కోటి ఆశలు..!
కొత్త పాలకవర్గంపై..
నేడు కొలువుదీరనున్న పల్లె పాలకవర్గాలు
ఏడేళ్ల క్రితం సర్పంచ్‌గా పనిచేసిన అనుభవం ఉంది. మళ్లీ ఈ సారి ప్రజలు పట్టం కట్టారు. ఈ ఐదేళ్లలో ముందుగా గ్రామంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మిస్తాం. తాగునీరు, పారిశుద్ధ్యం, ఇతర మౌలిక వసతులపై ప్రత్యేక దృష్టి సారించాం.
– శ్రీనివాస్, సర్పంచ్, బాపన్‌పల్లి,
దామరగిద్ద మండలం
రెండోసారి సర్పంచ్‌గా గెలిపించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆశీర్వాదంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ది చేస్తా. మా గ్రామానికి కావాల్సిన నిధులు మంజూరు చేయించి నియోజకవర్గంలోనే ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా.
– హరిత కృష్ణయ్య, సర్పంచ్, గొర్లోనిబాయి, కొత్తపల్లి మండలం
20 ఏళ్లుగా జూనియర్ కళాశాల ఏర్పాటు కలగానే మిగిలింది. స్థానిక ఎమ్మెల్యే సహకారంతో ఈ కలను సాకారం చేస్తాం. ప్రభుత్వ స్థలాలను కాపాడుకుంటాం. 30 ఏళ్ల నుంచి గ్రామపంచాయతీ షాపింగ్ కాంప్లెక్స్ టెండర్లకు నోచుకోవడం లేదు. వాటికి టెండర్లు వేయిస్తాం. మరికల్ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దుతాం.
– చెన్నయ్య, సర్పంచ్, మరికల్
నారాయణపేట: దాదాపు రెండేళ్లుగా సీసీరోడ్లు.. డ్రైయినేజీలు వంటి అభివృద్ధి పనులకు నోచుకోక.. నిధుల లేమితో తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడాయి పల్లెలు. అటు సమస్యలు పరిష్కరించేవారు లేక.. ప్రత్యేక అధికారులు అందుబాటులోకి రాక ఇన్నాళ్లు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పంచాయతీ పగ్గాలు చేపట్టబోతున్న పాలకవర్గాలపైనే ప్రజలు కోటి ఆశలు పెట్టుకున్నారు. గ్రామాల్లో ఏళ్ల తరబడి వేధిస్తున్న సమస్యలు పరిష్కరించి.. అభివృద్ధి వైపు నడిపిస్తారని ఎదురుచూస్తున్నారు.
గ్రామ పంచాయతీల్లో నూతన పాలకవర్గాలు సోమవారం కోలువుదీరనున్నాయి. జిల్లావ్యాప్తంగా 272 గ్రామపంచాయతీలు, 2,466 వార్డు మెంబర్ల స్థానాలకు ఎన్నికలు జరిగాయి. గెలుపొంది సర్పంచ్‌లు, వార్డుమెంబర్లు ఈ నెల 22న ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇందుకుగాను గ్రామ పంచాయతీ భవనాలకు నూతనంగా రంగులు దిద్దుతూ ముస్తాబు చేశారు. ఇక నూతన పాలకవర్గం ఆధ్వర్యంలో పంచాయతీల పరిపాలన కొనసాగనుంది. పంచాయతీ ఎన్నికల్లో పార్టీ గుర్తుపై పోటీ చేయకపోయినా గెలిచిన అభ్యర్థులు ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల మద్దతు దారులే ఉన్నారు. 272 స్థానాల్లో అధికార పార్టీకి చెందిన కాంగ్రెస్ మద్దతుదారులు 162..బీఆర్‌ఎస్ పార్టీ మద్దతుదారులు 53..బీజేపీ పార్టీ మద్దతుదారులు 32...ఇతరులు 25 మంది సర్పంచులు గెలుపొందారు. ఇదిలాఉండగా, కొత్తపాలక వర్గాలు ప్రమాణస్వీకారం చేస్తున్న సోమవారం తొలి సమావేశం నిర్వహించాలని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ గెజిట్ విడుదల చేశారు. చట్టప్రకారం నెలకోసారి పాలకవర్గాలు సమావేశాలు చేయాల్సి ఉంటుంది.
గత సర్పంచ్‌ల పదవీకాలం రెండేళ్ల క్రితమే ముగియడంతో అప్పటి నుంచి ప్రత్యేక అధికారులపాలన కొనసాగింది. ప్రత్యేకాధికారులు అందుబాటులో లేకపోవడంతో గ్రామాల్లో సమస్యలు ఎవరికి చెప్పు కోవాలో అర్థంకాక ప్రజలు ఇబ్బంది పడుతూ వచ్చారు. ఒక్కో అధికారికి రెండు మూడు పంచాయతీల బాధ్యతలు అప్పగించారు. అటు వారి శాఖలకు సంబంధించిన విధి నిర్వహణలపై అధికారులు దృష్టి సారించడంతో పంచాయతీ పాలన పట్టు తప్పింది. తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ఎక్కడి సమస్యలు అక్కడే అపరిష్కృతంగా ఉన్నాయి. ఇదిలాఉండగా, పంచాయతీ ఎన్నికలు నిర్వహించాల్సిందేనని హైకోర్టు మొట్టికాయలు వేయడంతో ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చింది. నెల రోజుల వ్యవధిలోనే మూడు విడతల్లో ఎన్నికలు ముగిశాయి. గెలుపొందిన సర్పంచ్‌లు, పాలకవర్గాలతో కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం పాలన సాగించేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
272 మంది సర్పంచ్‌లు, 2,466 వార్డు సభ్యుల ప్రమాణ స్వీకారం
ముస్తాబైన గ్రామ పంచాయతీలు
దాదాపు రెండేళ్ల ప్రత్యేకాధికారుల పాలనలో ఎక్కడి సమస్యలు అక్కడే..
గ్రామాలకు నిధుల ఇక్కట్లు తీరేనా..?
కోటి ఆశలు..!


