శ్రీగిరి.. ప్రగతి అధోగతి! | - | Sakshi
Sakshi News home page

శ్రీగిరి.. ప్రగతి అధోగతి!

Jun 6 2026 1:35 AM | Updated on Jun 6 2026 1:35 AM

శ్రీశైలంటెంపుల్‌: తిరుమల తరహాలో శ్రీశైలాన్ని అభివృద్ధి చేస్తాం.. శ్రీశైలం పర్యటనకు వచ్చినప్పుడల్లా సీఎం చంద్రబాబు చెప్పే మాటలు కార్యరూపం దాల్చలేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్నా శ్రీశైల క్షేత్రంలో అభివృద్ధి కనిపించడం లేదు. క్యూ కాంప్లెక్స్‌, సరిపడినన్ని వసతి గదులు లేక.. అరకొర సౌకర్యాలతో భక్తులు నానా అవస్థలు పడుతున్నారు. ఇక ఉత్సవాల్లో భక్తుల అవస్థలు వర్ణనాతీతం.

మాటల్లోనే అభివృద్ధి!

రాష్ట్రంలో తిరుమల తరువాత రెండో పెద్ద పుణ్యక్షేత్రం శ్రీశైలం. శ్రీభ్రమరాంబా సమేత మల్లికార్జున స్వామి దర్శనానికి ప్రతి రోజూ లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. శ్రీశైల క్షేత్ర అభివృద్ధిపై పలుమార్లు సమావేశాలు నిర్వహించినప్పటికీ ఇంతవరకు ఫలితం లేకుండా పోయింది. అంతేకాకుండా సీఎం హోదాలో చంద్రబాబు శ్రీశైల క్షేత్రాన్ని మూడుసార్లు సందర్శించారు. శ్రీశైల క్షేత్రాన్ని పర్యాటకంగా, ఆధ్యాత్మికంగా మరింత అభివృద్ధి చేస్తామని చెప్పినా ఆచరణలో కనిపించలేదు. శ్రీశైల క్షేత్ర అభివృద్ధి కోసం టూరిజం, రెవెన్యూ, దేవదాయ, అటవీశాఖ, ఆర్‌అండ్‌బీ శాఖల మంత్రులతో కమిటీని ఏర్పాటు చేశారు. కమిటీ కూడా అభివృద్ధి చేయలేదు. చంద్రబాబు మాటల్లో మాత్రమే అభివృద్ధి ఉంటుందని, చేతల్లో ఉండదని ప్రజలు విమర్శిస్తున్నారు.

సమావేశాలకే పరిమితం

కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత మూడు పార్టీలకు చెందిన 26 మందితో జంబో ట్రస్ట్‌బోర్డును నియమించారు. ట్రస్ట్‌బోర్డు ఏర్పాటై ఎనిమిది సమావేశాలు నిర్వహించినా ఇంతవరకు ఒక్క అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. జంబో ట్రస్ట్‌బోర్డు సభ్యులు తమ దర్శనాలు, తమ సిఫార్స్‌ లేఖలకు ప్రాధాన్యత ఇవ్వలేదని దేవస్థాన అధికారులపై ఆగ్రహించడం తప్ప క్షేత్రాభివృద్ధికి ఎటువంటి చర్యలు చేపట్టలేదని తెలుస్తోంది. అంతేకాకుండా ట్రస్ట్‌బోర్డుకు స్వయంప్రతిపత్తి లేకపోవడంతో తీర్మానాలన్నింటినీ దేవదాయశాఖ కమిషనర్‌కు పంపుతున్నారు. అక్కడి నుంచి ఇంతవరకు అనుమతులు రావడం లేదు.

భక్తుల అసంతృప్తి

శ్రీశైల క్షేత్రాన్ని సందర్శిస్తున్న భక్తుల సంతృప్తిస్థాయిని తెలుసుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఐబీఆర్‌ఎస్‌ కాల్స్‌ చేస్తోంది. సమయానుకూలంగా దర్శనాలు జరగకపోవడం, కనీస సౌకర్యాలు లేకపోవడం తదితర విషయాలపై భక్తులు అసంతృప్తి చెందుతున్నారు. దీంతో భక్తుల సంతృప్తి స్థాయిలో శ్రీశైల క్షేత్రం అట్టడుగు స్థాయికి చేరుకుంటోంది.

మెరుగుపడని సౌకర్యాలు

శ్రీశైల క్షేత్రంలో భక్తులకు సౌకర్యాలు మెరుగుపడడం లేదు. ప్రస్తుతం దేవస్థానంలో రేకుల షెడ్డులతో క్యూకంపార్ట్‌మెంట్లు ఉన్నాయి. అలాగే ఈ క్యూ కంపార్ట్‌మెంట్లలో సుమారు 10 వేల మంది మాత్రమే భక్తులు వేచి ఉండేలా ఉన్నాయి. దీంతో సాధారణ రోజుల్లోనే భక్తులు నానా అవస్థలు పడుతున్నారు. ఇక బ్రహ్మోత్సవాల సమయంలో అయితే భక్తుల అవస్థలు వర్ణానాతీతం. భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనలో భాగంగా అధునాతన టెక్నాలజీతో కూడిన నూతన క్యూకాంప్లెక్స్‌ నిర్మిస్తామని చెబుతునప్పటికీ ఇంతరవకు ఒక్క అడుగు ముందుకు సాగలేదు. అలాగే భక్తులకు సరిపడా వసతి సౌకర్యాలు లేవు. శ్రీశైల క్షేత్రంలో వసతి సౌకర్యాలు మెరుగుపడాల్సిన ఉంది. అయితే ఆ దిశగా ఒక్క అడగు కూడా పడలేదు.

శ్రీశైల క్షేత్ర అభివృద్ధిని మరచిన

చంద్రబాబు ప్రభుత్వం

సమావేశాలు, చర్చలకే పరిమితమైన

జంబో ట్రస్ట్‌బోర్డు

సౌకర్యాలు లేక భక్తులకు

తప్పని తిప్పలు

Advertisement
 
Advertisement
Advertisement