అడవి నుంచి రేడియో బాణాలు

Azadi Ka Amrit Mahotsav Voice Of Freedom Secrete Radio - Sakshi

947 ఆగస్టు 15 న స్వాతంత్య్రం సిద్ధించినా,  గోవా వంటి పోర్చుగీసు నియంత్రణ ప్రాంతం ఇంకోవైపు ఉంది. నాలుగు వందల యాభై ఏళ్లకు పైగా గోవా ప్రాంతం పోర్చుగీసు వారి కబంధ హస్తాలలో అతలాకుతలమైంది. అటువంటి చోట విముక్తి పోరాటానికి దన్నుగా ఒక  సీక్రెట్‌ రేడియో కూడా నిలిచింది. అదే.. ‘వాయిస్‌ ఆఫ్‌ ఫ్రీడమ్‌’ అనే రహస్య రేడియో. 
అదొక ఉద్యమ చరిత్ర. 

విముక్తి లభించిన రోజు
ఆ రోజు, ‘వాయిస్‌ ఆఫ్‌ ఫ్రీడమ్‌’ రహస్య రేడియో కేంద్రం సిబ్బంది.. విమానానికి రేడియో ట్రా¯Œ ్సమీటర్‌ బిగించారు. లౌడ్‌ స్పీకర్‌ అమర్చారు. వారంతా ఆ విమానం ఎక్కారు. పూలు చల్లుతూ 450 సంవత్సరాల చరిత్రలో అపురూపమైన వార్తను ప్రకటిస్తూ ఒక రెండు గంటలపాటు ఆ ప్రాంతంలో ఆకాశయానం చేశారు. 1961 డిసెంబరు 19న స్వేచ్ఛ సిద్ధించి గోవా ప్రాంతం స్వతంత్ర భారతంలో కలసిన వేళ.. అలాంటి చారిత్రక సందర్భంలో రహస్య రేడియో కేంద్రం వేదిక కావడం విశేషం. గోవా స్వాతంత్య్రం కోసం మొదలైన ‘ది వాయిస్‌ ఆఫ్‌ ఫ్రీడమ్‌’.. ఒక అండర్‌ గ్రౌండ్‌ రేడియో స్టేషన్‌. 1955 నవంబరు 25న మొదలైన ఈ రేడియో స్టేషన్‌ గోవాకు స్వాతంత్య్రం లభించిన రోజు విజయోత్సవంలో పాల్గొని తన ప్రసారాలు ఆ రోజుతో నిలిపివేసి, విలువైన చరిత్రలో విలక్షణ పుటగా మారిపోయింది!

ఆర్థిక నిర్బంధంతో దారికి
1510లో గోవా ప్రాంతం పోర్చుగీసు స్థావరంగా మారిపోయింది. బ్రిటీషువారు భారతదేశపు చాలా భాగాలు ఆక్రమించినా పాండిచ్చెరి ఫ్రెంచి వారి చేతిలోకి వెళ్లిపోయినట్టు.. గోవా, డయ్యు, డమన్‌  పోర్చుగీసు చేతిలో ఉండిపోయాయి. గోవాకూ, మిగతా భారతదేశానికి పెద్దగా సంబంధాలు లేకుండా పోయాయి. 1932లో గోవా గవర్నర్‌ గా యాంటోనియో డి ఒలివీరా సలాజార్‌ వచ్చిన తర్వాత ఆంక్షలు పెరగడం, ప్రజల హక్కులు హరించడం మొదలైంది. భారత్‌ పోర్చుగల్‌ సంబంధాలు రెండవ ప్రపంచ యుద్ధం అనంతర పరిణామాల మీద ఆధారపడి బెడిసికొట్టాయి.

1940 వ దశకం నుంచి స్వాతంత్య్ర పోరాటం గురించి ఆలోచనలు, ప్రయత్నాలు మొదలయ్యాయి. 1954లో దాద్రా నగర్‌ హవేలీ విముక్తి పొందడం కొత్త ఆలోచనలకు ద్వారాలు తీసింది. 1955లో భారత ప్రభుత్వం ‘ఎకనమిక్‌ బ్లాకేడ్‌’ ప్రకటించడంలో గోవా పరిస్థితి ఎలా ఉందంటే బంగాళ దుంపలు (నెదర్లాండ్‌); వైన్‌ (పోర్చుగీసు); కూరలు, బియ్యం (పాకిస్తాన్‌); టీ (శ్రీలంక), సిమెంట్‌ (జపాన్‌), ఉక్కు (బెల్జియం నుంచి) దిగుమతి చేసుకునే పరిస్థితి ఏర్పడింది. 1961లో చేపలు పట్టే భారతీయుల పడవలపై గోవా కాల్పులకు దిగడంతో పరిస్థితి తారస్థాయికి వచ్చింది. అనంతర పరిణామమే పోర్చుగీసు నంచి గోవా విముక్తి. 

అడవి నుంచి ప్రసారాలు!
గోవా విముక్తి కోసం అంతకు ఐదేళ్ల ముందు.. 1955 నవంబరు 25న ఉదయం 7 గం.లకు ‘వాయిస్‌ ఆఫ్‌ ఫ్రీడమ్‌’ అనే సీక్రెట్‌ రేడియో గోవా సరిహద్దు రాష్ట్ర ప్రాంతం అంబోలి  అడవుల నుంచి మొదలైంది. 1947లో స్వాతంత్య్రం లభించి భారతదేశంలో వీచిన స్వేచ్ఛా పవనాల స్ఫూర్తితో వామన్‌ సర్దేశాయి, లిబియా లోబో అనేవారు కలసి ఈ సీక్రెట్‌ రేడియో సర్వీసును పోర్చుగీసు, కొంకణి భాషల కార్యక్రమాలతో ప్రారంభించారు.

వారిరువురూ గోవా స్వాతంత్య్రం కోసం ప్రారంభించిన ‘ది వాయిస్‌ ఆఫ్‌ ఫ్రీడమ్‌’  రేడియో స్టేషన్‌ ట్రాన్స్‌మీటర్‌ ను ఒక ట్రక్కుకు బిగించి, దట్టమైన అడవుల నుంచి ప్రసారాలు చేసేవారు.  గోవా అధికారికంగా చేసే ప్రాపగాండాను వమ్ము చేస్తూ నడిచిన ఈ సీక్రెట్‌ రేడియో ప్రసారాలకు భారతదేశం నుంచి, ఇతర దేశాల నుంచి మద్దతు లభించేది. ఆసియా, ఆఫ్రికా ఖండాలలో వలసపాలనకు వ్యతిరేకంగా నడిచే ఉద్యమాల వార్తలు కూడా ఇచ్చేవారు. ఈ విషయంలో గోవా ఒంటరి కాదనే భావం కలిగించి, ధైర్యం నూరిపోయడానికి వారి వార్తల పరిధిని పెంచారు.

ఇటీవల లిబియా లోబో ఫోటో

వినోభా రేడియో ప్రసంగం
ఈ రేడియో ఛానల్‌ ఇండియా భూభాగం నుంచి ప్రసారం అయ్యేది కనుక గోవాలో జరిగే పోరాటానికి మద్దతు ఇస్తూ భారతీయ నాయకుల ప్రసంగాలు కూడా ప్రసారం చేశారు. 1956 జూలై 15న  వినోబాభావే తన రేడియో ప్రసంగంలో శాంతియుతంగా గోవాను వదిలి వెళ్లిపొమ్మని పోర్చుగీసు వారిని కోరారు. భారత్‌ పార్లమెంటులో, ఇతర దేశాలలో ఈ విషయం పై జరిగే చర్చల సారాంశాలను కూడా శ్రోతలకు ఎప్పటికప్పుడు అందించేవారు. 1961 డిసెంబరులో విలీన కార్యక్రమం మొదలయ్యాక ‘వాయిస్‌ ఆఫ్‌ ఫ్రీడమ్‌’ బృందం అడవుల నుంచి  బెల్గాం ప్రాంతానికి వచ్చింది. ఆ సమయం నుంచి ప్రతి గంటకూ ప్రసారాలు చేశారు. గోవా ఆర్మీ నుద్దేశించి భారత రక్షణ మంత్రి వి.కె.కృష్ణ మీనన్‌ 1961 డిసెంబరు 15న ఈ సీక్రెట్‌ రేడియోలో  ప్రసంగిస్తూ చర్చలకు ఆహ్వానించారు.

భారత సైన్యం లోపలికే రాకుండా గోవా ఆర్మీ డిసెంబరు 17 న బ్రిడ్జిని కూల్చివేసింది. సుమారు 36 గంటలు వాయు, సముద్ర, భూ తలాలపై కూడా  భీకర పోరాటం నడిచింది. తర్వాత డిసెంబరు 19 న గోవా ప్రాంతం భారత భూభాగంలో కలసిపోయింది. ఆ రోజున... ఈ వ్యాసం మొదట్లో ఉన్నట్లు  ఇండియన్‌ ఎయిర్‌ ఫోర్స్‌ విమానంపై వాయిస్‌ ఆఫ్‌ ఫ్రీడమ్‌ రేడియో బృందం గోవా విముక్తి వార్తను ఆకాశమార్గం గుండా ప్రకటించింది.

1955 నవంబరు 25 నుంచి 1961 డిసెంబరు 19 దాకా ‘వాయిస్‌ ఆఫ్‌ ఫ్రీడమ్‌’ సీక్రెట్‌ రేడియోలో వామన్‌ దేశాయి, లిబియా లోబో జంట తమ బృందంతో అడవులలో పడిన ఇబ్బందులు ఎన్నో, అవి ఏమిటో మనకు తెలియవు. అయితే ఈ ‘వాయిస్‌ ఆఫ్‌ ఫ్రీడమ్‌’ రేడియో ప్రసార కాలంలో వారిరువురూ భార్యాభర్తలుగా మారిపోయారు. ‘వాయిస్‌ ఆఫ్‌ ఫ్రీడమ్‌’ రేడియో ఘన చరిత్ర.. భారత స్వాతంత్య్ర సమరం లోనే కాకుండా, ప్రపంచ రేడియో ప్రసారాల చరిత్రలోనే ఒక అద్భుతమైన, స్ఫూర్తి వంతమైన ఘట్టం! 
– డా. నాగసూరి వేణుగోపాల్‌ ఆకాశవాణి పూర్వ సంచాలకులు

(చదవండి: స్వతంత్ర భారతి 1967/2022)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top