రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు
నారాయణపేట: జిల్లాకేంద్రంలో రోడ్డు ప్రమాదాల నియంత్రణే లక్ష్యంగా ఎస్పీ డా. వినీత్ ఆదేశాల మేరకు పటిష్ట చర్యలు చేపడుతున్నామని ట్రాఫిక్ నోడల్ అధికారి ఎండీ రియాజ్ హూల్‌హక్ తెలిపారు. బుధవారం ఆయన జిల్లాకేంద్రంలోని పలు ప్రధాన రహదారులు, కూడళ్లను పరిశీలించారు. ఓవర్ స్పీడ్‌కు అడ్డుకట్ట వేసేందుకు స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాల్సిన ప్రాంతాలను గుర్తించారు. కలెక్టర్, ఎస్పీకి వివరించి త్వరలోనే ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. అలాగే వాహనాలను ఎక్కడపడితే అక్కడ నిలపడంతో ట్రాఫిక్ సమస్య ఉత్పన్నమవుతోందని.. ముఖ్యంగా హోటళ్లు, బ్యాంకులు, దుకాణాల ఎదుట రోడ్లపై వాహనాలు నిలపడంతో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్నట్లు వివరించారు. సంబంధిత బ్యాంకు మేనేజర్లు, హోటళ్లు, దుకాణాల యజమానులకు స్పష్టమైన సూచనలు ఇవ్వనున్నట్లు చెప్పారు. ప్రతి వ్యాపార సంస్థ విధిగా సెక్యూరిటీ సిబ్బందిని నియమించుకొని వాహనాలను రోడ్లపై కాకుండా కేటాయించిన ప్రదేశాల్లోనే నిలిపేలా చూడాలని ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాల నివారణే ప్రధాన లక్ష్యంగా జిల్లాకేంద్రంలో ట్రాఫిక్ నియంత్రణ చర్యలు పటిష్టంగా అమలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. ప్రజలంతా పోలీస్‌శాఖకు సహకరించి ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని కోరారు. ఆయన వెంట ట్రాఫిక్ ఎస్‌ఐ కృష్ణచైతన్య, ఆర్టీఏ సభ్యుడు పోషల్ రాజేష్ తదితరులు ఉన్నారు.


