విలేకర్లపై కేసులు ఎత్తివేయకపోతే ఉద్యమిస్తాం
నారాయణపేట: విలేకర్లపై ‘పేట’ ఆర్టీసీ డిపో డీఎం అక్రమ కేసులు నమోదు చేయించడం సరైందికాదని, వెంటనే ఎత్తివేయకపోతే బీజేపీ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపడతామని బీజేపీ రాష్ట్ర నేత నాగూరావు నామాజీ హెచ్చరించారు. శనివారం జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. సకాలంలో బస్సులు నడపాలంటూ విద్యార్థి సంఘాలు బస్టాండ్ వద్ద రాస్తారోకో చేపడుతుండగా.. వృత్తి ధర్మంగా న్యూస్ కవరేజ్ చేసేందుకు వెళ్లిన విలేకర్లపై డీఎం తప్పుడు ఫిర్యాదు చేయించి అక్రమ కేసులు బనాయించడం సరైందికాదన్నారు. దసరా, దీపావళి పండుగ సందర్భంగా నడిపిన స్పెషల్ బస్సుల సమాచారం అడగగా.. డీఎం ఇవ్వలేదని, దీనిపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడంతో అప్పటి నుంచి విలేకర్లపై కక్ష్యసాధింపు చర్యలకు పాల్పడాలని పూనుకున్నట్లు ఉందన్నారు. పోలీసులు ఎలాంటి విచారణ చేపట్టకుండా అక్రమ కేసులు బనాయించడం ఆర్టీసీ అధికారులకు వత్తాసుపలకడమే అన్నారు. డిపోలో జరుగుతున్న అవకతవకలపై పూర్తి స్థాయి సమగ్ర విచారణ చేపట్టి డీఎంను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో విద్యార్థులు, విద్యార్థి సంఘాలు బీజేపీ ఆధ్వర్యంలో ఉద్యమాలు చేపట్టేందుకు వెనుకడబోమని హెచ్చరించారు. ఆయనతో పాటు బీజేపీ జిల్లాఅధ్యక్షులు సత్యయాదవ్ ఉన్నారు.


