మహోజ్వల భారతి: భారత విప్లవోద్యమ మాత

Azadi Ka Amrit Mahotsav Bhikaiji Rustom Cama  - Sakshi

భారతదేశంలో రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉంటానని లిఖిత పూర్వకంగా హామీ ఇస్తేనే అనుమతిస్తామని ఆంగ్లేయుల నుంచి సమాచారం అందింది. అందుకు  మేడమ్‌ కామా నిరాకరించి లండన్, పారిస్‌ నగరాలలోనే ఉండిపోయారు. 

పరాయి పాలనలోని దైన్యం భారతీయుల గుండెను తడుతున్న కాలమది. అలాంటి సమయంలో మేడమ్‌ కామా జన్మించారు. తండ్రి సొరాబ్జీ ఫ్రాంజీ పటేల్‌. బొంబాయిలోనే కోటీశ్వరులనదగ్గ పార్శీల కుటుంబం వారిది. నాటి చాలామంది పార్శీల మాదిరిగానే కామా కూడా ఇంగ్లిష్‌ విద్యను అభ్యసించారు. పలు భాషలలో ప్రావీణ్యం సంపాదించారు. చిన్నతనం నుంచి ఆమెలో ఒక తిరుగుబాటు తత్వం ప్రస్ఫుటంగా ఉండేది. ఆమె జాతీయ వాదం ఎంత గాఢమైనదంటే అందుకోసం ఆమె వైవాహిక జీవితాన్ని త్యాగం చేశారు.

1885లో ఆమె రుస్తోంజీ కేఆర్‌ కామాను వివాహం చేసుకున్నారు. రుస్తోంజీ కామా పూర్తిగా ఆంగ్లేయ పక్షపాతి.  భారత దేశానికి ఆంగ్లేయులు చేసిన మేలు అసాధారణమైనదని రుస్తోంజీ వాదన. భికాజీ కామా ఇందుకు పూర్తి విరుద్ధం. అణచివేత, దోపిడీ ఆంగ్ల జాతి మౌలిక లక్షణమని ఆమె ప్రగాఢ విశ్వాసం. ఫలితంగా ఆ దంపతులు విడిపోయారు. అప్పటికే భికాజీ కామా సమాజ సేవకురాలిగా మారిపోయారు. కానీ తన పేరులో నుంచి భర్త పేరును ఆమె తొలగించలేదు. 1890లో దేశంలో కనీవినీ ఎరుగని రీతిలో బ్యుబోనిక్‌ ప్లేగు వ్యాధి ప్రబలింది. అదొక భయంకరమైన అంటువ్యాధి. ఆ వ్యాధి ఆమెకు కూడా సోకింది. కానీ అతికష్టం మీద బతికారు. అప్పుడే పూర్తిగా కోలుకోవడానికి యూరప్‌ వెళ్లవలసిందని వైద్యులు సూచించారు.

అలా ఆమె 1902లో ఇంగ్లండ్‌  చేరుకున్నారు. అనుకున్నట్టే అక్కడ భికాజీ కామా కోలుకున్నారు. ఆమె అక్కడ కాలు పెట్టే సమయానికి బ్రిటిష్‌ వ్యతిరేక తీవ్ర జాతీయవాదులకు లండన్‌  కేంద్రంగా ఉంది. లాలా హరదయాళ్, శ్యాంజీ కృష్ణ వర్మ, వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌ అక్కడే పనిచేసేవారు. వారితో ఆమెకు పరిచయం కలిగింది. తరువాత ఆమె స్వదేశానికి రావాలని ప్రయత్నించారు. భారతదేశంలో రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉంటానని లిఖిత పూర్వకంగా హామీ ఇస్తేనే అనుమతిస్తామని ఆంగ్లేయుల నుంచి సమాచారం అందింది.

అందుకు ఆమె నిరాకరించి లండన్, పారిస్‌ నగరాలలోనే ఉండిపోయారు. ఇంగ్లిష్‌ పాలనలో భారతీయులు పడుతున్న ఇక్కట్లు, దేశంలో నశించిన హక్కులు వంటి వాటి గురించి భికాజీ కామా ప్రపంచ దేశాలన్నీ తిరుగుతూ ప్రచారం చేశారు. సింగ్‌ రేవాభాయ్‌ రాణా, మంచేర్షా బుర్జోర్జీ గోద్రెజ్, మేడమ్‌ కామా కలసి పారిస్‌ ఇండియన్‌  సొసైటీ స్థాపించారు. వందేమాతరం’, ‘తల్వార్‌’ అనే పత్రికలను నడిపారు. ఏది చేసినా దేశ స్వాతంత్య్రమే ఆమె లక్ష్యం. ఇవన్నీ ఒక ఎత్తయితే, భారత జాతికి తొలిసారిగా ఒక ఐక్య పతాకాన్ని తయారు చేసిన ఘనత మేడమ్‌ కామాకే దక్కుతుంది.

ఆ పతాకాన్ని ఆమె 1907 ఆగస్టు 22 న జర్మనీలోని స్టట్‌గార్ట్‌లో ఎగురవేశారు. అనంతర కాలంలో.. నిరంతర ఉద్యమంతో భికాజీ ఆరోగ్యం దెబ్బ తింది. 1935లో ఆమెకు పక్షవాతం వచ్చింది. ఒకసారి గుండెపోటు వచ్చిది. అప్పుడు మళ్లీ భారతదేశం వెళ్లిపోవాలన్న కోరికను వ్యక్తం చేశారామె. ఇక ఆమెతో ఎలాంటి ప్రమాదం ఉండబోదన్న నమ్మకంతో ఆంగ్ల ప్రభుత్వం అనుమతించింది. స్వదేశానికి చేరుకున్న తొమ్మిది మాసాలకే ఆ విప్లవ మహిళ తుది శ్వాస విడిచారు. కొందరు పేర్కొన్నట్టు ఆమె ‘భారత విప్లవోద్యమ మాత’. నేడు కామా వర్ధంతి. 74 ఏళ్ల వయసులో 1936 ఆగస్టు 13న ఆమె కన్ను మూశారు. 

(చదవండి: జైహింద్‌ స్పెషల్‌: మీ డబ్బొద్దు.. మీరు కావాలి)

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top