ఏడైతే దడ! నిజాంకు వ్యతిరేకంగా మూడు భాషల్లో వార్తలు

Azad ki Amrit Mahotsav Bhagyanagar Radio - Sakshi

స్వాతంత్య్ర సమరం గురించి గానీ, ప్రజల ఇక్కట్ల గురించి గానీ బ్రిటీషు ప్రభుత్వం నిర్వహించే రేడియో  కేంద్రాలలో ప్రసారాలు ఉండేవి కావు. కనుకనే ఆజాద్‌ హింద్‌ రేడియో, ఆజాద్‌ రేడియో వంటివి అవసరమయ్యాయి. ఇలా చరిత్రలో తళుక్కుమన్న ప్రజా రేడియో కేంద్రాలు.. భాగ్యనగర్‌ రేడియో,  ది వాయిస్‌ ఆఫ్‌ ఫ్రీడమ్‌. వాయిస్‌ ఆఫ్‌ ఫ్రీడమ్‌ రేడియో ప్రసార పటిమ గురించి నిన్నటి సంచికలో తెలుసుకున్నాం. ఇక భాగ్యనగర్‌ రేడియో! నైజాం పాలనకు వ్యతిరేకంగా, హైదరాబాద్‌ సంస్థానం సరిహద్దులో ఉండే కర్నూలు నుంచి నడిచింది. నిజాం పాలనకు వ్యతిరేకంగా ప్రసారాలు చేసిన ఘన చరిత్ర ‘భాగ్యనగర్‌ రేడియో’ కు దక్కుతుంది.

‘భాగ్యనగర్‌’ కీర్తి బావుటా
వెల్దుర్తి మాణిక్యరావు తన పుస్తకం ‘హైదరాబాదు సంస్థానంలో స్వాతంత్య్రోద్యమం’లో ఇలా పేర్కొన్నారు : ‘‘భాగ్యనగర్‌ రేడియో ప్రసారాల వల్ల హైదరాబాదు రాష్ట్ర స్వాతంత్య్ర సమరానికి అనేక ప్రయోజనాలు కలిగాయి. మొదటి స్టేట్‌ కాంగ్రెస్‌ నాయకత్వాన జరుగుతున్న విముక్తి ఉద్యమం గురించి ప్రజల్లో విరివిగా ప్రచారం చేయగలిగారు. రజాకార్లు, మజ్లీసువారు, ముస్లిం కాందిశీకులు, మతోన్మాదులైన నిజాం పోలీసులు, సైనికులు సంస్థానంలో ప్రజల పై జరిపే అత్యాచారాలను, దుండగాలను, దోపిడీలను, దురంతాలను బట్టబయలు చేసి వారి నిజస్వరూపాల్ని బహిర్గతం చేసే వీలు కలిగింది.

సంస్థానంలో ఎటువంటి రాక్షసత్వం స్వైరవిహారం చేస్తూ ఉన్నదో అందరూ తెలుసుకోగలిగారు. స్టేట్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు నిజాం దుష్టశక్తులను ఎలా ఎదుర్కొంటున్నారో ప్రజలు తెలుసుకోవడానికీ, వారికి ధైర్యం, మనో నిబ్బరం కలిగించడానికి ఈ రేడియో కేంద్రం ఎంతగానో ఉపకరించింది.’’ అదీ భాగ్యనగర్‌ రేడియో కీర్తి బావుటా! ఈ రేడియో వెనుక భాసించే సాహసి పాగా పుల్లారెడ్డి (1919 మే 10– 2010 అక్టోబర్‌ 20). గద్వాల ప్రాంతం మనోపాడు మండలం జల్లాపూర్‌ గ్రామంలో జన్మించిన పుల్లారెడ్డి చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయారు. గద్వాల మహారాణి ఆదిలక్ష్మి దేవమ్మ సహాయంతో చదువుకున్నారు. 1947–48 కాలంలో హైదరాబాదు సంస్థానం విముక్తం కావడానికి చేపట్టిన ఉద్యమంలో చాలా చురుకుగా పాల్గొన్నారు. 

రెడ్డిగారు – రేడియో
గద్వాల పురపాలక సంఘం ఛైర్మన్‌ (1968)గా, గద్వాల శాసన సభ్యులు (1972)గా సేవలందించిన పుల్లారెడ్డి తొలుత 1952లో గద్వాల – అలంపూర్‌ ద్విసభ్య నియోజకవర్గం నుంచి హైదరాబాదు రాష్ట్ర శాసన సభకు ఎన్నికయ్యారు. హైదరాబాదు, ఆంధ్రరాష్ట్రాల విలీనం సమయంలో కొత్త రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్‌ అనే పేరును పాగా పుల్లారెడ్డి సూచించగా బూర్గుల రామకృష్ణారావు బలపర్చారు. మరి భాగ్యనగర్‌ రేడియోకు, పాగా పుల్లారెడ్డికి అనుబంధం ఏమిటి? దీనికి సంబంధించిన కొంత సమాచారం.. గడియారం రామకృష్ణశర్మ ఆత్మకథ ‘శతపత్రము’లో ‘స్టేట్‌ కాంగ్రెస్‌ పునరుద్ధరణ – నిజాం విముక్తి పోరాటం’ అనే అధ్యాయంలో కనబడుతుంది.

అన్ని సంస్థానాలు భారత దేశంలో చేరిపోగా ఒక నిజాం నవాబు మాత్రం తాను స్వతంత్రంగా ఉంటానని 1947 జూన్‌ నెలలో ప్రకటించారు. ఇది జరిగిన కొద్ది రోజులకే స్టేట్‌ కాంగ్రెస్‌ ప్రథమ మహాసభ హైదరాబాదులో జరిగింది. దీని తర్వాత జూన్‌ నెల చివరలో షోలాపూరులో జరిగిన కార్యవర్గ సమావేశంలో.. హైదరాబాదు సంస్థానంలో స్వాతంత్య్రోద్యమం తీవ్రస్థాయిలో జరపాలని నిర్ణయించారు. తెలంగాణ, కర్ణాటక, మరాట్వాడా ప్రాంతీయ సమితులు సంస్థానం బయట సరిహద్దులలో కార్యాలయాలను ఏర్పాటు చేసుకున్నాయి. పాగా పుల్లారెడ్డిని కర్నూలుకు, టి. హయగ్రీవాచారిని బెజవాడకు సర్వాధికారులుగా నియమించి సర్దార్‌ జమలాపురం కేశవరావు జైలుకు పోయారు.

ఆగస్టు 15న చెన్నిపాడు, మానవపాడు, ఇటికలపాడు, ఉండవెల్లి గ్రామాలలో ఎవరెవరు సత్యాగ్రహం చేస్తారో వివరాలను గడియారం రామకృష్ణ శర్మ ముందుగానే అలంపూరు పోలీసు స్టేషన్‌కు అందించారు. పాగా పుల్లారెడ్డి నేతృత్వంలో ఉద్యమ కార్యక్రమాలు పెద్ద స్థాయిలో కర్నూలులో విజయవంతంగా జరిగాయి. ఆ సమయంలోనే బ్రిటీషు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నడిపిన రేడియో ట్రాన్స్‌మీటర్‌ ను ‘లోకనాయక్‌’ జయప్రకాష్‌ నారాయణ్‌ ద్వారా వనపర్తి రాజారామేశ్వరరావు బొంబాయి నుంచి తెప్పించి పాగా పుల్లారెడ్డి కార్యాలయానికి ఇచ్చారు. 

రోజూ సాయంత్రం 7 గంటలకు
ఈ ట్రాన్స్‌మీటర్‌ దక్కన్‌ రేడియో కంటే శక్తివంతమైనది. ఫలితంగా ‘భాగ్యనగర్‌ రేడియో’ ప్రసారాలు విజయవాడ, మద్రాసుకు కూడా వినబడేవి. కర్నూలులో స్టేట్‌ కాంగ్రెస్‌ కార్యాలయం పక్కన ఉండే పల్లెపాడు జాగీర్దారు చంద్రశేఖర్‌ రెడ్డి ఇంట్లో ట్రాన్స్‌మీటర్‌ ను రహస్యంగా ఉంచారు. చంద్రశేఖర్‌ రెడ్డి కుమారులు జనార్దన్‌ రెడ్డి, గోవర్ధన్‌ రెడ్డి ట్రాన్స్‌మీటర్‌ ను ఇంట్లో ఉంచుకోవడమే కాక, దాన్ని చక్కగా నడిపించేవారు. ఈ రేడియో ప్రసారాలు ఏరోజు  మొదలు అయ్యాయో సమాచారం ప్రస్తుతం లభ్యం లేదు గానీ ప్రసారాలు ప్రతిరోజూ సా. 7 గంటల నుంచి  8 గం. దాకా తెలుగు, ఉర్దూ, ఇంగ్లీషు భాషల్లో నడిచేవి.

మొదట అరగంటలో మూడు భాషల్లో వార్తలు, తర్వాత మూడు భాషలలో ప్రసంగా లుండేవి. వార్తా బులెటిన్‌ల ప్రచురణ, రేడియో ప్రసార బాధ్యతలు గడియారం రామకృష్ణ శర్మకు అప్పగించారు. గొట్టుముక్కల కృష్ణమూర్తి సహాయకులు. ఉర్దూ ప్రసారాల బాధ్యతను వకీలు నాగప్ప చూసేవారు. దక్కన్‌ రేడియోలో కురుగంటి సీతారామయ్య కాంగ్రెస్‌నూ, స్వాతంత్య్రోద్యమాన్ని అవహేళన చేస్తూ ప్రసంగాలు చేస్తుండేవారు.

వీటిని ఖండిస్తూ, నిజాం ప్రభుత్వ దురాగతాలను హాస్యధోరణిలో విమర్శిస్తూ ప్రసంగాలు, వార్తలు రూపొందించేవారని గడియారం రామకృష్ణ శర్మ ‘శతపత్రము’లో వివరించారు. వనపర్తి రాజా, పాగా పుల్లారెడ్డి మధ్య అభిప్రాయ విభేదాలు రావడంతో రేడియో ట్రాన్స్‌ మీటర్‌ తిరిగి ఇచ్చేయమని రాజారామేశ్వరరావు నిర్బంధం చేయడంతో వెనక్కి ఇచ్చేశారు. 1948 జనవరి 30 న గాంధీజీ కన్నుమూశారనే పెనువిషాద వార్తను చివరిసారిగా ప్రసారం చేసి భాగ్యనగర్‌ రేడియో చరిత్ర పుటల్లో కలిసిపోయింది! 

– డా. నాగసూరి వేణుగోపాల్‌ 

(చదవండి: అడవి నుంచి రేడియో బాణాలు)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top