ప్రయాణ నిషేధం మినహాయింపు.. భారత్‌కు తాలిబాన్ మంత్రి | Afghan Taliban Minister Begins 1st India Visit | Sakshi
Sakshi News home page

ప్రయాణ నిషేధం మినహాయింపు.. భారత్‌కు తాలిబాన్ మంత్రి

Oct 9 2025 3:04 PM | Updated on Oct 9 2025 3:14 PM

Afghan Taliban Minister Begins 1st India Visit

న్యూఢిల్లీ: ఆఫ్ఘనిస్థాన్ విదేశాంగ శాఖ మంత్రి ఆమిర్ ఖాన్ ముత్తఖీ గురువారం భారత్‌ చేరుకున్నారు. ఆమిర్ ఖాన్ అధికారికంగా భారత్‌లో జరుపుతున్న తొలి పర్యటన ఇది. ఇరు దేశాల ద్వైపాక్షిక సంబంధాలు, పలు ప్రాంతీయ అంశాలపై చర్చించేందుకు  వారం రోజుల పాటు ఆయన భారత్‌లో పర్యటించనున్నారు.

దేశ రాజధాని ఢిల్లీకి చేరుకున్న ముత్తఖీని భారత విదేశాంగ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఘనంగా స్వాగతించింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ వేదికగా ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. ఇరు దేశాల  దౌత్య సంబంధాలు, ప్రాంతీయ సమస్యలపై చర్చలు జరగనున్నాయని తెలిపింది. ఈ పర్యటనలో ఆఫ్ఘనిస్థాన్ విదేశాంగ శాఖ మంత్రి ఆమిర్ ఖాన్ ముత్తఖీ భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్‌ను కలుసుకోనున్నారు.

ఈ పర్యటన  ఇంతకుముందే జరగాల్సి ఉన్నప్పటికీ, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యూఎన్‌ఎస్‌సీ) విధించిన ప్రయాణ నిషేధం నుంచి ఆమిర్ ఖాన్ ముత్తఖీకి మినహాయింపు లభించకపోవడంతో వాయిదా పడింది. ఇటీవలే యూఎన్ఎస్‌సీ కమిటీ ముత్తఖీ ప్రయాణానికి ప్రత్యేక మినహాయింపు మంజూరు చేసింది. దీంతో అతని పర్యటనకు మార్గం సుగమమైందని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్‌ధీర్ జైస్వాల్ మీడియాకు తెలిపారు.

ఇరు దేశాల భేటీలలో భారత్ అందిస్తున్న మానవతా సాయం, ఆఫ్ఘనిస్థాన్‌లో చేపడుతున్న మౌలిక సదుపాయాల ప్రాజెక్టులపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఆమధ్య ఆఫ్ఘనిస్థాన్‌లో భూకంపం సంభవించినప్పుడు భారత్ వెంటనే స్పందించి సహాయ సామగ్రిని పంపించిందని జైస్వాల్ తెలిపారు.  ఇటీవలి కాలంలో రెండు దేశాల మధ్య దౌత్యపరమైన చర్చలు పెరుగుతున్న నేపథ్యంలో ముత్తఖీ పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. గత జనవరిలో భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ ఆఫ్ఘనిస్థాన్ విదేశాంగ శాఖ మంత్రి ఆమిర్ ఖాన్ ముత్తఖీతో సమావేశమయ్యారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement