breaking news
Wifes job
-
భార్య ఉద్యోగం చేస్తున్నా భరణానికి అర్హురాలే
ముంబై: ఉద్యోగం చేస్తూ వేతనం ఆర్జిస్తున్న మహిళ కూడా విడిపోయిన తన భర్త నుంచి నెలనెలా జీవన భృతి పొందడానికి అర్హురాలేనని బాంబే హైకోర్టు తేల్చిచెప్పారు. ఆమెకు సొంత సంపాదన ఉందన్న కారణంతో భర్త నుంచి ఆర్థిక సాయం పొందకుండా నిరోధించలేమని పేర్కొంది. మహారాష్ట్రలోని థానేకు చెందిన యువతి, యువకుడికి 2012 నవంబర్ 28న వివాహం జరిగింది. విభేదాల కారణంగా 2015 మే నెల నుంచి దూరంగా ఉంటున్నారు. అధికారికంగా విడాకులు తీసుకోలేదు. సదరు యువతి ఓ పాఠశాలలో టీచర్‌గా ఉద్యోగం చేయడం ప్రారంభించింది. తన భర్త నుంచి జీవన వ్యయం ఇప్పించాలని కోరుతూ బాంద్రాలోని ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించింది. దాంతో ప్రతినెలా రూ.15 వేల చొప్పున ఆమెకు ఇవ్వాలని ఆదేశిస్తూ భర్తను ఫ్యామిలీ కోర్టు ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వులను సవాలు చేస్తూ ఆ వ్యక్తి బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై జస్టిస్ మంజూష దేశ్‌పాండే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. భార్య ఉద్యోగం చేస్తోంది కాబట్టి ఆమె జీవన వ్యయాన్ని తాను భరించాల్సిన అవసరం లేదన్న భర్త వాదనను తిరస్కరించింది. భార్య ఉద్యోగం చేస్తున్నా ఆమెను పోషించాల్సిన బాధ్యత భర్తపై ఉందని పేర్కొంది. ఫ్యామిలీ కోర్టు ఉత్తర్వుల ప్రకారం భార్యకు ప్రతినెలా రూ.15 వేల చొప్పున ఇవ్వాలని భర్తను ఆదేశిస్తూ తాజాగా తీర్పు వెలువరించింది. -
వంట నేర్వనివాడు వింత మనిషా ?
సంతోషంగా ఉండాలంటే మాత్రం మగ మహారాజు వంటచేయాలంటున్నారు. దీనివల్ల పని భారం ఆమెకు తగ్గడమే కాదు, భర్త బాధ్యత తీసుకుని తన కష్టాన్ని తగ్గించిన భావన ప్రత్యక్షంగా ఆమెకు ఎంతో ఉల్లాసాన్ని ఇస్తుంది. మగాడు... తొలుత వంట గురించి మాట్లాడలేదు. రెండో దశలో... ‘నేను, వంట చేయడమా?’ అన్నాడు. మూడో దశలో ‘వంట నాకు రాద’న్నాడు... ఇపుడు కారణాలు అతను చెప్పడం లేదు, ఎందుకంటే ఎవరూ అడగటం లేదు. నీ మంచికే చెబుతున్నాం... వంటొచ్చా? అంటున్నారు.! అవునట... వంట రాని మొగుడితో సంతోషకరమైన దాంపత్యం ఉండదట. పురుషులకు మాత్రమే...అనే బోర్డు ఉన్న ఉద్యోగాలు కనుమరుగైనాయి. ప్రతి ఉద్యోగానికి స్త్రీ వస్తోంది. గమనించాలి.... ప్రతి ఉద్యోగంలో ఆమెకు ప్రాధాన్యం, వెసులుబాట్లు కూడా ఉంటున్నాయి. అంటే ఉద్యోగం పురుషలక్షణం, వంటిల్లు గృహిణి స్థానం అన్నదానికి కాలం చెల్లింది. ఈ మధ్య కాలంలో పెళ్లయ్యి హౌస్ వైఫ్‌గా ఉన్న వారి శాతం పదికి మించడం లేదంటే స్త్రీలు పురుషుడితో ఉన్న తేడాలు ఎంతగా చెరిపేసుకున్నారో తెలియడం లేదూ! ఉదయాన్నే ఇద్దరూ రెండు బాక్సులు కట్టుకుని బయలుదేరుతున్నారు. మరి ఇంటికి వచ్చి వంటెవరు చేయాలి? అతనికి ఉన్న ఒత్తిడి, పని ఆమెకు ఉంటున్నాయి. అలాంటపుడు ఆమెను వంట చేయమని ఆదేశించడానికి నోరు రావడం లేదు. నోట్లో ఏదో ఒకటి అర్జెంటుగా పడకపోతే ఆకలి తీరడం లేదు. కానీ ఒంట్లో ఓపిక లేదు. ఆమె పరిస్థితి ఇంకాస్త ఇబ్బంది... ఎలాగోలా వంట చేయాలి. ఎందుకంటే పురాణాలు... ‘భోజ్యేషు మాతా’ అని ఒక బిరుదిచ్చి పడేశాయి. కాబట్టి మనిషిలో ఏ మూలన కాస్త మంచితనం ఉన్నా మొహమాటానికి గరిట పట్టాల్సిందే. కుక్కర్లు వచ్చినా, కట్‌చేసిన కూరగాయలు దొరకుతున్నా, రెడీ మిక్స్ కరీలు వచ్చినా... మనిషి పని ఇంకా మిగిలే ఉంది, ఉంటుంది. ఏతావాతా... ఆమె పాత్ర తప్పనిసరి. అలసిన శరీరానికి అసంతృప్తీ తప్పనిసరి. అందుకే చిన్న కుటుంబం చింత లేని కుటుంబంగా ఉండాలంటే మొగుడికీ వంట రావాల్సిందే అన్న కొత్త సిద్ధాంతాన్నా ఫ్యామిలీ కౌన్సిలర్లు, పర్సనాలిటీ ట్రైనర్లు... వీరందరికీ కంటే ముందు ఉద్యోగాలు చేస్తున్న భార్యలు కోరుతున్నారు. దాంపత్యం అంటే సుఖంతో పాటు కష్టాలు పంచుకోవాలి. ఓ చేయి వంటలోనూ వేయాలి. భర్త కాస్త దురుసుగా ఉన్నా, కిచెన్‌లోకి వెళ్లకపోయినా కుటుంబం నడుస్తుంది, కాకపోతే సంతోషంగా ఉండాలంటే మాత్రం మగ మహారాజు వంటచేయాలంటున్నారు. దీనివల్ల పని భారం ఆమెకు తగ్గడమే కాదు, భర్త బాధ్యత తీసుకుని తన కష్టాన్ని తగ్గించిన భావన ప్రత్యక్షంగా ఆమెకు ఎంతో ఉల్లాసాన్ని ఇస్తుంది, పరోక్షంగా ఆ ఇంటికి ఆనందాన్ని పంచుతుందట. ఇల్లాలి ఆనందమే ఇంటికి ఆస్తి, ఆరోగ్యం. రోజూ భర్త వండిపెట్టక్కర్లేదు... కాకపోతే భార్యకు కష్టంగా ఉన్నపుడు, బడలిక ఉన్నపుడు, అనారోగ్యంతో ఉన్నపుడు పని ఎక్కువగా ఉన్నపుడు వండిపెడితే ఆమె అనేక ఇతర విషయాల్లో భర్తకు ఊహించనంత ఆనందాన్ని ఇస్తుంది. భర్త ఆమె కష్టాన్ని పంచుకుంటే భార్య అతనికి ప్రేమను పంచుతుందట. ఈ చిన్నసాయం ద్వారా భవిష్యత్తులో అనేక విషయాల్లో కాస్త డామినేషన్ చూపినా ఆమె సహకారం లభిస్తుంది. ఇదంతా చెప్పాక... అంటే భార్య ఉద్యోగం చేయకపోతే మగాడు వంట చేయక్కర్లేదు అనుకునేరు. అసలు సిద్దాంతం ఏంటంటే ఆమె పనితో సంబంధం లేకుండా మగాడికి వంట వచ్చి ఉండాలంటున్నారు. అపుడే కాపురంలో కాస్త హాయి దక్కుతుందట. భార్యకు బాగోలేకపోవచ్చు, ఆమె ఒక్కతే చేసిపెట్టలేనంత మంది బంధువులు ఇంటికి వచ్చి ఉండొచ్చు, ఆమె గర్భవతి అయ్యి ఉండొచ్చు. కాబట్టి ఇల్లాలి ఉద్యోగంతో సంబంధం లేకుండా వంట నేర్చకుంటే అది మగాడికి సుఖాన్నిస్తుందే గాని కష్టం పెంచదట. గత కాలంలో అయితే ఇప్పట్లాగా ఇంట్లో భార్యభర్తలు మాత్రమే కాకుండా అత్తమామలో, అమ్మనాన్నలో ఉండేవారు కాబట్టి ఈ సమస్య, ఈ కష్టం వచ్చేది కాదు... ఇపుడు ఇద్దరే ఉంటున్నారు. ప్రైవసీ వచ్చింది, దాంతో పాటు ఇలాంటి సైడ్ ఎఫెక్టులూ మొదలయ్యాయి! చెట్టున్న నేల, పెద్ద వాళ్లున్న ఇల్లు చల్లగా ఉంటాయండీ!