నామినేషన్ కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు
నారాయణపేట: పుర ఎన్నికల వేళ జిల్లాలోని నాలుగు మున్సిపాలిటీల్లో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ డా. వినీత్ తెలిపారు. బుధవారం నారాయణపేట, మద్దూర్‌లోని నామినేషన్ కేంద్రాలను ఆయన పరిశీలించి భద్రత ఏర్పాట్లపై అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. నామినేషన్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉందని, 200 మీటర్ల పరిధిలో గుంపులుగా ఉండరాదని స్పష్టం చేశారు. అభ్యర్థితో పాటు ఇద్దరు ప్రతిపాదకులకే కేంద్రంలోకి అనుమతి ఉంటుందని తెలిపారు. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులు ర్యాలీలు, వాహనాలకు మైక్‌ల ఏర్పాటుకుగాను ముందస్తుగా పోలీస్‌శాఖ అనుమతి తీసుకోవాలని సూచించారు. ఎన్నికలు శాంతియుతంగా జరిగేందుకు ప్రజలు సహకరించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. జిల్లాలో స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు పోలీస్‌శాఖ కట్టుబడి ఉందని, ఇంతకుముందు గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని వివరించారు. అదేవిధంగా పుర ఎన్నికలు కూడా ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రజలు పూర్తిస్థాయిలో సహకరించాలని కోరారు. ఎస్పీ వెంట ఎస్‌ఐ నరేష్, మున్సిపల్ అధికారులు, స్థానిక పోలీసులు ఉన్నారు.


