అయోధ్యలో కొలువుదీరే శ్రీరాముని విగ్రహం ఇదే! | Sakshi
Sakshi News home page

Ayodhya Ram Mandir: అయోధ్యలో కొలువుదీరే శ్రీరాముని విగ్రహం ఇదే!

Published Tue, Jan 2 2024 8:45 AM

Ayodhya Ram Mandir One Statue Was Selected - Sakshi

అయోధ్యలోని నూతన రామాలయంలో జనవరి 22న కొలువుదీరనున్న రాముని విగ్రహం ఖరారయ్యింది. కర్ణాటకకు చెందిన శిల్పి అరుణ్ యోగిరాజ్ తీర్చిదిద్దిన విగ్రహాన్ని ఎంపిక చేశారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. 

కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారం ఎక్స్‌లో ఇలా రాశారు.. ‘రాముడు ఎక్కడ ఉంటాడో, అక్కడ హనుమంతుడు ఉంటాడు. అయోధ్యలో శ్రీరాముని ప్రతిష్ఠాపన కోసం విగ్రహాన్ని ఎంపిక చేశారు. మన దేశపు ప్రఖ్యాత శిల్పి అరుణ్ యోగిరాజ్ తయారు చేసిన రాముని విగ్రహాన్ని అయోధ్యలో ప్రతిష్ఠించనున్నారు. రాముడు, హనుమంతునికి మధ్యనున్న అవినాభావ సంబంధానికి ఇది మరొక ఉదాహరణ. హనుమంతుని జన్మభూమి అయిన కర్ణాటక నుంచే శ్రీరామునికి  సేవా కార్యం జరిగినదనడంలో సందేహం లేదు’ అని పేర్కొన్నారు.

అయోధ్య రామాలయ ట్రస్ట్ నేపాల్‌లోని గండకీ నదితో పాటు కర్ణాటక, రాజస్థాన్, ఒరిస్సా నుండి శ్రీరాముని విగ్రహ రూపకల్పనకు మొత్తం 12 నాణ్యమైన రాళ్లను సేకరించింది. ఈ రాళ్లన్నింటినీ పరీక్షించగా కేవలం రాజస్థాన్, కర్ణాటక రాళ్లే విగ్రహాల తయారీకి అనువుగా ఉన్నట్లు గుర్తించారు.

కర్ణాటకలో లభించిన శ్యామ శిల, రాజస్థాన్‌లోని మక్రానాకు చెందిన మార్బుల్ రాక్‌లను ఎంపిక చేశారు. మక్రానా రాయి ఎంతో విశిష్టమైనది. అలాగే కర్నాటకలోని శ్యామ శిల.. శిల్పాలు చెక్కేందుకు అనువుగా ఉంటుంది. ఈ రాళ్ళు నీటి నిరోధకతను కలిగి ఉంటాయి. సుదీర్ఘ జీవితకాలాన్ని కూడా కలిగి ఉంటాయి.

ప్రఖ్యాత శిల్పి యోగిరాజ్ శిల్పి కుమారుడు అరుణ్ యోగిరాజ్(37) ఎంబీఏ పూర్తిచేశారు. ఇతను యోగిరాజ్ కుటుంబంలో ఐదో తరం శిల్పి. అరుణ్ యోగిరాజ్ 2008లో ఉద్యోగం మానేసి, పూర్తిస్థాయి  శిల్పకారునిగా మారారు.

అయోధ్య రామ మందిర్ కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

అరుణ్ యోగిరాజ్.. మహారాజా జయచామరాజేంద్ర వడయార్‌తో సహా అనేక ప్రముఖుల విగ్రహాలను తయారు చేశారు. కేదార్‌నాథ్‌లో స్థాపించిన ఆదిశంకరాచార్య విగ్రహాన్ని రూపొందించారు. అలాగే మైసూరులో మహారాజా శ్రీకృష్ణరాజ వడయార్-IV, స్వామి రామకృష్ణ పరమహంస పాలరాతి విగ్రహం మొదలైనవి తీర్చిదిద్దారు. ఇండియా గేట్ దగ్గర కనిపించే నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం కూడా అరుణ్ యోగిరాజ్ రూపొందించినదే! 
 

Advertisement
 
Advertisement
 
Advertisement