ఊట్కూర్: గ్రామాల్లో పలు శాఖల ప్రభుత్వ కార్యాలయాలకు పక్కా భవనాలు నిర్మించి ఏళ్లు గడుస్తున్నా ప్రారంభోత్సవాలకు నోచుకోవడం లేదు. ప్రైవేట్ అద్దె భవనాల్లో కార్యాలయాలు కొనసాగుతుండగా.. సరైన వసతులు లేక సభలు, సమావేశాలు నిర్వహించేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మండలంలోని ఏర్గాట్‌పల్లిలో రెండేళ్ల క్రితం గ్రామపంచాయతీ భవనాన్ని సుమారు రూ.20 లక్షలతో నిర్మించారు. పనులు పూర్తిచేసి రంగులు వేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేశారు. బిల్లులు మంజూరు కాలేదని కాంట్రాక్టర్ నిర్మించిన భవనాన్ని అధికారులకు అప్పగించకపోవడంతో నిరుపయోగంగా ఉంది. పెద్దజట్రం గ్రామంలో 10 ఏళ్ల కిందట ఐకేపీ ఆధ్వర్యంలో సుమారు రూ. 5 లక్షల నిధులతో డ్వాక్రా భవనాన్ని నిర్మించారు. భవన నిర్మాణానికిగాను గ్రామానికి చెందిన నాయిని జయసింహారెడ్డి స్థలాన్ని దానం చేశారు. పనులు పూర్తిచేసి రంగులు వేసి ప్రారంభించకపోవడంతో వృథాగా మిగిలింది. స్థానికులు భవనంలో పశువులను కట్టివేస్తున్నారు. డ్వాక్రా భవనం లేక మహిళ సంఘాల సభ్యులు సమావేశాలు నిర్వహించుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. పెద్దజట్రం గ్రామంలో రెండేళ్ల కిందట పశు వైద్యశాల భవనం నిర్మాణం ప్రారంభించి అసంపూర్తిగా వదిలేశారు. బండలు, కిటికీలు, తలుపులు బిగించి రంగులు వేయాల్సి ఉంది. స్థానిక గ్రామపంచాయతీ దగ్గర పశువులకు వైద్యం అందిస్తున్నారు.
● బిజ్వార్ నుంచి కొత్తపల్లి వరకు బీటీ రోడ్డు పనులు 3 నెలలుగా అసంపూర్తిగా నిలిచిపోయా యి. కాంట్రాక్టర్ రోడ్డుపై కంకరవేసి వదలేశారు. ద్విచక్ర వాహనాలు, ఆటోల్లో ప్రయాణించేందుకు ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి ప్రారంభోత్సవాలకు సిద్ధంగా ఉన్న భవనాలను వినియోగంలోకి తీసుకురావాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.


