చిట్టెం రామ్మోహన్‌రెడ్డి హౌస్‌ అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

చిట్టెం రామ్మోహన్‌రెడ్డి హౌస్‌ అరెస్ట్‌

Jun 5 2026 4:47 AM | Updated on Jun 5 2026 4:47 AM

నారాయణపేట/మక్తల్‌: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మక్తల్‌ పర్యటన నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డిని గురువారం పోలీసులు ముందస్తుగా హౌస్‌ అరెస్ట్‌ చేశారు. ఆయన ఇంటి చుట్టూ పోలీసులు మొహరించి బయటకు రాకుండా నిర్బంధించారు. మాజీ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ నర్సింహగౌడ్‌, బీఆర్‌ఎస్‌పార్టీ పట్టణ అధ్యక్షుడు చిన్న హన్మంతు, ఈశ్వర్‌తో పాటు పలువురు పార్టీ నాయకులను సైతం గృహ నిర్బంధం చేశారు. మక్తల్‌–పేట–కొడంగల్‌ ఎత్తిపోతల పథకంలో పైప్‌లైన్‌ ద్వారా కాకుండా గ్రావిటీ కెనాల్‌ ద్వారా నీటిని తరలించాలని డిమాండ్‌ చేస్తూ సీఎం పర్యటనను అడ్డుకునేందుకు బీఆర్‌ఎస్‌ శ్రేణులు సిద్ధమవుతున్నాయన్న సమాచారంతో పోలీసులు ముందస్తు చర్యలకు దిగినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా చిట్టెం మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో సమస్యలపై ఆందోళన వ్యక్తం చేయడం ప్రతి ఒక్కరి హక్కు అన్నారు. ముందస్తు హౌస్‌ అరెస్ట్‌లు, గృహ నిర్బంధాలతో ప్రజా సమస్యలను అణచివేయలేరని పేర్కొన్నారు. ఈ ప్రాంతానికి గ్రావిటీ కెనాల్‌ ద్వారా నీటిని తరలిస్తే వేలాది ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉందని.. పైప్‌లైన్‌తో ఆశించిన ప్రయోజనం చేకూరదని తెలిపారు. ఎత్తిపోతల పథకం ద్వారా ఊట్కూర్‌ తదితర ప్రాంతాలకు పరిమిత స్థాయిలో మాత్రమే సాగునీరు అందుతుందని, రాజకీయ కక్ష సాధింపుతో ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోందని ఆరోపించారు. తమ ఆందోళనలను అడ్డుకోవడానికి పోలీసులు అక్రమంగా హౌస్‌ అరెస్టులు చేస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో పలువురు బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement