రెస్క్యూ ఆపరేషన్ దృశ్యం
హరియాణాలోని అంబాలాలో ఘటన
అంబాలా: తండ్రితో కలిసి తాతకు భోజనం ఇచ్చేందుకు సరదాగా సొంత పొలానికి వచ్చిన నాలుగేళ్ల బాలుడు అక్కడ తెరచి ఉన్న 220 అడుగుల లోతైన బోరుబావిలో పడటంతో గ్రామంలో ఒక్కసారిగా ఉద్వేగవాతావరణం నెలకొంది. హరియాణాలోని అంబాలా జిల్లాలోని ధనియోరా గ్రామంలో మంగళవారం ఉదయం ఆరున్నర గంటలకు ఈ ఘటన జరిగింది.
విషయం తెల్సి జాతీయ విపత్తు నిర్వహణ, రాష్ట్ర విపత్తు నిర్వహణ బలగాలు, సైనికులు హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని బాలుడిని సురక్షితంగా పైకి లాగేందుకు ప్రయత్నిస్తున్నారు. రెస్క్యూ కార్యక్రమం కొనసాగుతోందని డెప్యూటీ కమిషనర్ అజయ్ సింగ్ తెలిపారు. 9 అంగుళాల వ్యాసమున్న బోరుబావిలో ఇరుక్కుపోయిన బాలుడు నిర్వాయిర్ సింగ్‌ను కాపాడాలంటూ తండ్రి మన్జీత్ సింగ్, తాతా కర్నూల్ కన్నీటిపర్యంతమయ్యారు. ప్రత్యేక ఉపకరణాలతో బాలుడిని పైకి లాగేందుకు ప్రయత్నిస్తున్నామని, ఆర్మీ సాయం తీసుకుంటున్నామని బాలుడి తండ్రికి డెప్యూటీ కమిషనర్ భరోసా ఇచ్చారు.


