నారాయణపేట రూరల్: జిల్లాలో భారతీయ జనతా పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు సమష్టిగా తమ శక్తివంచన లేకుండా కృషి చేయాలని బీజేపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ సి.అంజిరెడ్డి పిలుపునిచ్చారు. గురువారం మండలంలోని సింగారం చౌరస్తాలో ఉన్న ఓ ప్రైవేట్ పాఠశాలలో నిర్వహించిన బీజేపీ నాయకుల శిక్షణ శిబిరానికి ఆయనతో పాటు రాష్ట్ర ఎస్సీ మోర్చా అధ్యక్షుడు క్రాంతికిరణ్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పార్టీ సిద్ధాంతాలను ప్రతి కార్యకర్త పాటించాలని, పండిత్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ ఆశయాలను కొనసాగించాలని సూచించారు. కేంద్ర పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని.. కాంగ్రెస్ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ప్రజాక్షేత్రంలో ఎండగట్టాలన్నారు. గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేస్తూ రాబోవు సాధారణ ఎన్నికల్లో కమల వికాసమే ధ్యేయంగా పని చేయాలన్నారు. ఇలాంటి శిక్షణ కార్యక్రమాలు కార్యకర్తల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని చెప్పారు. అంతకుముందు పార్టీ జెండాను జిల్లా అధ్యక్షుడు కొండా సత్యాయాదవ్ ఆవిష్కరించారు. నాగూరావు నామాజీ, రతంగ్‌పాండురెడ్డి, ప్రకాష్‌రెడ్డి, కిషోర్‌రెడ్డి, మురళీధర్, కొండయ్య, పూనంచంద్ లహోటి,లక్ష్మీ, కొండ శ్వేత, మంజుల, రఘువీర్ పాల్గొన్నారు.
సంగీత స్వర
నిఘంటువు బాలు
నారాయణపేట: ఎస్పీ బాలసుబహ్మ్రణ్యం వ్యక్తి కాదు.. సంగీతానికి ప్రతిరూపం.. ఆయన పాడిన ప్రతి పాట ఒక పాఠం, ప్రతి స్వరం ఒక స్ఫూర్తి.. సంగీత స్వర నిఘంటువు అని ఎస్పీ బాలు ఫ్యాన్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి కొనియాడారు. పద్మ విభూషణ్ డా. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం 80వ జయంతిని గురువారం జిల్లాకేంద్రంలోని బాలకేంద్రంలో ఎస్పీ బాలు ఫ్యాన్‌న్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యకమ్రానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై బాలు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించి చిన్నారులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వరంతో భావోధ్వేగాలను పలికించిన మహా గాయకుడు, తన గానామృతంతో కోట్లాది మంది హృదయాల్లో శాశ్వత స్థానం సంపాదించుకున్న గాన గంధర్వుడు ఎస్పీ బాలు అన్నారు. ఐదు దశాబ్దాలకుపైగా సాగిన సంగీత ప్రస్థానంలో దేశభక్తి గీతాలు, అన్నమయ్య కీర్తనలు, భక్తి గీతాలు, జానపద గీతాలు, సినీ పాటలు తదితర 50 వేలకుపైగా ఆలపించి ప్రపంచ రికార్డులు సృష్టించారని గుర్తుచేశారు. ఆయన కేవలం గాయకుడు మాత్రమే కాదని.. ఒక గురువు, మార్గదర్శి, సంగీత సేవకుడని కొనియాడారు. నేటి తరం కళాకారులు ఆయనను ఆదర్శంగా తీసుకొని సంగీతంలో ముందుకు సాగాలని సూచించారు. కార్యక్రమంలో గాయకులు బాలాజీగౌడ్, సంగ నర్సింహులు, రామకృష్ణ, కళ్యాణి, వసంత్, జ్ఞానామృత తదితరులు పాల్గొని బాలు ఆలపించి సంగీత నివాళులు అర్పించారు.


