లంచ్‌లోకి గొడ్డు కూర తెచ్చిన ప్రధానోపాధ్యాయురాలి అరెస్ట్‌

Assam Headmistress Bring Beef Arrested Under Judicial Custody - Sakshi

దిస్పూర్: తిండి విషయంలో ఎవరి అలవాట్లు వాళ్లవి. పని చేసే చోట నలుగురూ కలిసి భోజనం చేయడం సహజం. అలా లంచ్‌ చేస్తున్న టైంలో.. తాను ఇంటి నుంచి తెచ్చిన వంటకాన్ని నలుగురికి పంచాలనుకుంది ఓ ప్రధానోపాధ్యాయురాలు. అదే ఆమె చేసిన తప్పు అయ్యింది..కటకటాల వెనక్కి నెట్టింది. 

అస్సాం గోల్‌పరా జిల్లా లఖిపూర్‌లోని ముర్కాచుంగి మిడిల్‌ ఇంగ్లీష్‌ మీడియం ప్రధానోపాధ్యాయురాలు దలిమా నెస్సా(56).. గొడ్డుకూరను లంచ్‌ బాక్స్‌లో తీసుకెళ్లింది. అయితే తాను తెచ్చిన వంటకాన్ని తోటి ఉపాధ్యాయులకు పంచాలనుకుంది ఆమె. ఇది కొందరికి నచ్చలేదు. అభ్యంతరాలు వ్యక్తం చేశారు. మే 14న స్కూల్‌లో జరిగిన ఓ పంక్షన్‌ సందర్భంగా ఇది జరిగింది. 

బీఫ్‌ను పంచాలనుకోవడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ.. కొందరు టీచర్లు ఆమెపై స్కూల్‌ కమిటీకి ఫిర్యాదు చేశారు. అటుపై ఈ వ్యవహారం పోలీసులకు చేరడంతో ఆ ప్రధానోపాధ్యాయురాలిని అరెస్ట్‌ చేశారు. మంగళవారం ఆమెను అరెస్ట్‌ చేసి..ఆ మరుసటి రోజు కోర్టులో ప్రవేశపెట్టారు. దీంతో ఆమెకు జ్యూడిషియల్‌ కస్టడీ విధించారు. 

ఐపీసీ 153ఏ(విద్వేషాలు రగిల్చే ప్రయత్నం), 295ఏ (మత మనోభావాలు దెబ్బతీయడం) కింద.. ఆమెను అరెస్ట్‌ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. 

బీఫ్‌ తినొచ్చు, కానీ..

ఈశాన్య రాష్ట్రం, పైగా బీజేపీ పాలిత రాష్ట్రమైన అస్సాంలో గొడ్డు మాంసం క్రయవిక్రయాలు, తినడంపై ఎలాంటి అభ్యంతరాలు లేవు. కాకపోతే కిందటి ఏడాది ప్రభుత్వం ‘అస్సాం క్యాటల్‌ ప్రిజర్వేషన్‌ యాక్ట్‌’ తీసుకొచ్చింది. దీని ప్రకారం.. హిందువులు, జైనులు, గొడ్డు మాంసానికి దూరంగా ఉండే కమ్యూనిటీలు ఉన్న ఏరియాలకు, హిందూ ఆలయాలకు ఐదు కిలోమీటర్ల అవతల.. బీఫ్‌ సెంటర్లను నిర్వహించకోవచ్చు.

ఆవు అందరికీ అమ్మ. గోమాతను పూజించే గడ్డపై..  గొడ్డు మాంసం తినకపోవడమే ఉత్తమం. అదే సమయంలో తిండి అలవాట్లను ఎవరూ మార్చుకోవాల్సిన అవసరమూ లేదు: అస్సాం సీఎం హిమంత గతంలో చేసిన కామెంట్లు

చదవండి: జాతరలో బీఫ్‌, పంది బిర్యానీకి నో.. కలెక్టర్‌కు నోటీసులు

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top