Agnipath Scheme:..అయినా ముందుకే!

Agnipath Scheme: Golden opportunity for youth to join defence system - Sakshi

అతి త్వరలో నియామకాలు: రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌

ప్రక్రియకు ఇప్పటికే త్రివిధ దళాల శ్రీకారం

న్యూఢిల్లీ: ‘అగ్నిపథ్‌’పై ఓవైపు దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నా, ఈ పథకం కింద సైన్యంలో నియామకాలు అతి త్వరలో మొదలవుతాయని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ప్రకటించారు. ఇందుకోసం సన్నద్ధం కావాలని యువతకు పిలుపునిచ్చారు. ‘‘సైనిక దళాల్లో చేరి దేశ సేవ చేయాలని కోరుకునేవారికి కొత్త మోడల్‌ సువర్ణావకాశం. పైగా గరిష్ట వయోపరిమితిని ఈ ఏడాది 21 నుంచి 23 ఏళ్లకు పెంచడం వల్ల మరింత మంది సైన్యంలో చేరే వీలు కలిగింది’’ అంటూ ఆయన శుక్రవారం ట్వీట్‌ చేశారు. రెండేళ్లుగా సైన్యంలో నియామకాలు చేపట్టకపోవడం వల్ల చాలామంది సైన్యంలో చేరలేకపోయారని, వారి భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, ప్రధా ని మోదీ సూచన మేరకు వయోపరిమితి పెంచామని చెప్పారు.

స్కిల్డ్‌ వర్క్‌ఫోర్స్‌ కోసమే
దేశ రక్షణ సన్నద్ధతతో పాటు ఆర్థికాభివృద్ధికి అవసరమైన నిపుణులైన యువతను తయారు చేయడానికి అగ్నిపథ్‌ తోడ్పడుతుందని కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ పేర్కొంది. ‘‘ఈ దిశగా సైనిక దళాల భాగస్వామ్యంతో స్కిల్‌ ఇండియా, స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఎంట్రప్రెన్యూర్‌షిప్‌ యువతకు శిక్షణ ఇస్తాయి. నేషనల్‌ స్కిల్స్‌ క్వాలిఫికేషన్‌ ఫ్రేమ్‌వర్క్‌తో సమానమైన సిలబస్‌ను బోధిస్తారు. దీంతో వారిలో నైపుణ్యాలు పెరుగుతాయి. సర్వీసులో ఉండగానే స్కిల్‌ ఇండియా సర్టిఫికెట్లు ఇస్తారు. తద్వారా వ్యాపార రంగంలో, ఉద్యోగాల్లో ఎన్నో అవకాశాలు దక్కుతాయి’’ అని చెప్పింది.

వాయుసేనలో 24 నుంచే ప్రక్రియ
అగ్నిపథ్‌ నియామకాలకు త్వరలో శ్రీకారం చుడతామని త్రివిధ దళాలు ప్రకటించాయి. 2023 జూన్‌ నాటికి తొలి బ్యాచ్‌లను ఆపరేషనల్, నాన్‌–ఆపరేషన్‌ విభాగాల్లో చేర్చుకొ నే దిశగా సన్నద్ధమవుతున్నట్లు సీనియర్‌ మిలటరీ అధికారులు చెప్పారు. వైమానిక దళంలో అగ్నిపథ్‌ నియామక ప్రక్రియ ఈ నెల 24 నుంచే మొదలవుతుందని వాయుసేన చీఫ్‌ ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ వీఆర్‌ చౌదరి చెప్పారు. ఆర్మీలోనూ అతి త్వరలో నియామక షెడ్యూల్‌ ప్రకటిస్తామని ఆర్మీ చీఫ్‌ జనరల్‌ మనోజ్‌ పాండే చెప్పారు. ఈ ఏడాది డిసెంబర్‌ నుంచే శిక్షణ ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఉన్నత సైనికాధికారులు తెలిపారు. నేవీలోనూ అగ్నిపథ్‌ నియామక ప్రక్రియ అతి త్వరలోనే మొదలవనుంది.

మోదీ పథకాలన్నీ అట్టర్‌ ఫ్లాపే
ప్రధాని మోదీ తన మిత్రుల మాటే వేదవాక్కు. ఇంకెవరి మాటా వినరు. అలా మిత్రుల మాట ప్రకారం జీఎస్టీ తెస్తే వ్యాపారులు తిరస్కరించారు. సాగు చట్టాలు తెస్తే రైతులు తిప్పికొట్టారు. నోట్ల రద్దును సామాన్యులు తిరస్కరించారు. ఇప్పుడు అగ్నిపథ్‌నూ యువత ముక్త కంఠంతో వద్దంటోంది. అయినా మోదీకి దేశ ప్రజల గోడు పట్టదు! అగ్నిపథ్‌ను తక్షణం వెనక్కు తీసుకోవాలి.
– కాంగ్రెస్‌ నేతలు రాహుల్, ప్రియాంక
 
సెక్యూరిటీ కంపెనీల తరహా పథకమిది
ప్రైవేట్‌ కంపెనీలకు సెక్యూరిటీ గార్డులను తయారు చేసే తరహా పథకాన్ని మోదీ తీసుకొచ్చారు. సైన్యాన్ని సెక్యూరిటీ గార్డుల ట్రైనింగ్‌ సెంటర్‌గా మారుస్తున్నారు. యువత ఆగ్రహ జ్వాలల్లో దేశం మండిపోకముందే అగ్నిపథ్‌ను కేంద్రం తక్షణం వెనక్కు తీసుకోవాలి. ఇందుకోసం మేమూ శనివారం నిరసన కార్యక్రమాలు చేపడతాం.     
– ఆప్‌ నేత సంజయ్‌సింగ్‌

అనవసర రాద్ధాంతం
అగ్నిపథ్‌ చక్కని పథకం. ప్రతిపక్షాలు అనవసరంగా ప్రజలను రెచ్చగొట్టి అగ్నిపథ్‌ వివాదం సృష్టిస్తున్నాయి.
మొదలవకముందే ఏమిటీ రగడ?
– కేంద్ర మంత్రి జనరల్‌ వీకే సింగ్‌  

తక్షణం సమీక్షించాలి
దేశవ్యాప్త నిరసనల నేపథ్యంలో పథకాన్ని మోదీ ప్రభుత్వం తక్షణం సమీక్షించాలి. యువత ఆగ్రహావేశాలను చల్లార్చాలి.
– జేడీ(యూ) నేత, బిహార్‌ సీఎం నితీశ్‌కుమార్‌

యువతకు గొప్ప భవిత
దేశ యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రధాని మోదీ తెచ్చని మంచి పథకమిది. వయో పరిమితి పెంపు వారికి సువర్ణావకాశం.
 – కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top