సరిహద్దు వివాదం : డ్రాగన్‌ కుటిల యుద్ధతంత్రం

China Belts Out Punjabi Numbers For Indian Soldiers At Ladakh - Sakshi

భారత్‌పై విషం చిమ్మిన చైనా అధికార పత్రిక

సాక్షి, న్యూఢిల్లీ : భారత దళాల స్థైర్యాన్ని దెబ్బతీసేందుకు చైనా నక్కజిత్తులు ప్రదర్శిస్తోంది. యుద్ధం చేయకుండానే ప్రత్యర్ధులను మానసికంగా దిగజార్చాలని చైనా సైనిక వ్యూహకర్త సున్‌ సూ రాసిన ‘యుద్ధకళ’ పుస్తకాన్ని డ్రాగన్‌ ఇప్పటికీ అనుసరిస్తోంది. లడఖ్‌లో మోహరించిన భారత సైనికులపై ఇప్పటికీ పీఎల్‌ఏ, కమ్యూనిస్టు పార్టీ అధికార పత్రికలు అవే మానసిక యుద్ధతంత్రాలను ప్రయోగిస్తున్నాయి. గత నెల 29 రాత్రి ప్యాంగాంగ్‌ త్సూ ప్రాంతంలో చైనా దళాల దాడిని భారత్‌ సమర్ధంగా తిప్పికొట్టి ఫింగర్‌ 4పై తన ప్రాబల్యాన్ని తిరిగి హస్తగతం చేసుకున్న అనంతరం చైనా సైన్యం తొలుత ట్యాంకులు, దళాలతో విరుచుకుపడాలని భావించినా రెడ్‌ లైన్‌ అతిక్రమిస్తే భీకర ప్రతిదాడి తప్పదని భారత సైన్యం స్పష్టం చేయడంతో డ్రాగన్‌ వ్యూహం మార్చింది. చదవండి : సరిహద్దులో సంసిద్ధం..

చైనా సైనిక ఎత్తుగడలకు భారత సైన్యం తలొగ్గకపోవడంతో 1962 నాటి యుద్ధతంత్రాన్ని పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ (పీఎల్‌ఏ) ప్రదర్శించింది. కీలక పర్వత ప్రాంతంలో భారత్‌ గస్తీని నిలువరించే క్రమంలో ఫింగర్‌ 4 వద్ద పీఎల్‌ఏ లౌడ్‌స్పీకర్లలో పంజాబీ పాటలను వినిపించింది. ఇక ప్యాంగాంగ్‌ త్సో దక్షిణ తీరంలో లౌడ్‌ స్పీకర్లలో హిందీలో భారత సైనికుల స్థైర్యాన్ని దెబ్బతీసేలా పీఎల్‌ఏ వ్యవహరించింది. ఢిల్లీలో కూర్చున్న రాజకీయ పెద్దల ఇష్టానుసారం శీతాకాలంలో ప్రతికూల వాతావరణంలో సైనికులను ఇక్కడ మోహరించారని, చలి వాతావరణంలో వేడి భోజనం, రవాణా సౌకర్యాలు లేవని, రాబోయే రోజుల్లో మరింత గడ్డు పరిస్థితి ఎదురవుతుందంటూ రెచ్చగొట్టారు.

భారత సైనికుల్లో అసంతృప్తి రాజేసేందుకు పీఎల్‌ఏ కుటిల యత్నాలకు పాల్పడింది. 1962లో కూడా తూర్పు, పశ్చిమ సెక్టార్లలో 1967 నాథులా వివాదంలోనూ పీఎల్‌ఏ ఇదే లౌడ్‌స్పీకర్‌ ఎత్తుగడలకు పాల్పడిందని సైనిక నిపుణులు చెబుతున్నారు. చైనా సేనలు పాంగాంగ్‌ త్సో వద్ద కుటిల గూఢచర్యానికి పాల్పడుతుంటే చైనా కమ్యూనిస్టు పార్టీ పత్రిక భారత్‌పై విషం చిమ్ముతోంది. దేశంలో కరోనా వైరస్‌ కేసులు పెరగడం, ఆర్థిక వ్యవస్థ కుదేలైన క్రమంలో ప్రజల దృష్టిని మరల్చేందుకు నరేంద్ర మోదీ సర్కార్‌ లడఖ్‌పై కఠిన వైఖరి అవలంభిస్తోందని రాసుకొచ్చింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top