4న మక్తల్‌కు సీఎం రేవంత్‌రెడ్డి | - | Sakshi
Sakshi News home page

4న మక్తల్‌కు సీఎం రేవంత్‌రెడ్డి

Jun 2 2026 5:53 AM | Updated on Jun 2 2026 5:53 AM

ఏరియల్‌ సర్వేతో సాగునీటి

ప్రాజెక్టుల పరిశీలన

రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి

మక్తల్‌: సాగునీటి ప్రాజెక్టుల పరిశీలన నిమిత్తం ఈ నెల 4న సీఎం రేవంత్‌రెడ్డి మక్తల్‌కు వస్తున్నట్లు రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధకశాఖ మంత్రి వాకిటి శ్రీహరి చెప్పారు. సోమవారం మక్తల్‌లో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏరియల్‌ సర్వే ద్వారా కొడంగల్‌ – నారాయణపేట – మక్తల్‌ ఎత్తిపోతల పథకం పనులతో పాటు కృష్ణా, భీమా నదులపై దాదాపు రూ.1,000 కోట్లతో నూతనంగా నిర్మించే బిడ్జికమ్‌ బ్యారేజ్‌ల స్థలాలను రాష్ట్ర నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కర్ణాటక మంత్రి బోసురాజుతో కలిసి సీఎం రేవంత్‌రెడ్డి పరిశీలిస్తారని తెలిపారు. ఇరు రాష్ట్రాల సహకారంతో నూతనంగా నిర్మించే ప్రాజెక్టులతో 6–8 టీఎంసీల సాగునీరు అందుబాటులో ఉంటుందన్నారు. తద్వారా ఈ ప్రాంతం సస్యశ్యామలంగా మారుతుందన్నారు. ముంపు గ్రామాలకు రూ. 100కోట్లతో పునరావాసం కల్పించనున్నట్లు తెలిపారు. నర్వ మండలం జంగంరెడ్డిపల్లి వద్ద కొత్త లిఫ్ట్‌లను సైతం త్వరలో ప్రారంభించనున్నట్లు వివరించారు. అదే విధంగా ముంపు గ్రామాలైన నేరడగోమ్‌, భూత్పుర్‌ను సీఎం పరిశీలిస్తారన్నారు. సీఎం పర్యటనకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు. సమావేశంలో కలెక్టర్‌ సీహెచ్‌ ప్రియాంక, ఎస్పీ డా.వినీత్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ వాకిటి మానస హన్మంతు, ఇరిగేషన్‌ ఎస్‌ఈ శ్రీధర్‌, బీకేఆర్‌ ఫౌండేషన్‌ చైర్మన్‌ బాలకిష్ణారెడ్డి, కట్ట సురేశ్‌, రవికుమార్‌, వైస్‌చైర్మన్‌ గణేశ్‌కుమార్‌ తదితరులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement