ఆ తల్లి తన ప్రాణాల్ని పణంగా పెట్టి.. | Bihar Samastipur Shahpur Patori Train Railway track Mother Viral Video | Sakshi
Sakshi News home page

ఆ తల్లి తన ప్రాణాల్ని పణంగా పెట్టి..

May 16 2026 7:05 AM | Updated on May 16 2026 7:32 AM

Bihar Samastipur Shahpur Patori Train Railway track Mother Viral Video

కాస్తుంటే.. ఆ ఐదుగురి ప్రాణాలు పట్టాల కింద నలిగిపోయేవి. కానీ, సమయస్పూర్తితో ఆమె వ్యవహరించిన తీరు.. అదనంగా ఆ తల్లి చూపిన తెగువ.. వాళ్లను సురక్షితంగా బయటపడేలా చేసింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది.

శుక్రవారం ఉదయం బిహార్‌ షాహ్‌పూర్ పటోరీ రైల్వే స్టేషన్‌లో ఓ ఘోర ప్రమాదం తప్పింది. ఐదుగురు మహిళలు, ఇద్దరు చిన్నారులు కాస్త ఉంటే ప్రాణాలు కోల్పోయేవారు. అయితే అందులో మమత అనే మహిళ తన ప్రాణాలను పణంగా పెట్టి తన బిడ్డ ప్రాణాలు కాపాడుకోవడంతో పాటు బంధువులనూ రక్షించుకోగలిగింది. ఈ క్రమంలో ఆమెకు గాయాలు అయ్యాయి. 

వీళ్లంతా వైశాలి జిల్లా జందాహాలో జరిగిన ఒక పెళ్లి వేడుకకు హాజరయ్యారు. రోసరా వెళ్లేందుకు టికెట్‌ తీసుకుని ఫ్లాట్‌ఫారమ్‌కు వెళ్తున్నారు. అయితే ఫుట్‌ఓవర్‌ బ్రిడ్జి ద్వారా కాకుండా పట్టాల ద్వారా దాటేందుకు ప్రయత్నించారు. ఆ సమయంలో ప్లాట్‌ఫారమ్‌ మీద ఓ గూడ్స్‌ రైలు ఉంది. దాని కింద నుంచి దాటుతున్న టైంలో.. రైలు హఠాత్తుగా కదిలింది. అంతే.. ఆ దృశ్యం చూసిన అందరి గుండెలు గుభేల్‌మన్నాయి. 

వాళ్లు రైలు కింద నలిగిపోవడం ఖాయమని అంతా భావించారు. హాహాకారాలతో ఆ ప్రాంతం మారోమోగిపోయింది. కానీ, మమత సమయస్ఫూర్తి ప్రదర్శించింది. తన ఇద్దరు పిల్లలను కౌగిలించుకుని.. మిగతా వాళ్లనూ రైలు-ప్లాట్‌ఫారమ్‌ మధ్యలో సన్నని ఖాళీలో పట్టుకుని ఉండిపోయింది. అది గమనించిన కొందరు ఆమెకు చెయ్యి అందించారు. ఈలోపు గూడ్స్‌ వేగం పుంజుకోవడంతో అందరూ ఉత్కంఠగా ఎదురు చూశారు. 

ఈ క్రమంలో రైలు ఆమెను ఢీ కొట్టుకుంటూ పోవడంతో గాయాలు అయ్యాయి. ఆపై గూడ్స్‌ వెళ్లిపోవడంతో.. వాల్లు ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. అక్కడే ఉన్న ప్రయాణికుల సాయంతో గాయపడిన మమతకు తక్షణ చికిత్స అందించగా.. ఆమె కోలుకుని వెళ్లిపోయింది. 

ఆ వీడియోలు నెట్టింట వైరల్‌ అవుతోంది. తల్లి తన ప్రాణాలను పణంగా పెట్టి పిల్లలను రక్షించిన ధైర్యాన్ని ప్రజలు ప్రశంసించారు. “రెప్పపాటులో తీసుకున్న నిర్ణయం ఐదు ప్రాణాలను కాపాడింది” అని వ్యాఖ్యలు వెల్లువెత్తాయి. అదే సమయంలో..  ఈ సంఘటన రైల్వే భద్రతా చర్యలపై ప్రశ్నలు లేవనెత్తింది. ప్రయాణికులు ఎప్పుడూ ఫుట్ ఓవర్ బ్రిడ్జ్ వాడాలని అధికారులు మళ్లీ హెచ్చరించారు. షార్ట్‌కట్‌ ప్రయత్నాలు ప్రాణాలకు ముప్పు అని గుర్తు చేశారు. ఈ వీడియో చూశాక.. 'ప్రపంచంలో తల్లిని మించిన యోధులు ఎవరూ లేరు..’ అనకుండా ఉండగలరా?.. 

 

Advertisement
 
Advertisement
Advertisement