వెంకటేశా.. నమోస్తుతే...
● మన్యంకొండ బ్రహ్మోత్సవాలు ప్రారంభం
మహబూబ్‌నగర్ రూరల్: మన్యంకొండ శ్రీ లక్ష్మీ వేంకటేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు బుధవారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ప్రత్యేక పూజల అనంతరం దేవస్థానం సమీపంలోని కోటకదిరలో ఉన్న ఆలయ చైర్మన్ అళహరి మధుసూదన్‌కుమార్ ఇంటి నుంచి స్వామి ఉత్సవమూర్తిని మన్యంకొండ గుట్టపైకి పల్లకీలో ఊరేగింపుగా తీసుకొచ్చారు. కోలాటాలు, భజనలతో కోటకదిర గ్రామం భక్తిపారవశ్యంతో పులకించిపోయింది. ముందుగా స్వామివారిని వివిధ బంగారు ఆభరణాలతో అలంకరించి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. అనంతరం చైర్మన్ అళహరి మధుసూదన్‌కుమార్, ఈఓ శ్రీనివాసరాజు ఆధ్వర్యంలో ప్రత్యేక అభిషేకం, నివేదన పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామివారికి ప్రీతిపాత్రమైన దాసంగాలను సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ఉత్సవాల్లో భాగంగా తొలిరోజు స్వామివారికి గరుడవాహన సేవ నిర్వహించారు. పల్లకీలో స్వామివారిని గర్భగుడి నుంచి దేవస్థానం ముందు ఉన్న మండపం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చారు. అనంతరం అక్కడ ప్రత్యేక పూజలు చేసి.. తిరిగి స్వామివారిని గర్భగుడి వద్దకు తీసుకెళ్లారు. తిరుచ్చిసేవలో స్వామివారు బంగారు ఆభరణాలు, వివిధ పూల అలంకరణలో ధగధగ మెరిసిపోతూ భక్తకోటికి దర్శనమిచ్చారు. గురువారం స్వామివారికి హంసవాహనసేవ నిర్వహిస్తారు. ఆయా కార్యక్రమాల్లో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహారెడ్డి, సూపరింటెండెంట్ నిత్యానందచారి, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు.
వెంకటేశా.. నమోస్తుతే...
వెంకటేశా.. నమోస్తుతే...


