● మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్‌రెడ్డి
బొమ్మలసత్రం: చంద్రబాబు పాలనలో రైతుల గుండెలు బీటలు బారుతున్నాయని మాజీ ఎమ్మెల్యే శిల్పా రవిచంద్రకిషోర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆదివారం నంద్యాల మండలం కానాల గ్రామ శివారులోని చెరువును ఆయన రైతులతో కలిసి పరిశీలించారు. అనంతరం శిల్పా రవి మాట్లాడుతూ.. శ్రీశైలం జలాశయంలో 873 అడుగుల మేర నీరు ఉన్నప్పటికీ సీమ ప్రాంతానికి తాగు, సాగునీరును ఎందుకు విడుదల చేయడం లేదో కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. ప్రభుత్వ అధికారులు ఈ ఏడాది ఆరుతడి పంటలు సాగు చేయవద్దని ముందే చెబుతున్నారు తప్ప.. ప్రత్యామ్నాయ పంటలు ఎలా సాగు చేయాలో రైతులకు వివరించడం లేదన్నారు. రైతుకు వ్యవసాయం తప్ప వేరే వృత్తి తెలియదని వారికి సాగు నీరు ఇవ్వకపోతే ఎలా జీవిస్తారని ప్రశ్నించారు. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతుల దుస్థితి దారుణంగా మారిందని వాపోయారు. పంటల బీమా, అన్నదాత సుఖీభవ లాంటి పథకాలు లేక ఆర్ధికంగా చితికి పోతున్నారన్నారు. కౌలు రైతుల గోడు పట్టించుకునే నాథుడే లేరన్నారు. టీడీపీ నేతలు మట్టి దందా చేస్తూ చెరువులను కొల్లగొడుతున్నారే కానీ.. రైతుల కోసం చెరువులను నీటితో నింపాలనే ఆలోచన చేయడం లేదన్నారు. శిల్పా వెంట కానాల నాయకులు విజయశేఖర్‌రెడ్డి, జగదీశ్వరరెడ్డి, మాజీ ఎంపీపీ రంగారావు, ఉసేన్, శ,కర్, ఖాసీం, మరియదాస్, కరీమ్, ఫకృధీన్, జమాల్, ఫరూక్, నాగఉసేని, రైతులు ఉన్నారు.
పేదల స్థలాలు టీడీపీ నేతల ఆక్రమణ..
కానాల గ్రామంలో గత ప్రభుత్వంలో ఇళ్లు లేని పేదలకు కేటాయించిన ఇళ్ల పట్టాలను టీడీపీ నేతలు కబ్జా చేయడం దారుణమని మాజీ ఎమ్మెల్యేశిల్పారవి విమర్శించారు. పేదలకు ఇచ్చిన పట్టాలు కూటమి నేతలు తిరిగి వెనక్కి తీసుకునే ప్రయత్నం చేయడం అన్యాయమన్నారు. గత ఎన్నికలకు ముందు పేదలకు రెండు సెంట్ల స్థలం ఇస్తామని మాయమాటలు చెప్పిన కూటమి నేతలు ప్రస్తుతం గతంలో ఇచ్చిన పట్టాలను ఆక్రమించడం సబబు కాదన్నారు.


