వర్కింగ్ ఇండియా 2026’ నివేదిక ప్రకారం ప్రతి 10 మంది యువకులలో నలుగురు సరైన ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నారు. ‘మన విద్యార్థులు పరీక్షలు పాస్ అయ్యేందుకే చదువుతున్నారు తప్ప, సమస్యలను పరిష్కరించడానికి కాదు’ అని విద్యావేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కోచింగ్ సెంటర్ల మాయాజాలం
హైదరాబాద్ నుండి రాజస్థాన్‌లోని కోట వరకు.. దేశవ్యాప్తంగా విద్యా వ్యవస్థను కోచింగ్ సెంటర్లే నడిపిస్తున్నాయి. ర్యాంకులు, కటాఫ్ మార్కులే విద్యార్థి తెలివితేటలకు కొలమానాలుగా మారిపోయాయి. మార్కెట్ అవసరాలకు అనుగుణంగా సిలబస్ మారడం లేదు. ప్రభుత్వం మార్పు కోసం ప్రయత్నిస్తున్నా, క్షేత్రస్థాయిలో అమలు మాత్రం నత్తనడకన సాగుతోంది.
తేడా ఎక్కడ వస్తోంది?
చైనా తన విద్యార్థులను ‘రేపటి’ కోసం సిద్ధం చేస్తోంది. అక్కడి విద్య.. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా రూపుదిద్దుకుంటోంది. కానీ భారత్ ఇంకా 'నిన్నటి' పద్ధతులలోనే పరీక్షలు పెడుతోంది. చైనా మోడల్‌లో నియంత్రణ ఎక్కువ ఉన్నా, వారు భవిష్యత్తు సాంకేతికతపై పట్టు సాధిస్తున్నారు. మన దగ్గర పోటీ ఎక్కువ ఉన్నా, అది కేవలం ర్యాంకులకే పరిమితమవుతోంది. ఏదిఏమైనప్పటికీ మన దేశంలో విద్యా విధానాన్ని సమూలంగా మార్చాల్సిన సమయం వచ్చేసిందని నిపుణులు అంటున్నారు. కేవలం మార్కులే విజయానికి కొలమానం అనుకుంటే, భవిష్యత్తులో మన యువత గ్లోబల్ మార్కెట్‌లో వెనుకబడిపోయే ప్రమాదం ఉంది.
ఇది కూడా చదవండి: బ్లూటూత్ ఇయర్‌ఫోన్స్‌తో భయంకర వ్యాధి?


