ఫిబ్రవరికల్లా కోవాగ్జిన్‌

Bharat Biotech Covid-19 vaccine could be launched by February - Sakshi

న్యూఢిల్లీ: కోవిడ్‌పై పోరుకు భారత్‌ బయోటెక్‌ కంపెనీ సిద్ధం చేస్తున్న వ్యాక్సిన్‌ వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి అందుబాటులోకి వచ్చే అవకాశముందని ప్రభుత్వ సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు.  కోవాగ్జిన్‌ పేరుతో కంపెనీ తయారు చేస్తున్న టీకా మూడో దశ మానవ ప్రయోగాలు కొనసాగుతున్నాయి. భారత్‌ బయోటెక్‌ భారతీయ వైద్య పరిశోధన సమాఖ్య (ఐసీఎంఆర్‌) లు కలిసి ఈ టీకాను తయారు చేస్తున్నాయి. వ్యాక్సిన్‌ సామర్థ్యం బాగానే ఉందని ఐసీఎంఆర్‌ సీనియర్‌ శాస్త్రవేత్త, టీకా టాస్క్‌ఫోర్స్‌ సభ్యుడు రజనీకాంత్‌ గురువారం న్యూఢిల్లీలో తెలిపారు. ‘‘వచ్చే ఏడాది మొదట్లో.. ఫిబ్రవరి లేదా మార్చిలలో అందుబాటులోకి (టీకా) వస్తుంది’’అని ఆయన వ్యాఖ్యానించారు. ఇదే నిజమైతే భారత్‌ సిద్ధం చేసిన తొలి కోవిడ్‌ నిరోధక టీకాగా కోవాగ్జిన్‌ రికార్డు సృష్టిస్తుంది.

భారతీయులను నిలిపేసిన చైనా
భారత్‌ నుంచి చైనాకు వెళ్లేందుకు కేటాయించిన విమానాలను చైనా నిలిపివేసింది. కోవిడ్‌–19 వ్యాప్తి నేపథ్యంలో భారతీయులు తమ దేశంలోకి ప్రవేశించడాన్ని తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు చైనా ఎంబసీ ప్రకటించింది. దాదాపు 2 వేల మంది ఈ చర్య వల్ల భారత్‌లోనే ఆగిపోయే అవకాశం ఉంది. సరైన పర్మి ట్లు ఉన్నప్పటికీ నిలిపివేస్తున్నట్లు చెప్పింది.

మళ్లీ 50 వేలు
దేశంలో ఇటీవల కరోనా కొత్త కేసులు రోజుకు 50 వేల లోపు నమోదు కాగా, గురువారం ఆ సంఖ్య 50 వేలు దాటింది. గత 24 గంటల్లో 50,210 కొత్త కరోనా కేసులు బయటపడ్డాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 83,64,086కు చేరుకుందని కేంద్ర ఆరోగ్య శాఖ తెలిపింది. అదే సమయంలో 704 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 1,23,611కు చేరుకుందని ఆరోగ్య శాఖ తెలిపింది. కోలుకున్న వారి సంఖ్య  77,11,809కు చేరుకుంది. దీంతో మొత్తం రికవరీ రేటు 92.20 శాతానికి చేరింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top