తుంగాతీరం.. జయ జన ధ్వానం | - | Sakshi
Sakshi News home page

తుంగాతీరం.. జయ జన ధ్వానం

Aug 31 2026 1:44 AM | Updated on Aug 31 2026 1:44 AM

మంత్రాలయం: సద్గురు రాఘవేంద్రులు సశరీరంగా బృందావన ప్రవేశం చేసిన శుభదినం.. పరమగురుడి 355వ ఆరాధన వేళ.. భక్తజన సంద్రంతో వేదభూమి పులకించింది. తుంగభద్రమ్మ పరవశించింది. ఆదివారం సప్తరాత్రోత్సవాల్లో భాగంగా పీఠాధిపతి సుబుధేంద్రతీర్థుల ఆశీస్సులతో మధ్యారాధన మహా మంగళకరంగా సాగింది. రాఘవేంద్రస్వామి బృందావనం ప్రవేశం రోజు కావడంతో స్వామి మూల బృందావనానికి మహా పంచామృతాభిషేకం గావించారు. వేదపఠనం గావిస్తూ జల, పుష్ప, పంచామృతాభిషేకం నిర్వహించారు. ఈ వేడుకను తిలకించేందుకు 2 లక్షలకుపైగా భక్తులు హాజరైనట్లు అంచనా. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు శ్రీమఠం క్షేత్ర పరిధిలో నాలుగు చోట్ల ఎల్‌ఈడీ డిస్‌ప్లేతో ద్వారా భక్తులకు వీక్షణ సదుపాయం కల్పించింది. మధ్యారాధన సందర్భంగా మధ్యా హ్నం రాఘవేంద్రులను బంగారు రథంపై ఊరేగించారు. రాయరు బంగారు ప్రతిమను స్వర్ణ రథంపై కొలువుంచగా పీఠాధిపతి నారికేళ సమర్పణతో మంగళ హారతులు పట్టి రథయాత్రకు అంకురార్పణ పలికారు. పండితుల వేదఘోష, మంగళ వాయిద్యాలు, కర్ణాటక డోలు వాయిద్యాల సుస్వరాల మధ్య శ్రీమఠం ప్రాంగణ వీధుల్లో రథయాత్ర రమణీయంగా సాగింది. వేడుకలో మేళతాళాలు, నృత్య ప్రదర్శనలు, సంకీర్తనాలాపనలు భక్తులను మైమరిపించాయి.

గజవాహనంపై గురుసార్వభౌమ..

ద్వైత వేదాంత మూర్తి గురుసార్వభౌముడు రజత గజవాహనంపై కడు వైభవంగా ఊరేగారు. ముందుగా ఊంజల మంటపంలో ఉత్సవమూర్తికి రుగ్వేద, యజుర్వేద, సామవేద పారాయణం పఠిస్తూ పీఠాధిపతి చామర్ల సేవ గావించారు. అనంతరం శ్రీమఠం ప్రాంగణ వీధుల్లో డప్పు దరువులతో ఎంతో రమణీయంగా ఉత్సవమూర్తి గజవాహనంపై ఊరేగారు. రాత్రి రెండు గంటల వరకు, అంబారీ, స్వర్ణ, నవరత్న రథోత్సవం అశేష భక్తజన వాహిని మధ్య అంగరంగ వైభవంగా సాగింది. అంతకు ముందు పరిమళ తీర్థ పుష్కరిణిలో ఉత్సవమూర్తి తెప్పోత్సవం శాస్త్రోక్తంగా నిర్వహించారు. అలాగే యోగీంద్ర మంటపంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు కనువిందు చేశాయి. బెంగళూరుకు చెందిన భువనేశ్వరి వీణా వాదం, రాయచూరు శేషగిరి దాసు, దాసవాణి, ఉడిపికి చెందిన భార్గవ నృత్య తండా బృందం నృత్య రూపక ప్రదర్శనలు ఎంతగానో అలరించాయి. వేడుకలో పండితకేసరి గిరియాచార్‌, ఏఏఓ మాధవశెట్టి, మేనేజర్‌–1 శ్రీనివాసరావు, మేనేజర్‌–2 వెంకటేష్‌జోషి, జోనల్‌ మేనేజర్‌ శ్రీపతిఆచార్‌, ధార్మిక సహాయకాధికారి వ్యాసరాజాచార్‌, వేద పాఠశాల మాజీ ప్రిన్స్‌పాల్‌ వాదిరాజాచార్‌ తదితరులు పాల్గొన్నారు.

నేడు మహా రథోత్సవం

మంత్రాలయం రూరల్‌: ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం మంత్రాలయంలో రాఘవేంద్రస్వామి 355వ ఆరాధనోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం ఉదయం 9.30 గంటలకు మహా రథోత్సవాన్ని నిర్వహించనున్నారు. శ్రీమఠం పీఠాఽధిపతి సుబుధేంద్ర తీర్థుల నేతృత్వంలో ఉదయం నిత్యపూజలు అనంతరం కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. రథోత్సవం శ్రీ మఠం కారిడార్‌ మహాద్వారం నుంచి ప్రధాన రహదారి, పురవీధుల మీదుగా రాఘవేంద్ర సర్కిల్‌ చుట్టూ చేరుకుని తిరిగి శ్రీమఠం చేరుకుంటుంది. దేశం నలుమూల నుంచి భక్తులు భారీ ఎత్తున పాల్గొని మొక్కులు తీర్చుకుంటారు. అదే మహా రథోత్సవ సమయంలో హెలికాప్టర్‌తో పూల వర్షం కురిపిస్తారు.

వైభవంగా శ్రీరాఘవేంద్రుల

మధ్యారాధన

స్వర్ణ రథంపై రాఘవేంద్రుల

ఊరేగింపు

ఆకట్టుకున్న మహా

పంచామృతాభిషేకం

భక్తుల రద్దీతో శ్రీమఠం కిటకిట

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement