లక్ష ఎకరాలకు సాగునీరు | - | Sakshi
Sakshi News home page

లక్ష ఎకరాలకు సాగునీరు

Jun 5 2026 4:47 AM | Updated on Jun 5 2026 4:47 AM

రైతుల భవితను మార్చనున్న భారీ ప్రాజెక్టు

మక్తల్‌ పర్యటనలో ముఖ్యమంత్రిరేవంత్‌రెడ్డి

నారాయణపేట/మక్తల్‌: కృష్ణా, భీమానది జలాలను ఎత్తిపోసి జిల్లాలోని లక్ష ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన మక్తల్‌–పేట–కొడంగల్‌ ప్రాజెక్టు పనుల పురోగతిని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి గురువారం స్వయంగా పరిశీలించి సాగునీటిపారుదల అధికారులతో సమీక్షించారు. ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకున్న సీఎం, మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరికి కలెక్టర్‌ సీహెచ్‌ ప్రియాంక ఘన స్వాగతం పలికారు.

ఏరియల్‌ సర్వే..

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెలికాప్టర్‌లో తిరుగుతూ కృష్ణానది పరీవాహక ప్రాంతాలను పరిశీలిస్తూ ప్రతిపాదిత బ్రిడ్జి–కం–బ్యారేజీల నిర్మాణ అవకాశాలపై అధికారులతో చర్చించారు. కొల్పూర్‌, ముడుమాల్‌, గుడెబల్లూరు ప్రాంతాల వద్ద బ్రిడ్జి–కం–బ్యారేజీల నిర్మాణానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయని అధికారులు వివరించారు. సాంకేతిక, ఆర్థిక సాధ్యాసాధ్యాలను పరిశీలించి ఈ ప్రాంత ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని తగిన చర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు.

కాట్రేవుపల్లి వద్ద పనుల పరిశీలన..

ఎత్తిపోతల పథకం పనులను సీఎం రేవంత్‌రెడ్డి మక్తల్‌ మండలం కాట్రేవుపల్లి సమీపంలో పరిశీలించారు. అత్యంత కీలకమైన ప్యాకేజ్‌–1 పనుల పురోగతిపై ప్రత్యేకంగా ఆరా తీశారు. నిర్మాణంలో ఉన్న పంప్‌ హౌస్‌ వద్దకు చేరుకొని ఎంతశాతం పనులు పూర్తయ్యాయని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు నిర్మాణ దశలు, సాంకేతిక అంశాలు, పనుల వేగం, ఎదురవుతున్న సమస్యలపై ఇంజినీరింగ్‌ అధికారులతో చర్చించారు. ఎత్తిపోతల పథకంలో పంప్‌హౌస్‌ అత్యంత కీలక భాగమని.. భీమా, కృష్ణా నదుల నుంచి నీటిని ఎత్తిపోసి పైభాగంలోని రిజర్వాయర్లు, కాల్వల ద్వారా భూములకు తరలించడంలో ప్రధాన పాత్ర పోషించనుందని ఇరిగేషన్‌ అధికారులు వివరించారు. పనుల్లో వేగం పెంచి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

ఫొటో ఎగ్జిబిషన్‌..

ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషనన్‌లో ప్రతిపాదిత బ్యారేజీలు, కాల్వలు, పంప్‌హౌస్‌లు, నీటి నిల్వ సామర్థ్యం, పంపిణీ వ్యవస్థలకు సంబంధించిన వివరాలను ఇరిగేషన్‌శాఖ అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ప్రాజెక్టు నిర్మాణ దశలు, భూ సేకరణ, సాంకేతిక అంశాలు, భవిష్యత్‌ ప్రయోజనాలను డిజిటల్‌ పద్ధతిలో వివరించారు. నాణ్యతకు ప్రాధాన్యతనిస్తూనే నిర్దేశిత గడువులోగా పనులు పూర్తి చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు. రైతులకు ఇచ్చిన హామీల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, నీటి పారుదలరంగాన్ని మరింత బలోపేతం చేసి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ప్రాజెక్టు పనులను నిరంతరం పర్యవేక్షిస్తుండాలని మంత్రి వాకిటి శ్రీహరికి సూచించారు.

రెండు రాష్ట్రాల మంత్రుల సమక్షంలో సమీక్ష..

కర్ణాటక, తెలంగాణ రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రులు బోసు రాజు, ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జిల్లా మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, కలెక్టర్‌ సీహెచ్‌ ప్రియాంక, ఇరిగేషన్‌శాఖకార్యదర్శి శశిధర్‌, చీఫ్‌ ఇంజినీర్‌ సత్యనారాయణరెడ్డి, సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ హెచ్‌టీ శ్రీధర్‌ తదితర ఉన్నతాధికారులతో సీఎం సమీక్ష నిర్వహించి ప్రాజెక్టు పురోగతిపై పూర్తిస్థాయి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement