నారాయణపేట
● నేడు తెలుగువారి తొలి పండుగ
● శ్రీపరాభవ నామ సంవత్సరానికి స్వాగతం
● ఆలయాల్లో పంచాంగ పఠనానికి ఏర్పాట్లు
● సాగు పనులకు
శ్రీకారం చుట్టనున్న రైతులు
గురువారం శ్రీ 19 శ్రీ మార్చి శ్రీ 2026
నారాయణపేట: తెలుగువారి తొలి పండుగ ఉగాదిని జిల్లావ్యాప్తంగా గురువారం ఆనందోత్సాహాలతో నిర్వహించుకునేందుకు ప్రజలు సిద్ధమయ్యారు. శ్రీవిశ్వావసు నామ సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ.. శ్రీపరాభవ నామ సంవత్సరానికి స్వాగతం పలికేందుకు సర్వం సిద్ధం చేసుకున్నారు. పండుగ రోజున సంప్రదాయబద్ధంగా ఆలయాలను సందర్శించి.. ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. సాయంత్రం పంచాంగ పఠనానికి ఏర్పాట్లు చేస్తున్నారు. కాగా, ఉగాది పచ్చడికి అవసరమైన మట్టికుండలు, మామిడికాయలు, బెల్లం, వేపపూత, కొత్త చింతపండు, మామిడి తోరణాల విక్రయాలతో మార్కెట్లన్నీ రద్దీగా మారాయి.
పంచాంగ శ్రవణం..
ఉగాది పర్వదినాన దేవాలయాలు లేదా ఇంట్లో పంచాంగం వినడం ద్వారా రాబోయే కాలంలో జరగబోయే శుభ, అశుభాలను తెలుసుకునేందుకు ఉపయుక్తంగా ఉంటుంది. వ్యవసాయ సంవత్సరంగా పరిగణించే ఉగాది.. అన్ని రంగాల్లో శుభాలను చేకూరుస్తుందని ప్రజల నమ్మకం. తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాలకు చెందిన ప్రజలు జిల్లావ్యాప్తంగా ఉండటంతో.. ప్రఽ దానంగా దాతే, సు ర్పూర్, గంటల పంచాంగం, అశ్లీ, ముక్తేశ్వరి, బెంగళూర్ వా రి దార్వాడ్, ఒంటి కొప్పల్, సోలాపూర్ పంచాంగాలను వేద పండితులు వివరించనున్నారు.
శక్తిపీఠం ఆధ్వర్యంలో పురస్కారాలు..
జిల్లా కేంద్రంలోని శ్రీసంత్ మఠమూల మహాసంస్థానం శక్తిపీఠం ఆథ్వరంలో స్వామీజీ డా.శాంతానంద్ పూరోహిత్ ప్రతి ఏడాది పెద్ద ఎత్తున సామూహికంగా పంచాంగ శ్రవణ కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నారు. సమాజంలో ఆధ్యాత్మిక, సామాజిక, సేవా రంగాల్లో విశేష కృషి చేసినవారిని గుర్తించి.. శక్తిపీఠం ఆధ్వర్యంలో ఉగాది పురస్కారాలు అందిస్తున్నారు. ఉగాది పర్వదినాన సనాతన ధర్మం, భారతీయత, తెలుగుదనాన్ని సంరక్షించే దిశలో సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటుచేసి.. కళాకారులను సన్మానించి ప్రోత్సహిస్తారు.


