భార్య ఉద్యోగం చేస్తున్నా  భరణానికి అర్హురాలే  | Bombay High Court Upholds Order Of Maintenance To Wife | Sakshi
Sakshi News home page

భార్య ఉద్యోగం చేస్తున్నా  భరణానికి అర్హురాలే 

Jun 28 2025 4:56 AM | Updated on Jun 28 2025 4:56 AM

Bombay High Court Upholds Order Of Maintenance To Wife

బాంబే హైకోర్టు తీర్పు  

ముంబై:  ఉద్యోగం చేస్తూ వేతనం ఆర్జిస్తున్న మహిళ కూడా విడిపోయిన తన భర్త నుంచి నెలనెలా జీవన భృతి పొందడానికి అర్హురాలేనని బాంబే హైకోర్టు తేల్చిచెప్పారు. ఆమెకు సొంత సంపాదన ఉందన్న కారణంతో భర్త నుంచి ఆర్థిక సాయం పొందకుండా నిరోధించలేమని పేర్కొంది. మహారాష్ట్రలోని థానేకు చెందిన యువతి, యువకుడికి 2012 నవంబర్‌ 28న వివాహం జరిగింది. విభేదాల కారణంగా 2015 మే నెల నుంచి దూరంగా ఉంటున్నారు. 

అధికారికంగా విడాకులు తీసుకోలేదు. సదరు యువతి ఓ పాఠశాలలో టీచర్‌గా ఉద్యోగం చేయడం ప్రారంభించింది. తన భర్త నుంచి జీవన వ్యయం ఇప్పించాలని కోరుతూ బాంద్రాలోని ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. దాంతో ప్రతినెలా రూ.15 వేల చొప్పున ఆమెకు ఇవ్వాలని ఆదేశిస్తూ భర్తను ఫ్యామిలీ కోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ ఆ వ్యక్తి బాంబే హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు.

 దీనిపై జస్టిస్‌ మంజూష దేశ్‌పాండే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. భార్య ఉద్యోగం చేస్తోంది కాబట్టి ఆమె జీవన వ్యయాన్ని తాను భరించాల్సిన అవసరం లేదన్న భర్త వాదనను తిరస్కరించింది. భార్య ఉద్యోగం చేస్తున్నా ఆమెను పోషించాల్సిన బాధ్యత భర్తపై ఉందని పేర్కొంది. ఫ్యామిలీ కోర్టు ఉత్తర్వుల ప్రకారం భార్యకు ప్రతినెలా రూ.15 వేల చొప్పున ఇవ్వాలని భర్తను ఆదేశిస్తూ తాజాగా తీర్పు వెలువరించింది.   
 

Advertisement
 
Advertisement
Advertisement