సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: సీఎం రేవంత్‌రెడ్డి పర్యటనలో అలంపూర్ ఎమ్మెల్యే విజయుడి వ్యవహారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. రెండు రోజుల పాటు ప్రాజెక్ట్‌ల సందర్శనకు వచ్చిన ముఖ్యమంత్రి తొలి రోజు గురువారం జోగుళాంబ గద్వాల జిల్లాలో నెట్టెంపాడు ప్రాజెక్ట్‌లో భాగమైన గుడ్డెందొడ్డి పంప్‌హౌస్‌ను సందర్శించారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్‌కు చెందిన విజయుడు సీఎంను కలవడం.. ప్రాజెక్ట్ స్థితిగతులపై ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్, అధికారుల ప్రజెంటేషన్‌లో ఆయనతో కలిసి పాల్గొనడం హాట్‌టాపిక్‌గా మారింది. తమ హయాంలో ఉమ్మడి జిల్లాలో ప్రతిష్టాత్మక పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు 90 శాతం పూర్తయ్యాయని.. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ రెండున్నరేళ్లుగా నిర్లక్ష్యం వహిస్తోందని.. ఈ మేరకు పనులు పూర్తి చేయించాలనే డిమాండ్‌తో జూన్‌లో పాదయాత్ర చేపట్టనున్నట్లు బీఆర్‌ఎస్ నేతలు గత నెల చివరి వారంలో ప్రకటించారు. మహబూబ్‌నగర్‌లో మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ స్వగృహంలో జరిగిన సమావేశానికి మాజీ మంత్రులు నిరంజన్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఆ పార్టీకి చెందిన ఉమ్మడి జిల్లాలోని ఒకే ఒక ఎమ్మెల్యే విజయుడు సైతం హాజరయ్యారు. బీఆర్‌ఎస్ పాదయాత్రకు పిలుపునివ్వడం.. ఆ తర్వాత ముఖ్యమంత్రి ప్రాజెక్ట్‌ల సందర్శన చేపట్టడంపై ఇరుపార్టీల నేతల మధ్య పరస్పర విమర్శలు చోటుచేసుకున్నాయి. అంతేకాదు.. సీఎం పర్యటనను అడ్డుకుంటామని గద్వాలకు చెందిన బీఆర్‌ఎస్ నేతలు పిలుపునిచ్చారు. దీంతో ఆ పార్టీకి చెందిన పలువురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే విజయుడిని వారు వదిలిపెట్టడం.. ఆయన ముఖ్యమంత్రిని కలవడం ఆ పార్టీలో దుమారం రేపింది.
అప్పుడు అలా.. ఇప్పుడు ఇలా..
గతంలో కాంగ్రెస్ నాగర్‌కర్నూల్ ఎంపీ మల్లురవితో కలిసి ఆయన కారులో గద్వాలలోని జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ సరిత ఇంటికి వెళ్లగా వారు విజయుడిని సన్మానించారు. ఆ తర్వాత ఎంపీతో కలిసి పలు అభివృద్ధి పనుల శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాల్లో ఆయన పాల్గొనడం.. హైదరాబాద్‌లో పలు పర్యాయాలు ఆయన స్వయంగా ముఖ్యమంత్రిని కలవడం అప్పట్లోనే చర్చకు దారితీసింది. గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి బాటలోనే ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు ఊహాగానాలు వెల్లువెత్తాయి. అయితే వడ్డేపల్లి మున్సిపాలిటీకి సంబంధించిన పనుల శంకుస్థాపనలో ఎంపీ, ఎమ్మెల్యే వర్గాల మధ్య ఆధిపత్య లొల్లి చోటుచేసుకుంది. ఈ సందర్భంగా అనూహ్యంగా జరిగిన ఘటన అని ఎంపీ కొట్టేయడంతో వివాదం సద్దుమణిగింది. తాజాగా పాలమూరు ప్రాజెక్ట్‌పై విపక్ష బీఆర్‌ఎస్ నేతలు పోరుబాట పట్టనున్నట్లు నిర్ణయం తీసుకున్న క్రమంలో ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే అయి ఉండి ముఖ్యమంత్రిని కలవడం మరోసారి చర్చకు దారితీసింది. ఆయన బీఆర్‌ఎస్‌లోనే ఉంటారా.. కాంగ్రెస్‌లో చేరుతారా అనే దానిపై రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. దీనిపై స్పందన కోసం ఎమ్మెల్యేను ఫోన్‌లో సంప్రదించేందుకు ప్రయత్నించగా.. ఆయన అందుబాటులోకి రాలేదు.
సీఎం పర్యటనలో అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు
గతంలోనూ పలు పర్యాయాలు
స్వయంగా కలిసిన వైనం
అప్పట్లో ఎంపీ మల్లురవితో కలిసి
సరిత ఇంటికి వెళ్లడంతో రచ్చ
‘గులాబీ’ల పోరుబాట క్రమంలో
రేవంత్‌ను కలవడంపై అనుమానాలు
ఉమ్మడి జిల్లాలో హాట్‌టాపిక్‌గా
రాజకీయ పరిణామాలు


