ముంపు బాధితులకు రూ.1,500 కోట్ల పరిహారం | - | Sakshi
Sakshi News home page

ముంపు బాధితులకు రూ.1,500 కోట్ల పరిహారం

Jun 4 2026 5:28 AM | Updated on Jun 4 2026 5:28 AM

రాష్ట్ర పశుసంవర్ధకశాఖ మంత్రి

వాకిటి శ్రీహరి

మక్తల్‌: సంగంబండ, భూత్పూర్‌, జూరాల ప్రాజెక్టు ముంపు బాధితులకు రూ.1,500 కోట్ల నష్ట పరిహా రం ఇచ్చేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం అంగీకరించిందని తెలంగాణ పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. నియోజకవర్గంలో గురువారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటన సందర్భంగా బు ధవారం ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం బీసీ గురుకుల పాఠశాల ఆవరణలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి జిల్లా ప్రజల దశ, దిశ మార్చేందుకు సీఎం పర్యటిస్తున్నారని.. గురువారం మధ్యాహ్నం 3 గంటలకు హెలికాప్టర్‌లో పట్టణంలోని బీసీ వెల్ఫేర్‌ పాఠశాల మైదానానికి చేరుకొని మక్తల్‌–నారాయణపేట–కొడంగల్‌ ఎత్తిపోతల పనులపై అధికారులతో సమీక్షిస్తారన్నారు. తెలంగాణ, కర్ణాటక సరిహద్దులో ఇరురాష్ట్రాల మంత్రులు బోసురాజు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో మాట్లాడామని.. తెలంగాణ వాటా నీటిని పూర్తిస్థాయిలో వినియోగించుకొనేలా ప్రణాళిక సిద్ధం చేశామని తెలిపారు. ముఖ్యమంత్రి, నీటి పారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గురు, శుక్రవారం ఉమ్మడి జిల్లాలోని ప్రాజెక్టుల ఏరియల్‌ సర్వే నిర్వహిస్తారని.. కృష్ణా, బీమా నదులపై బ్రిడ్జి కం బ్యారేజీల నిర్మాణం చేపట్టేందుకు ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒప్పుకున్నారని తెలిపారు. రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉండటంతో సమస్య పరిష్కారమైందని చెప్పారు. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలను కలుపుతూ గుడ్డెబల్లూర్‌ నుంచి తండిగి మీదుగా బీమా నదిపై వంతెన నిర్మాణం చేపడితే రాకపోకలు పెరిగి ప్రజలకు మరింత ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. పెండింగ్‌లో ఉన్న భూత్పూ ర్‌, నేరెడుగాం ముంపు గ్రామాల ప్రజలకు సరైన పరిహారం ప్రకటించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ను ఆదేశించినట్లు మంత్రి వివరించారు. భూత్పూర్‌ రిజర్వాయర్‌లో 15 టీఎంసీల నీటిని నిల్వ చేయగలిగితే ఈ ప్రాంతం సుభిక్షంగా ఉంటుందని తెలిపారు. సమావేశంలో మార్కెట్‌ వైస్‌ చైర్మన్‌ గణేష్‌కుమార్‌, పార్టీ పట్టణ అధ్యక్షుడు రవికుమార్‌, కౌన్సిలర్‌ రహీం పటేల్‌, వాకిటి హన్మంతు, మాజీ ఎంపీపీ చంద్రకాంత్‌గౌడ్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement