Azadi Ka Amrit Mahotsav: Indian Rebellion Of 1857 ( Sepoy Mutiny ) History In Telugu - Sakshi
Sakshi News home page

Indian Rebellion of 1857 History: ప్రేరణకు ::: ప్రాణత్యాగాలకు దక్షిణాదే పునాది!

Published Wed, Jun 29 2022 8:04 AM

Azadi Ka Amrit Mahotsav Indian Rebellion Of 1857 - Sakshi

ప్రథమ స్వాతంత్య్ర సమరంగా పరిగణించే సిపాయిల తిరుగుబాటు జరిగి నూట అరవై ఐదేళ్లు అయ్యాయి. అయితే 1857కు దాదాపు ఒక శతాబ్దం ముందు నుండే తిరుగుబాట్లు అనేవి తమ తర్వాతి ఉద్యమాలకు ప్రేరణ కల్పించడమే కాకుండా ‘సైద్దాంతిక  నేపథ్యాన్ని’ కార్యాచరణకు అవసరమైన ‘దశ–దిశ’లను నిర్దేశించగలిగాయి. ఆ తొలి పోరాటాలు భావి తరాల ఉద్యమాలకు బీజాంకురాలుగా పరిణమించి క్రమేణ జాతీయోద్యమ స్పూర్తితో స్వాతంత్య్ర సమరాన్ని కొనసాగింప జేయడానికి దోహదపడ్డాయి. ఈ క్రమంలో దక్షిణ భారతదేశంలో జరిగిన బ్రిటిష్‌ వ్యతిరేక తొలి తిరుగుబాట్లే 1857 సిపాయిల తిరుగుబాటుకు పునాదులు అయ్యాయని చెప్పాలి. 

‘మన ముందు వాళ్లెంత?!’
తొలి దక్షిణ భారత తిరుగుబాట్లు ప్రధానంగా జమీందార్లు, స్థానిక నాయకులు, పాలెగాళ్లు, సిపాయిలు తాము సనాతన కాలం నుంచి అనుభవిస్తూ వచ్చిన అధికారాలను బ్రిటిష్‌ వారు హరించేస్తున్నందుకు ప్రతిగా మొదలయ్యాయి. కొనసాగాయి. బ్రిటిష్‌ వారికి శక్తిమంతమైన, సమర్థమైన సైనిక, అధునాతన యుద్ధ సామగ్రి ఉందని తెలిసినా, స్థానిక నాయకులు ‘బ్రిటిష్‌వారు తక్కువమంది – మనకున్నది ఎక్కువ మంది’ అన్న ఆత్మ విశ్వాసంతో, ఎప్పటికైనా వలస పాలకులను తిప్పికొట్టొచ్చనే నమ్మకంతో ఈ తిరుగుబాట్లు చేశారు. కాకతీయ రుద్రమ పాలనలో మొదలైన ‘నాయంకర’ వ్యవస్థకు విజయనగర సామ్రాజ్యపు  ‘పాలెగాళ్ల వ్యవస్థ’ తోడయింది. విజయనగర సామ్రాజ్యంలో పలు విధాలుగా పాలన విభజన ఉండేది.

రాజధాని, ఇతర ముఖ్యప్రాంతాలను చక్రవర్తి స్వయంగా పరిపాలించేవాడు. రాజధాని నుంచి దూరంగా ఉన్న ముఖ్య కేంద్రాలను చక్రవర్తి కుటుంబ సభ్యులతో లేదా ఇతర బంధువులతో పాలించేవాడు. సామంతులకు మిగిలిన వారికన్నా కొంత స్వయం ప్రతిపత్తి ఉండేది. చిన్న ప్రాంతాలను ‘అమరం’ గా సైన్యంలోని కొందరు ముఖ్యులకు, మంత్రులకు ఇచ్చేవారు. వారిని అమరనాయకులు అంటారు. వీరు స్వయంగా సైన్యాన్ని ఏర్పరచుకొని చక్రవర్తికి మద్దతుగా యుద్ధాల్లో పాల్గొంటారు. అమరనాయక ప్రాంతంలో పన్నుల ద్వారా వచ్చే ఆదాయం, వీరికి సైన్యం కోసం పెట్టే ఖర్చును బట్టి చక్రవర్తి వీరి కప్పం లేదా శిస్తు లేదా పన్నును నిర్ణయించేవాడు.

పాలెగాళ్లు, అమరనాయక ప్రాంతం కన్నా చిన్న ప్రాంతాల్లో ముఖ్యంగా.. అడవులు, కొండలు , రాజధాని సరిహద్దులో ఉండే ప్రాంతాల్లో శాంతి భద్రతలు, పన్ను వసూలు; బాటసారులు, యాత్రికుల రక్షణ, బందిపోట్ల దాడులను ఎదుర్కొనేందుకు ప్రత్యేక రక్షణ దళాలను ఏర్పరిచేవారు. పాలెగాళ్లు నామమాత్రపు ‘కప్పాన్ని’ చక్రవర్తికి కట్టేవాళ్ళు. వీళ్లు రాజులు లేక సామంతులు కాకపోయినా ఆయా ప్రాంతాలలో సొంత పాలన నడిచేది. అలాంటి కొందరు బ్రిటిష్‌ వారి పై చేసిన తిరుగుబాట్లే దేశ స్వాతంత్య్ర సాధనకి తొలి పునాదులు. వీరే తొలి విప్లవ వీరులు.

ఖడ్గం ఝుళిపించిన టిప్పు
వర్తకానికై భారతదేశం వచ్చిన ఈస్ట్‌ ఇండియా కంపెనీ వారు క్రమంగా స్థానిక పాలకుల నుండి శిస్తులు వసూలు చేసుకుని అధికారం పొంది, క్రమేణా తమ వలస సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ వెళ్లారు. 1757 సంవత్సరంలో ప్లాసీ యుద్ధంలో సిరాజుద్దౌలా ఓటమితో ఉత్తర భారతదేశంలో ఈస్ట్‌ ఇండియా కంపెనీ తన అధికారం సుస్థిరం చేసుకుంది. తర్వాత దక్షిణ భారతదేశం వైపు దృష్టి పెట్టింది. ఇక్కడ టిప్పు సుల్తాన్‌ 23 సంవత్సరాల యువకుడు. ఆంగ్లేయులను ముప్పు తిప్పలు పెట్టి వీరోచితంగా పోరాడి 1799 ‘శ్రీరంగ పట్నం’ యుద్ధ రంగంలో వీరమరణం పొందాడు. ఆ తరువాత కొన్ని నెలలకే దక్షిణాన మరొక వీరుడు, ఆవిర్భవించాడు. అతడే వీరపాండ్య కట్టబ్రహ్మన. తమిళనాడుకు చెందిన ప్రసిద్ధ పాంచాలపురం కోట పాలకుడు. తొలి విప్లవ వీరుడు. గొప్ప దేశ భక్తుడు. 

వణికించిన వీరపాండ్య
వీరపాండ్య కట్టబ్రహ్మన ఆంగ్లేయుల అక్రమాలకు అడ్డుకట్టగా నిలిచి తన సైన్యాన్ని సిద్ధం చేసి ఉంచాడు. కట్టబ్రహ్మన శక్తి సామర్థ్యాలను అంచనా వేయలేని బ్రిటిష్‌ వారు అదనపు సైన్యంతో పాంచాలపుర కోటపై దాడిచేశారు. కట్టబ్రహ్మన వారిని వీరోచితంగా ఎదుర్కొన్నాడు. బ్రిటిష్‌ ఫిరంగి దాడిలో కట్టబ్రహ్మన అనుచరుడు పిళ్లై పట్టుబడ్డాడు. పిళ్లై శవాన్ని బ్రిటిష్‌వాళ్లు కోట గుమ్మానికి వేలాడ తీశారు. బ్రహ్మన మనోధైర్యాన్ని దెబ్బ తీయడానికి బ్రిటిష్‌ వారు సర్వ శక్తులు ధారపోశారు. తన ఆచూకీ చెప్పిన వారికీ, లేదా తల తెచ్చిన వారికి బహుమానం ప్రకటించారు. వీర పాండ్య కట్టబ్రహ్మన అనేక ప్రాంతాలలో అజ్ఞాత జీవితం గడిపాడు. చివరికి ‘కోలార్‌ పట్టి’ లో రాజగోపాల్‌ నాయకర్‌ ఇంటిలో ఉండగా సైనికులు ఆ ఇంటిని చుట్టుముట్టారు.

కట్టబ్రహ్మన్న నేర్పుతో కాల్పులు జరుపుతూ, ఆంగ్లేయ సైనిక వల నుండి బయటపడి ‘కుడుకుట్టార్‌’’ అడవులకు చేరాడు. అడవులను చుట్టు ముట్టిన కంపెనీ సైనికులు అణవణువూ గాలించి ఎట్టకేలకు బ్రహ్మనను పట్టుకున్నారు. విచారణ జరిపి 1799 అక్టోబర్‌16 న చింత చెట్టుకు కట్టబ్రహ్మనను ఉరి తీశారు. సాహసవీరుడిగా, దేశ భక్తుడిగా కట్టబ్రహ్మన చరిత్ర వీరగాథ తరతరాల యువతకు ఉత్తేజం కల్పిస్తుంది. తాను మరణించినా మరెందరో విప్లవ వీరులు మాతృభూమి దాస్య శృఖలాలు ఛేదిస్తారని ఉద్వేగ ప్రసంగం చేసి, ఉరితాటిని ముద్దాడి ప్రాణత్యాగం చేసాడు కట్ట బ్రహ్మన.    
– డాక్టర్‌ మురళి పగిడిమర్రి పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ కళాశాలలో చరిత్ర శాఖాధిపతి

(చదవండి: విదురాశ్వత్థ)

Advertisement

తప్పక చదవండి

Advertisement