పేద వర్గాల పిల్లలకు ఆన్‌లైన్‌ విద్య

Centre, States must come up with realistic plan for EWS children - Sakshi

ఢిల్లీ హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు ధర్మాసనం

న్యూఢిల్లీ:  దేశంలో ఆర్థికంగా వెనుకబడిన తరగతుల(ఈడబ్ల్యూఎస్‌), అణగారిన వర్గాల పిల్లలకు ఆన్‌లైన్‌ విద్య అందుబాటులో ఉండడం లేదని, ఫలితంగా వారు ఎంతో నష్టపోతున్నారని సుప్రీంకోర్టు ఆవేదన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో విద్యా హక్కు చట్టాన్ని (ఆర్‌టీఈ) కచ్చితంగా అమలు చేసే దిశగా ఒక వాస్తవిక కార్యాచరణ ప్రణాళికతో ముందుకు రావాలని కేంద్ర, ప్రభుత్వాలకు శుక్రవారం సూచించింది. ఆన్‌లైన్‌ తరగతులు వినడానికి వీలుగా పేద విద్యార్థులకు పరికరాలు(స్మార్ట్‌ ఫోన్లు లేదా ల్యాప్‌ట్యాప్‌లు) అందజేయాలని, ఇంటర్నెట్‌ సౌకర్యం కల్పించాలని ఢిల్లీ హైకోర్టు 2020 సెప్టెంబర్‌ 18న ప్రభుత్వ, ప్రైవేట్‌ స్కూళ్లకు ఆదేశాలు జారీ చేసింది.

ఈ మేరకు తీర్పు వెలువరించింది. ఈ తీర్పును సవాలు చేస్తూ గుర్తింపు పొందిన అన్‌–ఎయిడెడ్‌ ప్రైవేట్‌ స్కూళ్ల యాక్షన్‌ కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పిటిషన్‌ దాఖలు చేసింది. దీనిపై జస్టిస్‌ డీవై చంద్రచూడ్, బీవీ నాగరత్నతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం తాజాగా విచారణ చేపట్టింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 21ఏను నిజం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొంది. అది జరగాలంటే పేద, అణగారిన వర్గాల పిల్లలకు ఆన్‌లైన్‌ విద్యను నిరాకరించరాదని స్పష్టం చేసింది. వారికి ఆన్‌లైన్‌ విద్య అందకపోతే సంపన్న కుటుంబాల పిల్లల కంటే వెనుకబడే ప్రమాదం ఉందని, ఇరు వర్గాల మధ్య అంతరం పెరిగిపోతుందని తెలిపింది. మంచి తీర్పు ఇచ్చిన ఢిల్లీ హైకోర్టును సుప్రీంకోర్టు ధర్మాసనం అభినందించింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top