దేశమాత స్వేచ్ఛ కోరి.. తిరుగుబాట్లు.. ఉరికొయ్యలు | Sakshi
Sakshi News home page

Azadi Ka Amrit Mahotsav: దేశమాత స్వేచ్ఛ కోరి.. తిరుగుబాట్లు.. ఉరికొయ్యలు

Published Wed, Jun 1 2022 6:14 PM

Azadi Ka Amrit Mahotsav: Indians Revolt Against East India Company - Sakshi

1947 వరకు ‘ఈస్టిండియా’, ‘బ్రిటిష్‌ ఇండియా’లే తప్ప మనకంటూ ‘మదర్‌ ఇండియా’ లేదు! వ్యాపారం చేసుకోడానికి కంపెనీ పెట్టి, ఆ కంపెనీ పేరులో స్థానికత కోసం వ్యూహాత్మకంగా ‘ఇండియా’ అనే పేరును జతకలిపి, బ్రిటన్‌ పార్లమెంటు అనుమతితో ‘ఈస్టిండియా కంపెనీ’గా అవతరించిన బ్రిటిష్‌ ప్రైవేటు వ్యాపారులు.. లాభాలతో, అపరిమితమైన సంపదలతో సంతృప్తిచెందక, సొంత సైన్యాన్ని సమకూర్చుకుని సొంత పాలన కూడా మొదలు పెట్టినా.. ఈస్టిండియా కంపెనీపై ఆ కంపెనీ ఆధిపత్య ప్రాంతాలలోని భారత సిపాయిలు తిరగబడటంతో కంపెనీ కథ ముగింపునకు వచ్చింది. అనంతరం ఇండియా పాలన పగ్గాలను 1858లో బ్రిటన్‌ తన చేతుల్లోకి తీసుకుంది. ఆ తర్వాత కూడా పదహారేళ్ల పాటు ఈస్టిండియా ఆనవాళ్లు దేశంలో కనిపిస్తూనే ఉన్నాయి. చివరికి 1874 జూన్‌ 1న ఈస్టిండియా తిరుగుముఖం పట్టింది.

1858 తరువాత కూడా భారత ప్రజానీకంలో చల్లారని ఆగ్రహ జ్వాలలు పెల్లుబుకుతూనే ఉన్నాయి. ఆనాటి క్వీన్‌ విక్టోరియా వాటిని చల్లార్చే ప్రయత్నమేమీ చేయలేదు. 1885లో ‘భారత జాతీయ కాంగ్రెస్‌’ స్థాపనకు ముందు ఈస్టిండియా కంపెనీ, బ్రిటిష్‌ ఇండియా హయాంలలో దేశం నలుమూలలా ఆగ్రహావేశాలు చెలరేగాయి. హిందీ ప్రాంతాలతో పాటు.. అస్సాం, బెంగాల్, గుజరాత్, తమిళనాడు, ఆంధ్ర, నిజాం ప్రాంతాలలో కూడా తిరుగుబాట్లు జరిగాయి. తిరగబడిన దాదాపు అందరినీ బ్రిటిష్‌ ప్రభుత్వం ఉరికంబాలు ఎక్కించింది. వాస్తవానికి అప్పటికి వందేళ్ల ముందు నుంచి ఈ తిరుగుబాట్లు, ఉరికంబాలు ఉన్నాయి.
 

ఆంధ్రప్రదేశ్‌
ఆంధ్ర ప్రాంతాన్ని కబళించే ప్రయత్నం 1766 నుంచి ఈస్టిండియా కంపెనీ ఎలా చేసిందో, ఆంధ్రా యోధులు కంపెనీని ఎలా ఎదుర్కొన్నారో ప్రొఫెసర్‌ కె.ఎస్‌.ఎస్‌. శేష¯Œ  ‘ఎర్లీ యాంటీ బ్రిటిష్‌ రివోల్ట్స్‌ ఇన్‌  ఆంధ్ర 1766–1857’ అనే పుస్తకంలో వివరించారు.  1846 నాటి ఉయ్యాలవాడ నరసింహారెడ్డి పోరాటం, విశాఖపట్నం, మొమినాబాద్, బొల్లారం తిరుగుబాట్లు అలాంటివే. కర్నూలు జిల్లాలో కంపెనీ దమనకాండకు నిరసనగా పోరుబాట పట్టిన ఐదువేల మంది రైతులకు నరసింహారెడ్డి నాయకత్వం వహించాడు. 1847 ఫిబ్రవరి 22న నరసింహారెడ్డిని ఉరి తీయడంతో ఉద్యమం చల్లారిపోయింది.

తమిళనాడు, మహారాష్ట్ర
తమిళనాడులోని నెల్కట్టుంసేవల్‌ ప్రాంత పాలెగాడు పులిదేవర్‌. 1757లో ఈస్టిండియా కంపెనీకి వ్యతిరేకంగా ఇతడు పోరాడాడు. 18వ శతాబ్దంలో దక్షిణాదిన కనిపించే మరొక వీరుడు వీరపాండ్య కట్టబొమ్మ కరుతయ్య నాయకర్‌. పాంచాల¯Œ కురుచి ప్రాంతాన్ని పాలించేవాడు. ఈస్టిండియా కంపెనీ ఆధిపత్యాన్ని  ప్రశ్నించినందుకు అతడిని 1799లోనే ఉరి తీశారు. మహారాష్ట్ర ప్రాంతం సతారాలో 1822–25 ప్రాంతాలలో జరిగిన రామోసీల తిరుగుబాటు కూడా కంపెనీని భయపెట్టింది. వాసుదేవ్‌ బల్వంత్‌ ఫడ్కే.. వారి విప్లవ యోధులలో ఒకరు. రామోసీలు అంటే పోలీసు, సైనిక వ్యవస్థలో ఉండే అత్యంత కింది స్థాయి ఉద్యోగులు. వీరే చిత్తూర్‌సింగ్‌ నాయకత్వంలో తిరగబడ్డారు.

తూర్పు భారతం
19వ శతాబ్దంలో తూర్పు భారతంలో ముఖ్యంగా అస్సాంలో కంపెనీకి వ్యతిరేకంగా అనేక తిరుగుబాట్లు జరిగాయి. యాండాబు ఒప్పందం (1826) మేరకు అస్సాం.. కంపెనీ అధీనంలోకి వచ్చింది. యథాప్రకారం కంపెనీ కిందకు అస్సాం రావడం, కల్లోలం ఆరంభం కావడం ఏకకాలంలో జరిగాయి. తిరుగుబాట్లలో అటు పై వర్గాల వారు, మధ్య, దిగువ తరగతుల వారు కూడా పాల్గొన్నారు. అలాంటి ప్రయత్నం చేసిన వారిలో మొదటి వ్యక్తి గోంధార్‌ కున్వార్‌. స్థానిక పాలకులైన కుందురా దీకా ఫుఖాన్, దామోదర్, హర్నాథ్‌  కూడా అతడికి సహకరించారు. వీరంతా కలసి 1828లో సాడియా అనే చోట కంపెనీ ఆయుధాగారం మీద దాడి చేశారు. అది విఫలమైంది. 

మళ్లీ పియాలీ బర్ఫూఖన్‌ నాయకత్వంలో మరొక తిరుగుబాటు జరిగింది. ఈయనకు జీయురాం దూలియా బారువా, బేణుధర్‌ కున్వార్, రూప్‌చంద్‌ కున్వార్, దేయురాం దిహింగియా, బౌవ్‌ు చింగ్‌ఫూ, హర్నాథ్‌ తదితరులు సహకరించారు. రంగపూర్‌లో ఉన్న బ్రిటిష్‌ శిబిరాన్ని దగ్ధం చేయాలని పియాలీ బర్ఫూఖన్‌ నాయత్వంలో జరిగిన ప్రయత్నం విజయవంతమైంది. కానీ పియాలీ, జియురాం బారువా, ఇంకొందరు ఆందోళనకారులను కంపెనీ అధికారులు పట్టుకున్నారు. పియాలీ, జియురాంలను ఉరి తీసి, మిగిలిన వారిని ద్వీపాంతరం పంపారు. ఇదే సమయంలో ఎగువ అస్సాంలో పనిచేసే కొందరు కంపెనీ బ్రిటిష్‌ జాతీయులను చంపాలని గదాధర్‌ గొహిన్‌ అనే మరొక వీరుడి నాయకత్వంలో ప్రయత్నించారు. కానీ ఇది విఫలయింది. గదాధర్‌ను జైలులో పెట్టారు.

1857 ప్రథమ స్వాతంత్య్ర పోరాట సమయంలో ఆ జ్వాలను అస్సాంకు తీసుకుని వెళ్లిన యోధుడు మణిరాం దివాన్‌. ఆ సమయంలో కలకత్తా వెళ్లి, మరొక ఉద్యమకారుడు మధు మల్లిక్‌ సాయంతో పథకం వేశాడు. అయితే పథకం అమలులో కొద్దిపాటి ఆలస్యం కావడంతో కంపెనీ వెంటనే అప్రమత్తమై తిరుగుబాటులో ఉన్నవారందరినీ అదుపులోకి తీసుకుంది. కలకత్తా నుంచి పనిచేస్తున్న మణిరాంను కూడా అరెస్టు చేశారు. కందర్పేశ్వర్‌సింగ్‌ను కారాగారంలో పెట్టారు. చాలామందిని ద్వీపాంతరం పంపారు. మణిరాం, పియాలీ జోర్హాట్‌ కారాగారంలోనే చనిపోయారు.

1861, 1894లలో ఫులగారి, పత్థర్‌ఘాట్‌ అనేచోట రైతాంగ పోరాటాలు జరిగాయి. ఇలాంటివి పదులు, వందలుగా జరిగిన తిరుబాట్ల ఫలితంగా ఈస్టిండియా కంపెనీని బ్రిటిష్‌ ప్రభుత్వం తిరుగుబాట పట్టించవలసి వచ్చింది.
 


 

Advertisement
Advertisement