ఆడపిల్ల తల్లిదండ్రులకు బలం
నారాయణపేట: ఆడపిల్ల తల్లిదండ్రులకు బాధ్యత కాదని.. వారి బలమని అడిషనల్ జూనియర్ సివిల్ న్యాయమూర్తి కె.అవినాష్ అన్నారు. ‘జాతీయ బాలికా దినోత్సవం’ సందర్భంగా బుధవారం జిల్లాకేంద్రంలోని సఖికేంద్రంలో తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాలతో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ఏటా జనవరి 24న దేశమంతటా ‘జాతీయ బాలికా దినోత్సవం‘ జరుపుకొంటామని, బేటీ బచావో – బేటీ పడావో వంటి పథకాలు బాలికల రక్షణ, విద్యకు ఎంతగానో తోడ్పడతాయన్నారు. బాలికలు సమాజంలో ఒక ముఖ్యమైన భాగం కాగా.. నేటికీ వివక్షకు గురవుతున్నారని తెలిపారు. లింగ వివక్ష లేని వాతావరణాన్ని సృష్టించడం, బాలికా విద్య, ఆరోగ్యం, పోషకాహారం, హక్కుల రక్షణ, బాల్య వివాహాల నియంత్రణ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ఆడపిల్లను చదివిస్తేనే వారు కుటుంబాలకు మద్దతు గా నిలబడగలరన్నారు. పలువురు వక్తలు చైల్డ్ హెల్ప్‌లైన్ నంబర్ 1098, బాలికల రక్షణకు ఉపయోగపడే పథకాలు, పోక్సో చట్టం, సామాజిక రక్ష ణ, బాల కార్మిక వ్యవస్థ, తదితర వాటిపై అవగాహ న కల్పించారు. టోల్‌ఫ్రీ నంబర్ 15100కి కాల్‌చేసి ఉచిత న్యాయ సాయం పొందవచ్చన్నారు. కార్యక్రమంలో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ సురేష్, చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ లక్ష్మీపతిగౌడ్, జిల్లా సంక్షేమశాఖ అధికారి రాజేందర్‌గౌడ్, సఖిసెంటర్ కో–ఆర్డినేటర్ క్రాంతిరేఖ, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ కరిష్మా, చైల్డ్ హెల్ప్‌లైన్ సిబ్బంది జి.నర్సింహ, డి.నర్సింహ, నర్సింహ, సఖిసెంటర్ సోషల్ వర్కర్ కవిత, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


