● కార్యకర్తలు పార్టీ కోసం కష్టపడాలి
● పాలమూరు ఎంపీ డీకే అరుణ
నారాయణపేట రూరల్: గాలి మోటార్లలో తిరుగుతూ గాలి మాటలు చెబుతున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాబోవు ఎన్నికల్లో అదే గాలికి కొట్టుకుపోతారని మహబూబ్‌నగర్ ఎంపీ, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ విమర్శించారు. జిల్లాస్థాయిలో రెండ్రోజులుగా కొనసాగుతున్న దీన్‌దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ తరగతుల ముగింపు కార్యక్రమం శుక్రవారం జరగగా.. ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. తెలంగాణలో అన్ని వర్గాల ప్రజలు బీజేపీనీ కోరుకుంటున్నారని.. రాబోవు ఎన్నికల్లో అధికారంలోకి రావడాన్ని ఎవరూ అడ్డుకోలేరని జోస్యం చెప్పారు. రాష్ట్రంలో ఇచ్చిన హామీలు నెరవేర్చని కాంగ్రెస్ వైఫల్యాలపై పోరాటాలు, నిరసన దీక్షలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. శిక్షణలో నేర్చుకున్నది ఆచరణలో పెట్టాలని, మోదీ రూపొందించిన వికసిత్ భారత్ లక్ష్యంతో ముందుకు సాగాలన్నారు. పశ్చిమబెంగాల్ వంటి రాష్ట్రంలోనే బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చామని.. తెలంగాణలో కొద్దిగా కష్టపడితే తప్పకుండా రాజ్యాధికారం దక్కుతుందని, విభేదాలు వీడి బూత్‌స్థాయి నుంచి రాష్ట్ర నాయకుడి వరకు సమష్టిగా కృషి చేయాలని కోరారు. ప్రజల్లో పార్టీపై ఆత్మవిశ్వాసాన్ని కలిగిస్తే.. వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరూ రాజకీయంగా ఎదగడానికి ఆస్కారం ఉంటుందన్నారు. ఈ ప్రాంతంలో మొదటినుంచి బీజేపీ బలంగా ఉన్నా.. ఎమ్మెల్యేను గెలిపించుకోలేకపోతున్నాని, ప్రతి ఒక్కరూ ఆత్మవిమర్శ చేసుకొని సరిదిద్దుకునేందుకు కృషి చేయాలని వివరించారు. మోదీ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు.
ముఖ్యమంత్రి పర్యటనతో ఒరిగిందేమీ లేదు..
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రెండ్రోజుల పాటు ఉమ్మడి పాలమూరు జిల్లాలో పర్యటించి ఏ ఒక్క హామీని నెరవేర్చలేదని డీకే అరుణ విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలేవి అమలు కాలేదని.. మహిళలు, నిరుద్యోగులు, రైతులు, యువత పూర్తిగా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఉన్నారని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో జరుగుతున్న అక్రమాలను వెలికితీయాలని, గ్రామస్థాయిలో సమస్యలు తెలుసుకొని అక్కడే ధర్నాలు చేపట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం దిగివచ్చే వరకు పోరాటాలు చేసి ప్రజలకు న్యాయం చేద్దామన్నారు. అనంతరం సింగారం క్రాస్ రోడ్ దగ్గర మొక్కలు నాటి నీరు పోశారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రతి ఒక్కరూ తమ తల్లి పేరున మొక్క నాటాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు కొండా సత్యాయాదవ్, రాష్ట్ర నాయకులు నాగూరావు నామాజీ, రతంగ్‌పాండురెడ్డి, పి.శ్రీనివాసులు, తిరుపతిరెడ్డి, లక్ష్మి, కొండయ్య, బలరాంరెడ్డి, రఘురామయ్యగౌడ్, లక్ష్మీకాంత్రెడ్డి, కంచె శ్రీనివాస్, జ్యోతి సాయిబన్న, కిరణ్, శ్వేత, మంజుల, కౌన్సిలర్లు, సర్పంచులు పాల్గొన్నారు.


