బీఆర్‌ఎస్‌ను శక్తివంతం చేద్దాం | - | Sakshi
Sakshi News home page

బీఆర్‌ఎస్‌ను శక్తివంతం చేద్దాం

Jun 4 2026 5:28 AM | Updated on Jun 4 2026 5:28 AM

కార్యకర్తలే పార్టీకి బలం

మాజీ ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ

నారాయణపేట/మక్తల్‌: తెలంగాణ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం బీఆర్‌ఎస్‌ చేసిన కృషిని ప్రజలు మరచిపోలేదు.. కార్యకర్తలే పార్టీకి బలం.. సభ్యత్వ నమోదులో నంబర్‌ వన్‌గా నిలిపి పార్టీని మరింత శక్తివంతం చేద్దామని మాజీ ఉప ముఖ్యమంత్రి మహమూద్‌ అలీ పిలుపునిచ్చారు. బుధవారం జిల్లాకేంద్రంలోని పార్టీ జిల్లా కార్యాలయం జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్‌.రాజేందర్‌రెడ్డి నేతృత్వంలో నారాయణపేట నియోజకవర్గం, మక్తల్‌లోని ఓ ప్రైవేట్‌ ఫంక్షన్‌హాల్‌లో మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి నేతృత్వంలో మక్తల్‌ నియోజకవర్గ శ్రేణులకు పార్టీ సభ్యత్వ నమోదు, ఎస్‌ఐఆర్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆయా కార్యక్రమాలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పార్టీని క్షేత్రస్థాయి నుంచి మరింత బలోపేతం చేయడానికి పార్టీ అధినేత కేసీఆర్‌ డిజిటల్‌ సభ్యత్వ నమోదు ప్రక్రియను ప్రారంభించారన్నారు. గ్రామం నుంచి రాష్ట్రస్థాయి వరకు పార్టీని పటిష్టం చేయడమే కార్యక్రమ లక్ష్యమని పేర్కొన్నారు. పార్టీ కార్యకర్తలు, సోషల్‌ మీడియా బృందాలు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేసి సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 18 ఏళ్లు నిండిన వారిని ఓటరుగా నమోదు చేయించాలని సూచించారు. రాష్ట్రాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని.. రైతు సంక్షేమం, సాగునీరు, విద్యుత్‌, మౌలిక వసతులు, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందని.. ప్రజలు ప్రభుత్వ పనితీరును గమనిస్తున్నారని, రాబోయే రోజుల్లో బీఆర్‌ఎస్‌కు పట్టం కట్టడం ఖాయమని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే ఎస్‌.రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. అధికారంలో ఉన్నప్పుడు పార్టీలో ఉండి, తర్వాత వీడిన నాయకులకు తిరిగి చేరే అవకాశం ఇవ్వకూడదని అభిప్రాయపడ్డారు. కష్టకాలంలోనూ జెండాను మోసిన కార్యకర్తలే పార్టీకి నిజమైన బలమని పేర్కొన్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఉద్యమ స్థాయిలో నిర్వహించాలని.. నియోజకవర్గంలో 270 బూత్‌లు ఉండగా.. ప్రతి బూత్‌ నుంచి పార్టీ కోసం పోరాడే కనీసం 150 మంది సభ్యులను చేర్చాలనే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి మాట్లాడుతూ.. బీఆర్‌ఎస్‌ పార్టీకి మంచి రోజులు వస్తున్నాయని, కేసీఆర్‌, కేటీఆర్‌, హరీశ్‌రావు నాయకత్వంలో తిరిగి అధికారంలోకి వస్తామని తెలిపారు. కార్యకర్తలు ధైర్యంగా ఉండాలని.. ఎవరికి ఏ ఆపద వచ్చినా ఆదుకుంటానన్నారు. నారాయణపేటలో జరిగిన కార్యక్రమంలో నారాయణపేట నియోజకవర్గ ఇన్‌చార్జ్‌్‌ మేడి రాజీవ్‌సాగర్‌, నాయకులు అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ అమ్మకోళ్ల శ్రీనివాస్‌రెడ్డి, మార్కెట్‌ మాజీ చైర్‌పర్సన్‌ మొసటి జ్యోతి, పట్టణ అధ్యక్షుడు విజయ్‌సాగర్‌, మండల అధ్యక్షుడు వేపూరి రాములు, మక్తల్‌లో జరిగిన కార్యక్రమంలో మాజీ కార్పొరేషన్‌ చైర్మన్‌ దేవరి మల్లప్ప, దూదిమెట్ట బాలరాజు, జెట్టి శ్రీనివాసులు, నర్సింహగౌడ్‌, జుబేర్‌పాషా, మహిపాల్‌రెడ్డి, మహేశ్వర్‌రెడ్డి, చిన్నహన్మంతు, రామలింగం తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement