పర్యావరణ పరిరక్షణ.. అందరి బాధ్యత | - | Sakshi
Sakshi News home page

పర్యావరణ పరిరక్షణ.. అందరి బాధ్యత

Jun 6 2026 1:47 AM | Updated on Jun 6 2026 1:47 AM

నారాయణపేట: పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి చట్టబద్ధమైన బాధ్యతని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బోయ శ్రీనివాసులు స్పష్టం చేశారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు శుక్రవారం జిల్లా కోర్టు ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. అభివృద్ధి పేరుతో ప్రకృతికి తీవ్ర నష్టం జరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. విచక్షణారహితంగా చెట్లను నరికివేయడం, ప్లాస్టిక్‌ వినియోగం పెరగడం, పరిశ్రమల నుంచి వెలువడే కాలుష్యం కారణంగా భూమి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని పేర్కొన్నారు. దీని ఫలితంగా కరువులు, వరదలు, వాతావరణ అసమతుల్యత వంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని, ప్లాస్టిక్‌ వినియోగాన్ని తగ్గించాలని పిలుపునిచ్చారు. కోర్టు ఆవరణలో పూలు, పండ్ల మొక్కలు నాటారు. అనంతరం సీనియర్‌ సివిల్‌ న్యాయమూర్తి వింధ్యానాయక్‌, ప్రిన్సిపల్‌ జూనియర్‌ సివిల్‌ న్యాయమూర్తి సాయి మనోజ్‌, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, పోలీసు అధికారులతో కలిసి పర్యావరణ పరిరక్షణ ప్రతిజ్ఞ చేశారు. బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు దామోదర్‌గౌడ్‌, న్యాయాధికారి మురళీధర్‌, ఫారెస్ట్‌ రేంజ్‌ అధికారి కమలోద్దీన్‌, పుర కమిషనర్‌ శంకర్‌, చీఫ్‌ లీగల్‌ ఎయిడ్‌ డిఫెన్స్‌ కౌన్సిల్‌ లక్ష్మీపతిగౌడ్‌, సీనియర్‌ న్యాయవాదులు మొక్కలు నాటారు.

20న జాతీయ

లోక్‌ అదాలత్‌ : ఎస్పీ

నారాయణపేట: జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో నారాయణపేట, కోస్గి, మక్తల్‌ కోర్టుల పరిధిలో 20వ తేదీన జాతీయ లోక్‌ అదాలత్‌ నిర్వహిస్తారని.. రాజీ పడదగిన కేసులను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోవాలని ఎస్పీ డా. వినీత్‌ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. క్రిమినల్‌ కంపౌండబుల్‌, సివిల్‌, ఆస్తి విభజన, కుటుంబ పోషణ, వైవాహిక, రోడ్డు ప్రమాద పరిహార కేసులు, చిన్నపాటి దొంగతనాలు, డ్రంకెన్‌ డ్రైవ్‌, బ్యాంకు రికవరీ, టెలిఫోన్‌ బకాయిలు, విద్యుత్‌ చౌర్యం, చెక్‌ బౌన్స్‌ తదితర రాజీ పడదగిన కేసులు పరిష్కరించుకోవచ్చని పేర్కొన్నారు. కక్షలు పెంచుకొని కోర్టుల చుట్టూ తిరుగుతూ సమయం, ధనం వృథా చేసుకోవద్దని సూచించారు. న్యాయస్థానం కల్పించిన ఈ అవకాశాన్ని క్షక్షిదారులు వినియోగించుకుని తమ వివాదాలకు శాశ్వత పరిష్కారం పొందాలని కోరారు. పోలీసు అధికారులు, కోర్టు విధులు నిర్వహించే కానిస్టేబుళ్లు, పోలీసు సిబ్బంది రాజీ పడదగిన కేసులను గుర్తించి ఇరువర్గాల వారిని పిలిపించి కౌన్సిలింగ్‌ ఇవ్వాలని ఆదేశించారు.

Advertisement
 
Advertisement
Advertisement