
ఢిల్లీ: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలతో వలసదారులు తీవ్ర కష్టాలు ఎదుర్కొంటున్నారు. ఏరోజు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనన్న ఆందోళన నెలకొంది. ఇక.. ట్రంప్ నిర్ణయాలు భారతీయులపై కూడా ప్రభావం చూపుతున్నాయి. ఈ నేపథ్యంలో డ్రాగన్ దేశం చైనా పలు కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. భారత్‌తో సన్నిహిత సంబంధాలను మెరుగుపరుచుకునే ప్రయత్నాలు మొదలుపెట్టింది. వీసాల విషయంలో భారతీయులకు భారీ ఆఫర్ ఇచ్చింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వీసా నిబంధనలను మరింత కష్టతరం చేశారు. ఈ నేపథ్యంలో భారతీయులను ఆకర్షించేందుకు చైనా ప్లాన్ చేసింది. ఇందులో భాగంగా ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ 9 వరకు చైనా రాయబార కార్యాలయం భారత పౌరులకు 85,000కిపైగా వీసాలను జారీ చేయడం విశేషం. ఇది రెండు దేశాల మధ్య ప్రజా సంబంధాలను బలపరిచే దిశలో కీలకమైన అడుగుగా చైనా ఎంబసీ పేర్కొంది. ఈ సందర్బంగా భారత్‌లో చైనా రాయబారి ఝూ ఫెహంగ్ స్పందిస్తూ..‘2025 ఏప్రిల్ 9 నాటికి భారత్‌లోని చైనా రాయబార కార్యాలయం, కాన్సులేట్లు భారతీయ పౌరులకు 85,000 కంటే ఎక్కువ వీసాలను జారీ చేశాయి. మరింత మంది భారతీయ మిత్రులు మా దేశానికి వచ్చి.. సురక్షిత, ఉత్సాహభరితమైన, హృదయపూర్వక, స్నేహపూర్వకమైన చైనాను ఆస్వాదించండి’ అని ట్విట్టర్ వేదికగా చెప్పుకొచ్చారు.
ఈ వీసాల పెరుగుదల ద్వారా సాంస్కృతిక, విద్యా, వ్యాపార, పర్యాటక మార్పిడులకు మద్దతు లభించనుంది. ముఖ్యంగా, వైద్య విద్య కోసం చైనాలో చదువుతున్న భారతీయ విద్యార్థులు ఈ నిర్ణయంపై ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అయితే, కోవిడ్ మహమ్మారి కారణంగా నిలిచిన ప్రయాణాలు ఇప్పుడు పునఃప్రారంభం కావడం విద్యార్థులకు ఊరట కలిగిస్తోంది. ఈ పరిణామం ద్వైపాక్షిక సంబంధాల్లో శాంతియుత మార్గాన్ని ప్రోత్సహించే మంచి సూచికగా భావించబడుతోంది.

As of April 9, 2025, the Chinese Embassy and Consulates in India have issued more than 85,000 visas to Indian citizens traveling to China this year. Welcome more Indian friends to visit China, experience an open, safe, vibrant, sincere and friendly China. pic.twitter.com/4kkENM7nkK
— Xu Feihong (@China_Amb_India) April 12, 2025
ఇదిలా ఉండగా.. భారత పౌరులు, విద్యార్థులు కోసం చైనా ప్రభుత్వం అనేక సడలింపులు తీసుకొచ్చింది. ఇవి ఆ దేశానికి ప్రయాణాన్ని మరింత సులభతరం చేయనున్నాయి. చైనా వీసా తక్కువ ధరకు లభించడంతో భారతీయులకూ ప్రయాణం మరింత సులభతరం అవుతుంది. వీసా జారీకి తీసుకునే సమయం తగ్గించారు. ఇది వ్యాపార, విహార యాత్రకు వెళ్లేవారికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు భారత పౌరులు ముందుగా ఆన్‌లైన్‌లో అపాయింట్‌మెంట్ తీసుకోకుండా నేరుగా వీసా సెంటర్లలో దరఖాస్తు చేసుకోవచ్చు. తక్కువ రోజులు పాటు చైనాలో ప్రయాణించే వారికి బయోమెట్రిక్ డేటా ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఇది వీసా ప్రాసెసింగ్ సమయాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.