యూపీలో ఎమ్మెల్యే అనుచరుడి బరితెగింపు

UP BJP MLA Aide Allegedly Shoots Man Dead - Sakshi

ఘటనపై సీఎం ఆగ్రహం.. అధికారులను సస్పెండ్‌ చేయాలంటూ ఆదేశాలు

లక్నో: అధికారులు, పోలీసుల ముందే ఎమ్మెల్యే అనుచరుడు ఓ వ్యక్తిని దారుణంగా హత్యచేసిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో గురువారం చోటుచేసుకుంది. రేషన్ దుకాణాల కేటాయింపుల సందర్భంగా సభ్యుల మధ్య జరిగిన గొడవ హత్యకు దారితీసింది. జయప్రకాశ్ (46) అనే వ్యక్తిపై బీజేపీ ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు ధీరేంద్ర సింగ్ కాల్పులకు తెగబడ్డాడు. వేదికపై అధికారులు ఉండగానే ఈ ఘటన జరగడం గమనార్హం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరలవుతోంది. వివరాలు.. బల్లియాలోని దుర్జాపూర్ గ్రామంలో రేషన్ దుకాణాల కేటాయింపుల కోసం అధికారులు సమావేశం ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా హాజరైన జయప్రకాశ్, ధీరేంద్ర సింగ్ మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.దాంతో ధీరేంద్ర తన వెంట తెచ్చుకున్న తుపాకీతో కాల్పులకు తెగబడ్డాడని ఎస్పీ దేవేంద్ర నాథ్ తెలిపారు. హత్య జరిగే సమయానికి అధికారులు, పోలీసులు అక్కడే ఉన్నారని స్థానికులు చెబుతున్నారు. (చదవండి: త్రిపుర బీజేపీ సర్కార్‌లో అసమ్మతి)

                   (నిందితుడు ధీరేంద్ర సింగ్‌(బ్లాక్‌ డ్రస్‌ వేసుకున్న వ్యక్తి)తో ఎమ్మెల్యే సురేంద్ర సింగ్‌)

నిందితుడు బల్లియా బీజేపీ ఎక్స్-సర్వీస్‌మెన్ విభాగానికి అధ్యక్షుడిగా ఉన్నట్టు ఎమ్మెల్యే సురేంద్ర సింగ్ ధ్రువీకకరించారు. హతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు 15 నుంచి 20 మందిపై పోలీసులు కేసు నమోదుచేశారు. అయితే, ఇప్పటి వరకూ ఎవరినీ అరెస్ట్ చేయలేదు. కాల్పుల తర్వాత అక్కడ జనం భయంతో పరుగులు తీయగా తొక్కిసలాట చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. భారీగా జనం గుమిగూడి ఉండగా.. నిందితుడు మూడు రౌండ్లు కాల్పులు జరిపినట్టు వీడియోలో స్పష్టమవుతోంది. (చదవండి: యోగీ కాచుకో.. ఇదే నా చాలెంజ్‌!)

అధికారుల సమక్షంలో ఈ ఘటన జరగడంపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ తీవ్రంగా స్పందించారు. ఆ సమయంలో ఉన్న అధికారులను సస్పెండ్ చేయాలని ఆదేశించారు. ఈ ఘటనను సీఎం తీవ్రంగా పరిగణిస్తున్నారని, ఆర్డీఓ సహా అక్కడ ఉన్న పోలీస్ అధికారులపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్టు హోంశా అదనపు ప్రధాన కార్యదర్శి అవనీశ కుమార్ అవస్థీ తెలిపారు. అధికారుల పాత్రపై దర్యాప్తు జరిపించి, నేరం రుజువైతే కఠిన చర్యలు తీసుకోవాలని సూచించినట్టు పేర్కొన్నారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top