● సూపర్‌సిక్స్ పేరుతో
ప్రజలను మోసం చేశారు
● వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షుడు
కాటసాని రాంభూపాల్‌రెడ్డి
పాణ్యం: రాష్ట్రంలో అన్ని రంగాలు నిర్వీర్యం అయ్యాయని వైఎస్సార్‌సీపీ నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్‌రెడ్డి అన్నారు. పాణ్యంలో శుక్రవారం ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’ నిరసన చేపట్టారు. స్థానిక పాత ఆసుపత్రి నుంచి వైఎస్సార్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. మహానేత విగ్రహానికి గజమాల వేసి నివాళి ఆర్పించి కాటసాని మాట్లాడారు. ఎన్నికల ముందు ఓట్ల కోసం టీడీపీ అధినేత చంద్రబాబు అనేక హామీలు ఇచ్చారన్నారు. అధికారంలోకి వచ్చాక వాటి గురించి అడిగితే తప్పుడు కేసులు బనాయిస్తున్నారన్నారు. పక్క రాష్ట్రాల్లో మొక్కజొన్న క్వింటా ధర రూ.2,400 ఉంటే మన రాష్ట్రంలో రూ.1,500 మాత్రమే పలుకుతోందన్నారు. గిట్టుబాటు ధర ఇవ్వక, పంటలకు నష్ట పరిహారం అందించక రైతులను చంద్రబాబు వెన్నుపోటు పొడిచారన్నారు. ‘బాబూ ష్యూరిటీ .. మోసం గ్యారెంటీ’ అని అందరికీ అర్థమైందన్నారు.
మద్యం ఫుల్.. అభివృద్ధి నిల్
రాష్ట్రంలో మద్యం ఎక్కడ చూసినా దొరుకుతోందని, అభివృద్ధి మాత్రంకనిపించండం లేదని కాటసాని అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీలో మాత్రమే బెల్ట్‌షాప్‌లు 24 గంటలు పనిచేస్తున్నాయన్నారు. రాత్రింబవళ్లు డోర్‌డెలివరీ చేస్తున్న ఘనత ఏపీలోనే ఉందన్నారు. ప్రతి ఊర్లో టీడీపీ నాయకులు నాలుగు నుంచి ఐదు బెల్ట్‌షాప్‌లు నిర్వహిస్తున్నారన్నారు. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో కేవలం మద్యంషాప్‌లో మాత్రమే దొరికేదన్నారు. అధికారం ఎవ్వరికీ శాశక్వతం కాదని, అధికారులు చట్టం ప్రకారం నడుచుకోవాలన్నారు. ప్రజల తరఫున పోరాటేందుకే జనసేన పుట్టిందని చేప్పిన పవన్‌కళ్యాణ్ అధికారంలోకి వచ్చిన తర్వాత మాట మారుస్తున్నారన్నారు. సినిమాలో రీల్ హీరోగా ఉంటే నిజ జీవితంలో రియల్ హీరోగా రాణించలేకపోతున్నారన్నారు. అనంతరం టీడీపీ మేనిఫెస్టో ప్రతులను దహనం చేశారు. జెడ్పీటీసీ మాజీ సభ్యుడు సద్దల సూర్యనారాయణరెడ్డి, ఎంపీపీ ఉసేన్‌బీ, వైస్ ఎంపీపీలు వెంకటేశ్వర్లు, పార్వతమ్మ, మండల కన్వీనర్ కరుణాకర్‌రెడ్డి, మండల యూత్ ప్రెసిడెంట్ సద్దల సుజిత్‌రెడ్డి, జిల్లా పంచాయతీరాజ్ అధ్యక్షుడు రామలక్ష్మయ్య, ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు చాంద్‌బాషా, మాజీ సర్పంచ్‌లు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.


