పేట–కొడగంల్ ఎత్తిపోతల పథకానికి శ్రీకారం..
రోడ్ల విస్తరణతో మారిన రూపురేఖలు..
నారాయణపేట: తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష నెరవేరి నేటికీ 12 ఏళ్లు అయ్యింది. ప్రజలకు పాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుకు 2016లో అప్పటి ప్రభుత్వం శ్రీకారం చుట్టగా.. నారాయణపేటను సైతం జిల్లాగా ఏర్పాటుచేయాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేశారు. 2018 ఎన్నికల ప్రచారంలో భాగంగా అప్పటి సీఎం కేసీఆర్ చేసిన వాగ్దానం మేరకు 2019 ఫిబ్రవరి 17న నారాయణపేట జిల్లాగా అవతరించింది. ప్రస్తుతం 13 మండలాలు, 4 మున్సిపాలిటీలు, 280 గ్రామ పంచాయతీలతో కొనసాగుతోంది. జిల్లా ఏర్పాటు అనంతరం దినదినాభివృద్ధి చెందుతోంది.
పెరిగిన భూగర్భజలాలు..
మిషన్ కాకతీయ పథకంతో జిల్లాలోని సుమారు 800 చెరువులను పునరుద్ధరించారు. దశాబ్ధాలుగా పూడికతో పేరుకుపోయిన చెరువులను బాగు చేయడంతో భూగర్భజలాలు పెరిగాయి. వేలాది ఎకరాల ఆయకట్టు సాగులోకి రావడంతో రైతులు సంతోషంగా పంటలు పండిస్తున్నారు. మరోవైపు మిషన్ భగీరథ పథకంతో ఇంటింటికీ శుద్ధమైన తాగునీరు అందుతోంది. ప్రతి గ్రామానికి తాగునీటి వసతి కల్పించడంలో గత ప్రభుత్వం సఫలమైందని చెప్పవచ్చు.
రూ.కోట్లతో అభివృద్ధి..
జిల్లా ప్రధాన కార్యాలయమైన కలెక్టరేట్ సముదాయంతో పాటు ఇతర కార్యాలయాలు, జిల్లా ఆస్పత్రి భవనాల నిర్మాణానికి గత ప్రభుత్వం రూ. 155.65 కోట్లు మంజూరు చేసింది. కలెక్టరేట్ సముదాయానికి రూ. 55కోట్లు, జిల్లా ఆస్పత్రికి రూ. 56కోట్లు, పోలీసు కార్యాలయానికి రూ. 36కోట్లను కేటాయించారు. ఇప్పటికే జిల్లా ఆస్పత్రి ప్రారంభం కాగా.. కలెక్టరేట్ పనులు కొనసాగుతున్నాయి. పోలీసు కార్యాలయానికి ఇంకా పునాదులు పడలేదు. అదే విధంగా కొండారెడ్డిపల్లి చెరువును రూ. 4కోట్లతో మినీ ట్యాంక్‌బండ్‌గా మార్చారు. రాష్ట్రంలో ఎక్కడా లేనివిధంగా సీనియర్ సిటిజన్ పార్కు, సైన్స్ పార్కు, చిల్డ్రన్ పార్కులను ఏర్పాటు చేశారు. రూ. 6కోట్ల వ్యయంతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మించారు. జిల్లాలో ఎస్సీ, బీసీ, మైనార్టీ సంక్షేమ గురుకులాలను ఏర్పాటుచేసి.. విద్యావ్యవస్థను మరింత బలోపేతం చేశారు. సూర్యలక్ష్మి డిగ్రీ కళాశాల ప్రభుత్వ కళాశాలగా మారింది. ప్రత్యేకంగా చిల్డ్రన్ ఆస్పత్రిని సైతం కరోనా సమయంలో ఏర్పాటుచేశారు.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక జిల్లా అభివృద్ధి శరవేగంగా జరుగుతోంది. సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు జీఓ 69 ద్వారా రూ. 5వేల కోట్లతో మక్తల్ – నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోతల పథకం నిర్మాణాన్ని 2024 ఫిబ్రవరి 21న ప్రారంభించారు. ప్రతి నియోజకవర్గంలో రూ. 200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణానికి పునాదులు పడ్డాయి. రాష్ట్రంలోనే తొలిసారిగా జిల్లా మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో పెట్రోల్ బంకు ఏర్పాటుచేశారు.
జిల్లా ఏర్పాటుతో మారిన రూపురేఖలు
రూ.155.65కోట్లతో
ప్రధాన కార్యాలయాల నిర్మాణం
అధునాతన సౌకర్యాలతో జనరల్ ఆస్పత్రి అందుబాటులోకి..
పేట – కొడంగల్ ఎత్తిపోతల పథకంతో తీరనున్న సాగునీటి గోస
జిల్లా కేంద్రంలో ప్రధాన రోడ్లను విస్తరించడంతో పట్టణ రూపురేఖలు మారిపోయాయి. గత ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి చొరవతో రూ. 28 కోట్లతో సత్యనారాయణ చౌరస్తా నుంచి మార్కండేయ దేవాలయం వరకు, అంబేడ్కర్ చౌరస్తా నుంచి వీరాసావర్కార్ చౌరస్తా వరకు రోడ్డు విస్తరణ పనులను పూర్తిచేశారు.


