నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు | - | Sakshi
Sakshi News home page

నకిలీ విత్తనాలు విక్రయిస్తే చర్యలు

Jun 6 2026 1:47 AM | Updated on Jun 6 2026 1:47 AM

దామరగిద్ద: రైతులకు నకిలీ విత్తనాలు, ఎరువులు విక్రయిస్తే చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయ అధికారి సక్రియానాయక్‌ హెచ్చరించారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఆగ్రోస్‌, హాకా రైతు సేవాకేంద్రాలు, ఇతర ఫర్టిలైజర్‌ దుకాణాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేసి విత్తనాలు, ఎరువుల నిల్వలను పరిశీలించారు. ఎరువుల నిల్వలను విధిగా ఈ–పాస్‌ యంత్రంలో నమోదు చేసి విక్రయించాలన్నారు. లైసెన్స్‌ కలిగిన డీలర్‌ వద్దనే ఎరువులు, విత్తనాలు కొనుగోలు చేయాలని రైతులకు సూచించారు. విత్తనాలు కొనే మందు కంపెనీ లేబుల్‌ పరిశీలించాలని, విధిగా రసీదు తీసుకోవాలన్నారు. వానాకాలం సాగుకు అవసరమైన, నాణ్యమైన విత్తనాలను అందుబాటులో ఉంచాలని డీలర్లను ఆదేశించారు. మండల వ్యవసాయ అధికారి బాలాజీ ప్రసాద్‌ ఉన్నారు.

చిరుధాన్యాల సాగు పెరగాలి

కోస్గి రూరల్‌: రైతులు తమ పొలాల్లో మట్టి నమూనాలు సేకరించి నేల ఆరోగ్యాన్ని పరీక్షించి చిరుధాన్యాల సాగు విస్తీర్ణాన్ని పెంచాలని జిల్లా వ్యవసాయ అధికారి సక్రియానాయక్‌, కొడంగల్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి తిరుపతిరెడ్డి కోరారు. శుక్రవారం మండలంలోని ముక్తిపాడు, గుండుమాల్‌ రైతువేదికల్లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఖేతి బచావో అభియాన్‌లో భాగంగా ఎస్సీ రైతులకు జొన్న విత్తనాలు ఉచితంగా పంపిణీ చేశారు. తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం పాలమూరు శాస్త్రవేత్త అర్చన, భారతీయ చిరుధాన్యాల పరిశోధన సంస్థ శాస్త్రవేత్తలు వెంకటేశ్వర్లు, శ్రీవిద్య, మాలతి పచ్చిరొట్ట ఎరువుల వినియోగం, ఎరువుల యాజమాన్యం, ప్రకృతి వ్యవసాయం, నేల ఆరోగ్య పరిరక్షణ, శాసీ్త్రయ సాగు పద్ధతులు, విత్తనశుద్ధి, పురుగు, తెగుళ్ల నివారణ చర్యలపై రైతులకు అవగాహన కల్పించారు. అనంతరం కోస్గి ప్రెస్‌క్లబ్‌లో పలువురు రైతులకు జొన్న విత్తనాలు పంపిణీ చేశారు. ఏడీఏ రామకృష్ణ, వ్యవసాయ అధికారులు రేష్మారెడ్డి, రమేష్‌, ఏఈఓలు, పలువురు రైతులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement