పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తాం..
ఉదండాపూర్ రిజర్వాయర్ వరకు వచ్చే ఏడాదిలోగా పాలమూరు– రంగారెడ్డి ప్రాజెక్ట్‌ను పూర్తిచేస్తామని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. ఉదండాపూర్ నుంచి లక్ష్మీదేవునిపల్లి వరకు భూ సేకరణను మొదలుపెడతామన్నారు. ఉమ్మడి జిల్లాలో అన్ని ప్రాజెక్ట్‌లకు సంబంధించి ఆర్‌అండ్‌ఆర్, అటవీ శాఖ వంటి వాటిని పరిష్కరిస్తామన్నారు. ఉదండాపూర్ నిర్వాసితులకు నెలరోజుల్లో రూ.630 కోట్లు ఆర్‌అండ్‌ఆర్ పరిహారం ఇవ్వడం అసాధారణ విషయమన్నారు. ఉమ్మడి జిల్లాలో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ వంటి ప్రాజెక్టులను పూర్తి చేస్తామన్నారు.
20 లక్షల పైచిలుకు ఎకరాలు..
ఉమ్మడి జిల్లాలో 20 లక్షల ఎకరాలకు సాగు నీరు అందించాలన్న సదుద్దేశంతో సీఎం రేవంత్‌రెడ్డి రెండు రోజులపాటు ప్రాజెక్ట్‌ల బాట పట్టారని మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. వలసలు, ఆత్మహత్యల జిల్లాగా ఉన్న పాలమూరును చూపించే తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నామని, పదేళ్లపాటు అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్ పాలమూరును పట్టించుకోలేదని విమర్శించారు.
మాది చేతల ప్రభుత్వం..
ఉదండాపూర్ నిర్వాసితులకు పరిహారం అందించిన ఘనత తమదేనని మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. గత బీఆర్‌ఎస్ నరకయాతన పాలన చూశామని, ఆర్థిక పరిస్థితులు బాగా లేకున్నా సీఎం రేవంత్‌రెడ్డి నిర్వాసితుల ఖాతాల్లో పరిహారం జమచేసి ఇక్కడికి వచ్చారని పేర్కొన్నారు. తమది చేతల ప్రభుత్వం అని అభిప్రాయపడ్డారు.
సీఎంకు కృతజ్ఞతలు
ఉమ్మడి జిల్లాలో ప్రాజెక్టులను పూర్తి చేయాలన్న దృఢసంకల్పంతో పర్యటిస్తున్న ఇలాంటి సీఎంను తాను ఎక్కడా చూడలేదని ఎమ్మెల్యే అనిరుధ్‌రెడ్డి అన్నారు. ఉదండాపూర్ నిర్వాసితుల సమస్యలను పరిష్కరించిన సీఎం రేవంత్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. నాటి సీఎం కేసీఆర్ నిర్వాసితులను జైలుకు పంపితే.. తమ సీఎం నిర్వాసితులను కలిసేందుకు వచ్చారని కొనియాడారు. వచ్చేనెలలో సీఎం రేవంత్‌రెడ్డి మిడ్జిల్ పర్యటనకు రావాలని ఆహ్వానించారు. రంగనాయకస్వామి గుట్టపై వంద అడుగుల ఆంజనేయస్వామి విగ్రహం పెట్టాలన్నది తన కోరిక అని, అదేవిధంగా జడ్చర్లకు బైపాస్, తదితర సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని విన్నవించారు.
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్/సాక్షి, నాగర్ కర్నూల్
‘ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ప్రతిష్టాత్మక పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్‌కు సంబంధించి త్వరలో శుభవార్త చెబుతాం. కృష్ణానది ఆధారంగా నిర్మాణంలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌కు 90 టీఎంసీలు, డిండికి 25 టీఎంసీలతో కేంద్రం నుంచి ఎన్‌ఓసీ తీసుకొస్తాం. ఈ మేరకు పక్క రాష్ట్రంతో చర్చలు జరుగుతున్నాయి. డిసెంబర్‌లోగా ఎన్‌ఓసీ తీసుకొచ్చే బాధ్యత నాది.’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో పలు ఎత్తిపోతల పథకం పనులను పరుగులు పెట్టించాలనే లక్ష్యంతో రెండు రోజులుగా చేపట్టిన ప్రాజెక్ట్‌ల సందర్శన ముగిసింది. రెండోరోజు శుక్రవారం ఆయన మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరితో నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం సోమ శిలలోని మృగవాణి రిసార్ట్ నుంచి బయలుదేరి వరుసగా పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న నార్లాపూర్, ఏదుల, వట్టెం, కరివెన, ఉదండాపూర్‌లోని తదతర రిజర్వాయర్లు, పంప్‌హౌస్‌ల పనులను పరిశీలించారు. భూత్పూర్ మండలంలోని కర్వెన రిజర్వాయర్ వద్ద నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆ తర్వాత జడ్చర్ల మండలం గంగాపూర్ శివారులో నిర్వహించిన ప్రజాపాలన–ప్రగతిబాట బహిరంగసభలో మాట్లాడారు. రెండున్నరేళ్లలో కృష్ణాపై కొత్త రిజర్వాయర్, బ్రిడ్జి కం బ్యారేజ్ నిర్మాణం చేపట్టడంతో పాటు ఏడాదిలోగా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్ పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.
జిల్లా ప్రాజెక్ట్‌లకు రూ.8వేల కోట్లు ఖర్చు చేశాం
గడిచిన రెండున్నరేళ్లలో రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్ట్‌ల కోసం రూ.22 వేల కోట్లు ఖర్చుచేస్తే అందులో రూ.8వేల కోట్లు పాలమూరు జిల్లాలోని ప్రాజెక్ట్‌లకే ఖర్చు చేశామని రేవంత్‌రెడ్డి వెల్లడించారు. మట్టికి పోయినా మనోడే ఉండాలె, ఎట్టికిపోయినా ఇంటోడే కావాలె. 60 ఏళ్ల గోస, వలసల బతుకులు మారాలి. ఇక్కడి బిడ్డనై ఉండి ఈ ప్రాంతానికి అన్యాయం చేస్తానా? అని ప్రశ్నించారు. మీ పాలమూరు బిడ్డగా రెండు రోజులుగా జిల్లా రైతుల కోసం సాగునీరు ప్రాజెక్ట్‌లను పరిశీలించానని.. సమస్యలు ఏవిధంగా పరిష్కరించాలి.. ప్రాజెక్టులు ఏవిధంగా పూర్తి చేసుకోవాలో సూచనలు ఇవ్వడం జరిగిందని వివరించారు. ఆరు నెలలు సమయం ఇవ్వండి.. అన్ని సమస్యలకు పరిష్కారం చూపుతా. రెండేళ్లలో పాలమూరు ప్రాజెక్టులను పూర్తిచేసి చూపిస్తానని పునరుద్ఘాటించారు.
ఉమ్మడి జిల్లాలో 26 లక్షల ఎకరాలకు నీరు..
ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్ట్‌లను రెండున్నరేళ్లలో పూర్తిచేసి తీరుతామని రేవంత్ అన్నారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్ట్ పనులు పూర్తిచేసి ఏడాదిలోగా ఉదండాపూర్ వరకు నీరందిస్తామని చెప్పారు. తర్వాత ప్రణాళికాబద్ధంగా డిస్ట్రిబ్యూటరీ కెనాళ్ల నిర్మాణం చేపడతామన్నారు. ఇంకా నాలుగు వేల ఎకరాల భూసేకరణ పెండింగ్‌లో ఉందని, రూపాయి ఎక్కువ ఇచ్చి అయినా సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. దీన్నే ప్రాధాన్యాంశంగా తీసుకుంటామని.. ఉమ్మడి జిల్లాలో ప్రాజెక్ట్ పనుల కోసం గ్రీన్ చానల్ ద్వారా నిధులు మంజూరుచేయిస్తానని హామీ ఇచ్చారు. తాను సీఎంగా ఉన్నప్పుడే ఈ ప్రాజెక్టులు పూర్తవుతాయన్నారు. ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ చేసుకోలేమని, చరిత్ర కూడా మనల్ని క్షమించదన్నారు. ఉమ్మడి జిల్లాలో పెండింగ్‌లో ఉన్న అన్ని ప్రాజెక్ట్‌లను పూర్తిచేసి మొత్తం 26 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. ‘జిల్లాలోని బీఆర్‌ఎస్ నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నా.. కేసీఆర్‌కు ఊడిగం చేయడం ఆపండి. భూసేకరణ పనులు, ప్రాజెక్ట్ పనులు ఆపాలని, కాళ్లలో కట్టెలు పెట్టాలని చూడకండి. రాజకీయాలు ఏమైనా ఉంటే ఎన్నికలప్పుడు చూద్దాం. ఈ రెండేళ్లు మన జిల్లాను అభివృద్ధి చేసుకుందాం’ అని పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు జి.చిన్నారె డ్డి, కలెక్టర్ ఖుష్బూ గుప్తా, ప్రభుత్వ విప్, యెన్నం శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి, రాష్ట్ర మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్, ఎమ్మెల్యేలు వీర్లపల్లి శంకర్, కూచుకుళ్ల రాజేష్‌రెడ్డి, చిక్కుడు వంశీకృష్ణ, తూడి మేఘారెడ్డి, ఎమ్మెల్సీలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్లు, ఇతర ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు. సభ అనంతరం రేవంత్‌రెడ్డి రోడ్డు మార్గాన హైదరాబాద్‌కు వెళ్లారు.
జడ్చర్లలో బహిరంగసభకు హాజరైన మహిళలు
పీఆర్‌ఎల్‌ఐకి 90 టీఎంసీలతో ఎన్‌ఓసీ తీసుకొస్తాం
డిసెంబర్‌లోపు దీన్ని నెరవేర్చే బాధ్యత నాదే..
కృష్ణాపై మరో కొత్త రిజర్వాయర్, బ్రిడ్జి కం బ్యారేజ్ నిర్మిస్తాం
నాకు జడ్చర్లకు వస్తే గుండె వేగం పెరుగుతుంది..
మిడ్జిల్ జెడ్పీటీసీగా నాటిన మొక్క నేడు వృక్షమైంది..
నేనుండగా జిల్లాకు అన్యాయం జరుగనిస్తనా?
జడ్చర్ల బహిరంగసభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
ముగిసిన ప్రాజెక్ట్‌ల సందర్శన
ఇక్కడికి వస్తే నా గుండె వేగం పెరుగుతుంది..
‘జడ్చర్ల ప్రాంతానికి వస్తే గుండె వేగం పెరుగుతుందని రేవంత్‌రెడ్డి భావోద్వేగంతో మాట్లాడారు. నల్లమల అడవి, మారుమూల గ్రామంలో పుట్టిన నన్ను సరిగ్గా 20 ఏళ్ల కిందట 2006 జూలై 4న మిడ్జిల్ జెడ్పీటీసీగా మీ భుజాలపై నిలబెట్టుకున్నారని... ఆనాడు మీరు నాటిన చిన్న మొక్కే ఎమ్మెల్సీగా, ఎమ్మెల్యేగా, ఎంపీగా నేడు ముఖ్యమంత్రిగా ఎదిగి వృక్షమై మీ ముందు నిలబడ్డడని సంతోషం వ్యక్తం చేశారు. తాను ఉండగా ఈ జిల్లాకు నష్టం జరుగనిస్తనా అని ప్రశ్నించారు. జైళ్లు కట్టాలని గత పాలకులు భావిస్తే.. స్కూళ్లు కట్టాలని మనం అనుకున్నామని.. అందుకే ట్రిపుల్ ఐటీ, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మిస్తున్నామన్నారు. ఏం చదవాలన్నా పాలమూరు జిల్లాకు వచ్చేలా కొడంగల్‌లో ఎడ్యుకేషన్ హబ్ నిర్మిస్తున్నామని చెప్పారు. చదువు తోనే కష్టాలు పోతాయని.. బతుకులు బాగు పడతాయని.. పిల్లలను చదివించాలని ఆయన తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. ప్రతిపక్ష సభ్యు లు కొందరు పాదయాత్రలు చేస్తామంటున్నారని.. వారు కాశీదాక పొర్లు దండాలు పెట్టినా వారు చేసిన పాపాలు తొలిగిపోవని, ప్రజలు క్షమించరని చెప్పారు. పాలమూరులో ఊరు లేకపోయినా, పార్లమెంటులో నోరు లేకపోయినా ఇక్కడికి రాజకీయంగా వల స వచ్చిన కేసీఆర్‌ను ఇక్కడి ప్రజలు గుండెల్లో పెట్టుకొని ఎంపీగా గెలిపించార ని గుర్తు చేశారు. తెలంగాణకు రెండు సార్లు ముఖ్యమంత్రిని చేస్తే.. పదేళ్లలో పాలమూరు జిల్లాలోని ఏ ఒక్క ప్రాజెక్ట్ పూర్తి చేయలేదని విమర్శించారు.


