నంద్యాల(న్యూటౌన్): ఇన్ సర్వీసు ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని, లేని పక్షంలో ఉద్యమాన్ని ఉద్ధృతం చేస్తామని ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శి రామచంద్రారెడ్డి, శివయ్య అన్నారు. ఆదివారం స్థానిక కార్యాలయంలో ఉద్యమ కార్యాచరణపై కరపత్రాలు విడుదల చేశారు. సమావేశంలో వారు మాట్లాడుతూ.. రాష్ట్ర సంఘం పిలుపు మేరకు టెట్ రద్దు కోరుతూ సెప్టెంబర్ 2 నుంచి 11వ తేదీ వరకు మంగళగిరిలోని విద్యా భవన్ ఎదుట జరిగే ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. సమావేశంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జాకీర్ హుస్సేన్, భాస్కర్ రెడ్డి, జిల్లా సబ్ కమిటీ సభ్యులు హరినాథ్ గౌడ్, పుల్లయ్య, చంద్రహాసరెడ్డి, నూరుల్లా, సుబ్బారెడ్డి పాల్గొన్నారు.
మొక్కజొన్న పంట
జీవాలకు మేత
నందికొట్కూరు: పక్కనే హంద్రీ నీవా కాల్వల్లో కృష్ణా జలాలు పరుగులు పెడుతున్నాయి. ఎక్కడో దూరాన ఉన్న అనంతపురం, కుప్పానికి నీళ్లు తరలిస్తున్న ప్రభుత్వం ఇక్కడి రైతుల గురించి పట్టించుకోవడం లేదు. వర్షాలు లేక, కాల్వలకు నీళ్లు రాక పంటలు ఎండిపోతున్నాయి. దామగట్ల గ్రామానికి చెందిన రైతు కుమ్మరి లింగన్న పొలం నిండు కుండలా ప్రవహిస్తున్న హంద్రీనీవా కాలువ సమీపంలో ఉంది. మొక్క జొన్న పంట సాగు చేయగా వర్షాలు లేకపోవడంతో పంట గిడసబారిపోయింది. చివరకు పంటను జీవాలకు మేతగా వదిలేశాడు.
క్వింటా వేరుశనగ రూ.9,290
ఎమ్మిగనూరుటౌన్: స్థానిక వ్యవసాయ మార్కెట్‌లో ఆదివారం క్వింటా వేరుశనగకు గరిష్ట ధర రూ.9,290 లభించింది. మార్కెట్‌కు 1,056 క్వింటాళ్ల దిగుబడులను రైతులు విక్రయానికి తెచ్చారు. క్వింటా కనిష్టంగా రూ.4,390, మధ్యస్థంగా రూ.7,700 ప్రకారం మార్కెట్‌లో వ్యాపారులు కొనుగోలు చేశారని మార్కెట్ యార్డ్ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి పి.కల్పన తెలిపారు.


